ప్రకాశ్‌రాజ్‌ గెలుపుకోసం కృషి చేస్తాం

ABN , First Publish Date - 2021-10-07T06:13:13+05:30 IST

‘‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌కు మేము నూరు శాతం మద్దతిస్తాం. అన్నయ్య చిరంజీవికి ఆయన బాగా సన్నిహితులు. గతంలో ప్రకాశ్‌రాజ్‌తో అభిప్రాయ భేదాలు వచ్చాయి...

ప్రకాశ్‌రాజ్‌ గెలుపుకోసం కృషి చేస్తాం

‘‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌కు మేము నూరు శాతం మద్దతిస్తాం. అన్నయ్య చిరంజీవికి ఆయన బాగా సన్నిహితులు. గతంలో ప్రకాశ్‌రాజ్‌తో అభిప్రాయ భేదాలు వచ్చాయి. అయినా ‘సేవ చేస్తాను’ అని వచ్చారు. అందుకే అన్నయ్య ‘ప్రకాశ్‌రాజ్‌కి మనం సపోర్ట్‌ ఇవ్వాలి. వేరే వాళ్లకి మాట ఇవ్వవద్దు’ అని చెప్పారు. ఆయన గెలుపు కోసం మేం శాయశక్తులా కృషి చేస్తాం. ఇప్పుడు మాత్రమే కాదు, ఇంకో రెండు టర్మ్‌లు కూడా ఆయనే ‘మా’కు అధ్యక్షుడిగా ఉండాలి. అలా ఉంటానని ప్రకాష్‌రాజ్‌ మాటివ్వాలి’’ అని  నటుడు, నిర్మాత నాగబాబు కోరారు. మా ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న తాజా పరిణామాలపై బుధవారం నాగబాబు స్పందించారు. ఆయన మాట్లాడుతూ...


ఈ సారి మాత్రమే ‘మా’ ఎన్నికల కోసం పబ్లిక్‌లోకి వెళ్లాల్సిన దుస్థితి పట్టింది. ఒక వ్యక్తికి ఉన్న చెడు అలవాటు దానికి కారణం. తుమ్మినా దగ్గినా ప్రెస్‌ మీట్‌లు పెట్టాడు. నరేష్‌ నాకు ఫ్రెండే అయినా అలా మాట్లాడితే తట్టుకోలేం. 


నేను బీజేపీ సానుభూతిపరుణ్ణి. ప్రకాశ్‌రాజ్‌ కమ్యూనిస్ట్‌ భావాలు కలిగిన వ్యక్తి. అయినా మద్దతు తెలుపుతున్నామంటే ఆయన మంచితనమే కారణం. భారతదేశంలో ఉన్న గొప్ప నటుల్లో ప్రకాశ్‌రాజ్‌ ఒకరు. ఆయన స్థాయికి ఇవి చాలా చిన్న ఎన్నికలు. ‘అవసరమైతే ‘మా’ కోసం సినిమాలు కూడా వదులుకుంటాను’ అన్నాడు. దీనివల్ల ఆయన ఏమైనా పది రూపాయలు సంపాదించుకుంటాడా? 


‘ప్రకాశ్‌రాజ్‌ తెలుగువాడు కాదు’ అని కోట శ్రీనివాసరావు, బాబూమోహన్‌ అంటున్నారు. వాళ్లు ఇతర భాషల్లో నటించలేదా? అవసరమైతే బీజే పీ ప్రభుత్వం, నరేంద్రమోదీతో మాట్లాడి ఏదైనా తేగలిగే దమ్మున్నోడు ప్రకాశ్‌రాజ్‌. మీ ప్యానల్‌లో ఎవరికైనా అంత దమ్ముందా? గతంలో మేం నరేష్‌ ప్యానల్‌కు సపోర్ట్‌ చేశాం. మా వల్ల గెలిచారని అనను. కానీ మా మద్దతు అయితే అతనికి ఉంది. అయితే గెలిచిన వారిలో కొంతమంది తమను ‘హిజ్‌ హైనస్‌’ అంటూ గౌరవంగా సంబోధించాలని డిమాడ్‌ చేశారట. 


ప్రకాశ్‌రాజ్‌ను ‘పవన్‌ కల్యాణ్‌ వైపు ఉంటావా?, పరిశ్రమ వైపు ఉంటావా?’ అని విష్ణు అడిగాడు. పవన్‌ ఏమైనా బయటి వ్యక్తా. టాలీవుడ్‌ హీరో కాదా?


ఆదాయపు పన్ను ఎక్కువగా కట్టాల్సిరావడం వల్ల నష్టం వస్తుందని ‘మా’ బిల్డింగ్‌ కొన్నాం. అది అమ్మకుండా ఉంటే ఇప్పుడు రూ. కోటిన్నర విలువ చేసేది. నరేష్‌, శివాజీ రాజా ప్రమేయంతోనే దాన్ని అమ్మాం. మోహన్‌బాబు వారిని ప్రశ్నించాలి. 


‘మా’ అధ్యక్షుడిగా వచ్చేసారి అయినా పోటీ చేసి గెలవొచ్చు. కానీ ఇప్పుడే గెలిచితీరాలని ప్రస్టేజిగా తీసుకున్నారు. తొలిసారి ‘మా’ ఎన్నికల్లో ఆరిస్టులకు డబ్బు ఆశ చూపుతున్నారు అని తెలిసింది. ఓటుకు రూ. 10 వేలు ఇచ్చారనీ త్వరలో మరింత ముట్టచెబుతామని హామీ ఇస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. ఇలాంటి పనులతో కచ్చితంగా ‘మా’ ప్రతిష్ట మసకబారుతుంది. 


పోలీసులకు ఫిర్యాదు ఇదిలా ఉంటే తన పరువు ప్రతిష్ఠ దెబ్బ తీసే విధంగా అభ్యంతరకర పదజాలంతో నరేశ్‌, కరాటే కల్యాణి యూ ట్యూబ్‌ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారంటూ నటి హేమ బుధవారం మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ వీడియోలను తక్షణమే తొలగించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-07T06:13:13+05:30 IST