అక్కినేని నవయువ కథానాయకుడు నాగచైతన్య (Naga Chaitanya) తాజా చిత్రం ‘థాంక్యూ’ (Thankyou) విడుదలకు సిద్ధమైంది. తదుపరిగా పరశురామ్ దర్శకత్వంలో ‘నాగేశ్వరరావు’ (Nageswararao) (working title) అనే చిత్రం ప్రారంభం కానుంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) చిత్రం ఖాయమైంది. నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలోనూ ఓ సినిమా ఉండబోతోంది. ఇంకా మరికొన్ని చిత్రాలు ప్లానింగ్‌లో ఉన్నాయి. ఇవిలా ఉంటే.. చైతూ మొదటి డిజిటల్ ఎంట్రీ ‘దూత’ (Dootha) వెబ్ సిరీస్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో సిరీస్ తెరకెక్కుతోంది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) లో ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదివరకు విడుదలైన ‘దూత’ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నాగచైతన్య జర్నలిస్ట్‌గా నటిస్తున్నాడు.
ఇక ‘దూత’ సిరీస్ లో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ ప్రాచీ దేశాయ్ (Prachi Desai) అధికారికంగా ఖాయమైంది. ఆ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా ఖాతా ద్వారా ప్రకటించింది. టీవీ సిరీయల్స్ తోనూ, ‘రాకాన్, లైఫ్ పార్టనర్, ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, బోల్ బచ్చన్, ఐ మీ ఔర్ మైన్’ లాంటి చిత్రాలతో బాగా పేరు తెచ్చుకుంది ప్రాచీ. అలాంటి టాలెంటెడ్ బ్యూటీ దూత సిరీస్ లో కథానాయికగా నటిస్తుండడం విశేషం. ఇందులో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సిరీస్ షూటింగ్ కోసం ప్రాచీ కొద్ది రోజులుగా హైదరాబాద్ లోనే ఉంది.
ఈ సిరీస్ లో నటిస్తున్నందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో ఒక ఫోటో షేర్ చేస్తూ పోస్ట్ పెట్టింది ప్రాచీ దేశాయ్. ‘దూత సిరీస్ లో నటిస్తు్న్నందుకు, దాని షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉండడం ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్నిచ్చిన దర్శకుడు విక్రమ్ కుమార్ కు, హీరో నాగచైతన్యకి ధన్యవాదాలు. తెలుగు నేర్చుకుంటూ, హైదరాబాద్ ఫుడ్ ను ఆస్వాదిస్తున్నాను..’ అని ప్రాచీ దేశాయ్ తెలిపింది. చైతూ, విక్రమ్ కుమార్ తో తాను కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. మరి ‘దూత’ సిరీస్ ఆమెకు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.