‘మా’ రాజకీయ పార్టీ కాదు: ప్రకాశ్‌రాజ్‌

సినీ పరిశ్రమ ఎంతో సున్నితమైంది..

అందరూ అందరికి కావాల్సినవాళ్లే..

ఎవరు ఎటువైపు ఉన్నారనే ఊహాగానాలు అనవసరం

ఆర్టిస్ట్‌లు లోకల్‌ కాదు... యూనివర్సల్‌ 

ఏడాది నుంచి ప్యానల్‌ ఏర్పాటుపై ఆలోచన..

అవార్డులు వచ్చినప్పుడు నాన్‌లోకల్‌ ప్రస్తావన రాలేదే?

రెండు గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు నాన్‌లోకల్‌ అనలేదే..

కోపంతో వచ్చిన ప్యానల్‌ కాదిది... ఆవేదనతో పుట్టుకొచ్చింది..

ఈ నిర్ణయం వెనుక చాలా మథనం ఉంది..

ఎవరు ఎటు వెళ్లాలి అన్నది అర్థం కావట్లేదు..

‘మా’ అనేది రాజకీయ పార్టీ కాదు!!

ఇవి ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న ప్రకాశ్‌రాజ్‌ మాటలు..

సెప్టెంబర్‌లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా పోటీ చేయనున్న ఆయన గురువారం తన ప్యానల్‌ను ప్రకటించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రకాశ్‌రాజ్‌, ప్యానల్‌ సభ్యులు మాట్లాడారు. 


ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ ‘‘వారం రోజులుగా మీడియాలో వస్తోన్న ఊహాగానాలు చూస్తుంటే కాస్త భయమేసింది.  ‘మా’ ఎన్నికల్లో రాజకీయ నాయకులు భాగమవుతున్నారంటూ పలు వార్తలొచ్చాయి. నేను అధ్యక్షుడిగా పోటీ చేయాలన్న నిర్ణయం ఒక్క రోజులో తీసుకున్నది కాదు. ‘మా’ ఎదుర్కొంటున్న సమస్యల గురించి రెండేళ్లగా ఆలోచిస్తూ, ప్యానెల్‌లో ఎవర్ని తీసుకోవాలి?పరిశ్రమలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న విషయాలపై ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ‘మాది సినిమా బిడ్డల ప్యానల్‌. పదవీ కోసం కాకుండా పని చేయడం కోసం పోటీ చేస్తున్నాం. నా ప్యానల్‌లో ఉన్నవారంతా తప్పు జరిగి ప్రశ్నించేవాళ్లే. నేను తప్పు చేసినా బయటికి పంపేవాళ్లు నా ప్యానల్‌లో ఉన్నారు. చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్‌బాబు, నాగార్జున.. ఇలా ప్రతి ఒక్కరూ అసోసియేషన్‌ని అభివృద్థి చేయాలనే ఆలోచిస్తున్నారు. ‘ప్రకాశ్‌రాజ్‌ పలు భాషా చిత్రాలతో నిరంతరం బిజీగా ఉంటారు. ‘మా’ అధ్యక్ష పదవికి ఎంతవరకూ న్యాయం చేస్తారు? అసలు సమయం కేటాయించగలడా అన్న ప్రశ్నలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. నాకున్న సమయంలో సినిమాల్లో నటిస్తా, డైరెక్షన్‌ చేస్తా, ప్రొడక్షన్‌ చూసుకుంటా, పొలం దున్నుతా, పంట పండిస్తా, కుటుంబాన్ని చూసుకుంటున్నా.. ఇవన్నీ చేయగలుగుతున్నప్పుడు అఽధ్యక్షుడిగా పని చేయలేనా? సమయం విలువ తెలిసినవాడికి పని చేయడానికి చాలా సమయం ఉంటుందని నేను నమ్ముతా. తప్పకుండా ‘మా’కు న్యాయం చేయగల సమర్థత నాకుంది. పోటీచేయాలనే నిర్ణయం వెనుక చాలా మథనం ఉంది. అకారణ శత్రుత్వం వద్దు’’ అని అన్నారు. 

లోకల్‌.. నాన్‌ లోకల్‌ అప్పుడు గుర్తు రాలేదా? 

నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను అని ప్రకటించినప్పటి నుంచీ లోకల్‌, నాన్‌లోకల్‌ అనే మాటలు వినిపిస్త్తున్నాయి. కళాకారులకు ప్రాంతీయ భేదాలు ఉండవు. ఆర్టిస్టులు లోకల్‌ కాదు యూనివర్సల్‌. గత ఎలక్షన్లలో  నాన్‌లోకల్‌ అనే అంశం రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది. నా అసిస్టెంట్స్‌కి ఇళ్లు కొనిచ్చినప్పుడు నాన్‌లోకల్‌ అనలేదు. గ్రామాలు దత్తత తీసుకున్నప్పుడు నాన్‌ లోకల్‌ అనలేదు. తొమ్మిది నందులు, జాతీయ అవార్డు పొందినప్పుడు నాన్‌లోకల్‌ అనలేదు. ఇప్పుడు ఎందుకు నాన్‌లోకల్‌ అంటున్నారు? ఇది చాలా సంకుచితమైన మనస్తత్వం. మా ప్యానల్‌ ఆవేదనతో పుట్టుకొచ్చింది. మా టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టాలు అనుభవించిన వాళ్లే. అనుభవం కూడా ఉంది. మా ప్యానల్‌ సభ్యులంతా సర్వస్వతంత్రులు. కాబట్టి అర్హత చూసి ఓటు వేయండి. అన్ని ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. అందరూ ఆశ్చర్యపడేలా పని చేసి చూపిస్తాం. ఈ విషయంతో ప్రతిరోజూ పెద్దలందరితో మాట్లాడుతున్నాం. అలాగే ఫలానా వ్యక్తి ఆ కుటుంబానికి చెందినవాడు.. మరో ప్యానల్‌ ఈ కుటుంబానికి చెందినది అన్నది వాదనలూ వస్తున్నారు. ఇది చాలా సున్నితమైన కుటుంబం. అందరూ అందరికీ కావలసిన వారే. ఎవరు ఎటు వెళ్లాలి అన్నది అర్థం కావట్లేదు. ఎలక్షన్లకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. ‘మా’ భవనం ఎలా నిర్మిస్తాం.. ఇతర ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి అన్ని క్లారిటీగా వివరిస్తాం’’ అని చెప్పారు.


అన్నయ్య డైరెక్ట్‌గా ఇన్‌వాల్వ్‌ కారు: నాగబాబు

‘‘మీరు చాలా బిజీ ఆర్టిస్ట్‌. అఽధ్యక్షుడిగా మా’కు ఎంత వరకూ సమయం కేటాయించగలరు’ ప్రకాశ్‌రాజ్‌ ‘మా’ బరిలో ఉన్నానని ప్రకటించగానే ఆయన్ను నేను అడిగిన మొదటి ప్రశ్న ఇది. దానికి చాలా క్లియర్‌గా సమాధానం చెప్పారాయన. ప్రకాశ్‌ దగ్గర పక్కా ప్రణాళిక ఉంది. ఆయన చేసే సేవల గురించి అందరికీ తెలిసిందే! ఇక లోకల్‌, నాన్‌ లోకల్‌ అనేది అర్ధరహితమైన వాదన. ‘మా’లో మెంబర్‌షిప్‌ ఉన్న వ్యక్తి అధ్యక్ష పదవి నుంచి ఈసీ మెంబర్‌ వరకూ ఏ పదవికైనా పోటీ చేయవచ్చు. మనమంతా భారతీయ నటులం. ప్రకాశ్‌రాజ్‌ తెలంగాణాలో మూడు గ్రామాలను దత్తత తీసుకుని తెలుగువాడిగా సెటిల్‌ అయిన వ్యక్తి. ఒకవేళ లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే లెక్కలుంటే దానికి ప్రమాణికత ఏంటి? ఎన్నేళ్లు పనిచేస్తే లోకల్‌ అవుతారు? భారత సంతతి అమలా హారీస్‌ అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ అయ్యి నిరూపించింది. అక్కడ ప్రాంతీయ భేదం ఉండి ఉంటే ఆమె ఆ పదవి అందుకునేది కాదు. పెద్దవాళ్లకే లేని నిబంధనలు మనకేంటి? గత నాలుగేళ్లగా ‘మా’ అసోసియేషన్‌ మసకబారింది. డిగ్నిటీ తగ్గింది. ఈసారి అలాంటి వాటికి చోటు ఇవ్వకుండా ‘మా’కు మంచి గుర్తింపు తీసుకురావాలని అనుకుంటున్నాం. అన్నయ్య చిరంజీవి బ్లెసింగ్స్‌ ఉన్నాయి. ప్రకాశ్‌రాజ్‌ అన్నయ్యని అడిగినప్పుడు ‘మా’కు మంచి చేసే ఎవరికైనా సపోర్ట్‌గా ఉంటా. కానీ డైరెక్ట్‌గా నేను ఇన్‌వాల్వ్‌ కాను అన్నారు. ఇక్కడ వర్గ సమీకరణాలు, రాజకీయాలు ఏమీ లేవు’’ అని అన్నారు. 


వంద మైళ్లు పరిగెత్తగలడు: బండ్ల గణేశ్‌

27 ఏళ్ల క్రితం స్థాపించిన ‘మా’ అసోసియేషన్‌లో ఎంతోమంది అధ్యక్షులుగా పని చేశారు. ఎవరి స్థాయిలో వారు పనిచేసి అభివృద్ధికి సాయపడ్డారు. అనుకున్నవి కొన్ని జరగగపోవచ్చు. అయితే చేసే పనిలో 100 మైళ్లు టార్గెట్‌ పెట్టుకుంటే కొందరు 90 మైళ్లే పరిగెత్తగలరు. కానీ ప్రకాశ్‌ వంద మైళ్లు పరిగెత్తగలరు. ఇక సినిమా పరిశ్రమలో లోకల్‌, నాన్‌ లోకల్‌ అన్న భేదాలు లేవు. ఇక్కడ ‘మా’ అసోసియేషన్‌ అన్నదే మాట. వర్గ పోరాటాలు, కుల రాజకీయాలు మా మధ్య లేవు. పాత, కొత్త అందరి అనుభవాలు, సూచనలు తీసుకుని ప్రకాశ్‌ ముందుకెళ్తారని నమ్ముతున్నాం. 27 ఏళ్ళ తర్వాత 'మా'కు బిల్డింగ్ రాబోతుంది. గతంలో జరిగిన వాటిని మేం వేలెత్తి చూపించం. అందరం కలిసి పనిచేస్తాం’’ అని బండ్ల గణేశ్‌ అన్నారు.


ఆధరాభిమానాలు కావాలి: సాయికుమార్‌

సినిమా బిడ్డలం.. మన కోసం మనం.. మాకోసం మనం.. అనే నినాదంతో ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో నేనూ ఉండడం ఆనందంగా ఉంది. మా సపోర్ట్‌ ఆయనకు ఉంది. అలాగే ఆర్టిస్ట్‌ల అందరి సపోర్ట్‌ ఆయనకు కావాలి. ‘మా’కు, మా అందరికీ మీ ఆధరాభిమానాలు ఉండాలని కోరుకుంటున్నా’’  అని సాయికుమార్‌ అన్నారు. 


‘మా’కు ఆయన అవసరం ఉంది: జయసుధ

రానున్న మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ టీమ్‌లో ఉండి ఆయనకు అండగా ఉండబోతున్నాం. మేమిద్దరం ఎన్నో సినిమాల్లో నటించాం. మా జంటకు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు 2018లో ప్రకాశ్‌రాజ్‌ నాతో చెప్పారు. ఆయన ఆలోచనలను నాతో పంచుకున్నారు. ఆయన విజన్‌ ‘మా’కెంతో అవసరం. పరిశ్రమలోని పెద్దలందరి దీవెనలతో మా టీమ్‌ విజయం సాధిస్తుందని భావిస్తున్నా’’ అని జయసుధ పేర్కొన్నారు. 


ఐడియాలజీ నచ్చింది: అనసూయ భరద్వాజ్‌

ఈ ప్యానల్‌లో ఉండడానికి ప్రకాశ్‌రాజ్‌గారు కారణం. ‘మా’ అభివృద్ధి పట్ల ఆయనకున్న ఐడియాలజీ నాకు నచ్చి సపోర్ట్‌గా ఉన్నా. ఆయన ‘మా’ అధ్యక్షుడిగా ఉంటే వర్క్‌ ప్లేస్‌లో సెఫ్టీ ఉంటుందని నమ్ముతున్నా. గతంలో ఎన్నో జరిగి ఉండొచ్చు. అందరి ఐడియాలజీ ఒకలా ఉండదు. అలాంటప్పుడు కొన్ని ఫెయిల్యూర్‌ అయి ఉండచ్చు. అవన్నీ ఇప్పుడు అనవసరం. బాధ్యత తీసుకునే సమయంలో లోకల్‌, నాన్‌లోకల్‌ వివాదాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. పరభాష హీరోయిన్లతో సినిమాలు చేసినప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు రావు. నేను ఇక్కడ చాలా నేర్చుకోవాలి. ఆ తర్వాతే ఏమైనా మాట్లాడగలను’’ అని అనసూయ చెప్పారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.