‘మా’ పదవులకు ప్రకాశ్ రాజ్ టీమ్ రాజీనామా.. లెటర్‌లో ఏముందంటే?

తాజాగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున పోటీ చేసి గెలిచిన వారంతా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఏ సంస్థ అయినా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలంటే అందరి ఆలోచనలు, ఆచరణలు.. ఒకేలా ఉండటం అవసరం.. అలా ఇక్కడ లేదంటూ ఓ లెటర్‌ని వారు ‘మా’కు సమర్పించారు. 


ఇందులో.. 

‘‘సర్, 

ఏ సంస్థ అయినా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలంటే అందరి ఆలోచనలు, ఆచరణలు.. ఒకేలా ఉండటం అవసరం. అప్పుడే సంస్థ సజావుగా, ఆరోగ్యంగా, సభ్యుల శ్రేయస్సు దిశగా నడిచే అవకాశం ఉంటుంది.

గత రెండేళ్లలో నరేష్‌గారు ‘మా’ అధ్యక్షులుగా ఉన్న సమయంలో, తానే వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం, అంతా తానే అయ్యి, ‘మా’ కోసం ఏ పనీ జరగనివ్వని స్థితికి తీసుకువచ్చారు. జరిగిన గొప్ప పనులపై కూడా బురద చల్లారు. ఇప్పుడు మళ్లీ అదే చరిత్ర పునరావృతం అవుద్దేమో అనే సంశయంతో ఉన్నాం. 

ఈసారి జరిగిన ఎలక్షన్స్‌లో శ్రీ విష్ణుగారి ప్యానల్ నుండి కొందరు, శ్రీ ప్రకాశ్ రాజ్‌గారి ప్యానల్ నుండి కొందరు గెలవడం జరిగింది. మళ్లీ మాలో మాకు భిన్న అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. సహజంగా ప్రశ్నించే వ్యక్తిత్తం ఉన్న మేము అడగకుండా ఉండలేము. అందుకని ‘మా’ సంస్థని శ్రీ విష్ణుగారి ప్యానల్ వ్యక్తులే నడిపితే మా సభ్యులకు మంచి జరగవచ్చు అనే ఆశతో, ఉద్దేశ్యంతో, మేము ‘మా’ పదవులకు మనసా వాచా కర్మణా.. రిజైన్ చేస్తున్నాం. 

అయితే మమ్మల్ని గెలిపించిన సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాకుంది. అందువల్ల భవిష్యత్తులో ‘మా’లో ఏ అభివృద్ధి జరక్కపోయినా, సంక్షేమ కార్యక్రమాలు జరక్కపోయినా ప్రశ్నిస్తుంటాం..’’ అని తెలిపారు.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.