నాకలాంటి పాత్ర ఇంకా రాలేదు!

Twitter IconWatsapp IconFacebook Icon
నాకలాంటి పాత్ర ఇంకా రాలేదు!

తన అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సహజనటి జయసుధ కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నారు. అమెరికాలో నిర్మించే చిత్రాల్లో నటించడానికి సన్నద్ధమవుతున్నారు. దర్శకురాలుగా వైవిధ్యమైన చిత్రాలు రూపొందించాలని భావిస్తున్నారు.కొన్నాళ్ళుగా ఆ దేశంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆమె తన అనుభవాలను, ఆలోచనలను ‘నవ్య’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.


ఈ మధ్య అమెరికాలోనే ఎక్కువగా ఉంటున్నట్టున్నారు... ఆ దేశమంతా చుట్టేశారా?

అమెరికా వచ్చి అయిదు నెలలయింది. రోడ్‌ జర్నీ చాలా చేశాను. సుమారు నాలుగు నుండి అయిదు వేల మైళ్ల వరకు తిరిగాను. ఎంతో మంది విభిన్నమైన వ్యక్తులను కలిశాను. ఈ ప్రయాణంలో ‘సైట్‌ అండ్‌ సౌండ్స్‌’ అనే కాన్సెప్ట్‌ చాలా బాగుంది. మన ఇండియాలో అలాంటిది లేదు. బ్రాడ్‌ వే కన్నా బాగుంది. ‘సైట్‌ అండ్‌ సౌండ్స్‌’లో ‘జీసస్‌’ ఒకటి, ‘క్వీన్‌ ఎస్తర్‌’ అనేది ఒకటి. వివిధ నగరాల్లో ఈ రెండూ చూశాం. బతికి ఉన్న జంతువులు, నాటకాలు... ఇలాంటివన్నీ అక్కడ చూశాం. అవన్నీ చూడటం, భిన్నమైన వ్యక్తులను కలవడం... వాటికే సమయం ఎక్కువగా కేటాయించాం. ప్రదర్శనలు చూడటానికి వెళ్లే ముందు... నేను నటినని అందరికీ తెలిసింది. గూగుల్‌లో సెర్చ్‌ చేసి నా గురించి తెలుసుకున్నారు. డబ్బు తీసుకోకుండానే నాకు సీటు ఇచ్చేవాళ్లు. అక్కడ దాదాపు 2 వేల మంది మధ్య వయస్కుల వారితో పాటు పెద్దవారు ఎందరో ఉన్నారు. అందరూ మాస్కులు ధరించి, ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. నాకు మాత్రం ప్రతి షోకి వెళ్లి వచ్చే వరకు భయం భయంగా ఉండేది. దేవుడు చాలా గొప్పవాడు... ఇప్పటి వరకు సురక్షితంగా ఉంచాడు.


ఇన్ని సంవత్సరాల నుండి నటిస్తున్నారు. కొంత గ్యాప్‌ ఇచ్చి మళ్లీ ఇప్పుడు కొత్త చిత్రాలలో నటిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తోంది?

ఏ చిత్రం చేసినా ముందు కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే ‘డైరెక్టర్‌ ఎలా ఉంటారో? అతను ఏ విధంగా నటించమని అడుగుతారో?’ అనే ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. హాలీవుడ్‌లో అయితే ‘టేబుల్‌ రీడింగ్‌’ అని ఉంటుంది. నటీనటులందరినీ కూర్చోబెట్టి డైలాగ్స్‌ చెప్పించడం లాంటిది. మనకు కూడా పాత రోజుల్లో ఉండేది. ఎన్టీ రామారావుగారి కెరీర్‌ ప్రారంభం రోజుల్లో కొంతమంది దర్శకులు అలా చేసేవారని విన్నాను. మా సమయంలో అయితే లేదు. సెట్‌కి వచ్చిన తర్వాత డైలాగ్స్‌ రాయడం కదా... మేమంతా ఆ కాలానికి చెందిన వాళ్లం. అందుకని మాకు ప్రతి సినిమా, ప్రతి డైరెక్టర్‌ కొత్తగానే ఉంటారు. ఎందుకంటే మనం ఒకలా అనుకుంటాం. వారు ఎలా అనుకుంటున్నారోనని అనిపిస్తుంటుంది. అందుకే ప్రతి సినిమా మొదటి సినిమాలానే ఉంటుంది. ఒక్కసారి పాత్రలో లీనమైన తర్వాత మాత్రం మనసు తేలికగా అయిపోతుంది. మిగతావారి గురించి తెలియదు కానీ... ప్రతి సినిమాకు ముందు నాకయితే భయం ఉంటుంది. భయం అంటే భయం అని కాదు... చిన్న టెన్షన్‌ అంతే. 


ఇన్ని సినిమాలలో నటించిన తర్వాత, ఇంత అనుభవం ఉన్నా కూడా... టెన్షన్‌ ఉంటుందంటారు. అంతేనా?

అవును. నూరు శాతం అంతే. మనం అనుకునేది ఒకటైతే... అక్కడ దర్శకుడు వేరేలా తీస్తుంటే... దానికి కన్విన్స్‌ కావాలి. నేను 350కి పైగా సినిమాలు చేశాను. ఎప్పుడూ ఒకే విధమైన పాత్రలు కాకుండా... విభిన్నంగా అంటే మనం కూడా ఆశ్చర్యపడేలా ‘అబ్బ.., ఈ షాట్‌ భలే తీశారే! పాత్రను భలేగా రాశారే! నటన కూడా వైవిధ్యభరితంగా చేయమంటున్నారే! చాలా బాగుందే!’ అనిపించే చిత్రాలు, డైరెక్టర్స్‌ మనకు కావాలి. మణిరత్నంగారి సినిమా సెట్‌కి ఎప్పుడూ వెళ్లినా ఏదో తెలియని కొత్తదనం కనబడుతూ ఉంటుంది. అది చూసిన తర్వాత మాకు కూడా ఆయన ఊహించినట్టు, ఆయన అనుకున్నట్టు చేయాలనే ఉత్సాహం వస్తుంది. మణిరత్నంగారు చేస్తున్న సినిమా సెట్‌కి వెళ్లాలంటే ఇప్పటికీ నాకు టెన్షన్‌గానే ఉంటుంది.


ఈ మధ్యకాలంలో ఏవైనా సినిమాలు చూశారా?

చూశాను. అమెరికన్స్‌ చాలా మంది కుంగ్‌ఫూ, కరాటే ఉండే చైనీస్‌ పిక్చర్స్‌ బాగా ఇష్టపడతారు. మా ఫ్యామిలీ గ్రూప్‌లో ఉన్నవాళ్ళందరూ అటువంటి సినిమాలే ఎక్కువ చూస్తారు. వాళ్లు పిలిచినప్పుడు నేను కూడా అలాంటి సినిమాలే చూస్తున్నాను. కానీ నేను ట్రావెలింగ్‌లో ఉన్నాను కదా... సినిమాలు చూడటం చాలా తక్కువ.  థియేటర్‌ లైవ్‌ పెర్ఫామెన్స్‌, బ్రాడ్‌వే షోస్‌ ఇక్కడ ఎక్కువగా చూస్తున్నాను. ఇన్ని థియేటర్‌ లైవ్‌ పెర్ఫామెన్స్‌లు చూడటం ఇదే మొదటిసారి. ఆ ప్రదర్శనలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వాటిని చూస్తుంటే నాకు కూడా ‘ఇటువంటి వాటిలో నటించాలి. మళ్లీ మన ఇండియాలో కూడా స్టేజ్‌ షోలకు క్రేజ్‌ వస్తే... సినిమాలలో అవకాశాలు రాని ఎందరో నటీనటులకు గుర్తింపు వస్తుంది’ అని అనిపిస్తుంది. ఇక్కడ నేను చూసిన షోస్‌ లాంటివి చేస్తే తప్పకుండా క్రేజ్‌ వస్తుంది. అంత బాగున్నాయి.


మీరు చేసిన సినిమాలన్నింటిలో నటిగా అతి కష్టమైన పాత్ర ఏదని అనుకుంటున్నారు?

కష్టం అని చెప్పడానికి ఏమీ లేదు. కానీ... చెప్పాను కదా, మణిరత్నంగారి లాంటి వారి దగ్గర నటించేటప్పుడు మాత్రం టెన్షన్‌గా ఉంటుంది. అది కష్టం అని అనను కానీ.. ‘వారికి నచ్చినట్టు చేయాలి... ఏమనుకుంటారో? ఏమో?’ అనే ఆలోచన ఉంటుంది. అదైనా ఒక సన్నివేశం వరకే ఉంటుంది. రెండో సన్నివేశానికి అంతా మామూలుగానే ఉంటుంది. కాబట్టి అది పెద్ద కష్టమే కాదు. నాకు కష్టం అనిపించినవి చెప్పాలంటే.. పౌరాణిక చిత్రాలు. వాటిలో పెద్ద పెద్ద ఆభరణాలు తలకు పెట్టుకోవడం వల్ల తల తిరుగుతూ ఉండేది. ఆ తెలుగు భాష మాట్లాడటం కూడా కష్టంగా ఉండేది. నాకేమో నా వాయిస్‌ అలవాటైపోయింది. దానిని డబ్‌ చేయడానికి కుదరదు. ఇలాంటివే కొంచెం కష్టం అనిపించేవి. 


అంటే.. కాస్త కఠినంగా అనిపించిన పాత్రలు కూడా ఏమీ లేవా..?  

నాకంతగా గుర్తురావడం లేదు కానీ... ‘శివరంజని’, ‘ప్రేమాభిషేకం, ‘మేఘసందేశం’ లాంటి చిత్రాలు చూసినప్పుడు... అవి కమర్షియల్‌ సినిమాలు కాబట్టి, వాటికి తగినట్టు నటించాం. విభిన్నంగా మనం చేయాలంటే ఆ సినిమా తెరకెక్కే విధానమే విభిన్నంగా ఉండాలి. అంత భయపడి చేసిన సినిమాలైతే ఏమీ లేవు. ‘దుర్గాదేవి’ లాంటి సినిమాలు చేసేటప్పుడు గుర్రం ఎక్కడం, దిగడం, గట్టిగా అరవడం, మగాడిలా నడవడం.. ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం కాస్త ఇబ్బంది పడ్డాను. నటనపరంగా నాకు నచ్చింది చెప్పాలంటే... ‘శతమానంభవతి’ చిత్రంలోని పాత్ర. డైలాగ్స్‌ పెద్దగా లేకపోయినప్పటికీ కౌంటర్‌ రియాక్షన్స్‌, ప్రకాష్‌ రాజ్‌తో వచ్చే సీన్లు బాగుంటాయి. అయితే దాని కోసం నేను పెద్దగా చేసేంది ఏమీ లేదు. ఆ ఏడుపు, ఆ గోల... నేను ఎప్పుడూ చేసే పాత్రలే. అమ్మ, అమ్మమ్మ పాత్రలలో నాకు విభిన్నంగా అనిపించే పాత్రలు కానీ, కాస్త ప్రత్యేకం అనిపించే పాత్రలు కానీ ఇంకా రాలేదనే అనుకుంటున్నాను. అలాంటి వైవిధ్యభరితమైన పాత్రలు ఫుల్‌ లెంగ్త్‌లో రావాలంటే ఇంకొంచెం సమయం పడుతుంది. మనవాళ్లు అలాంటి సినిమాలు తీయడం లేదు. ఇప్పుడు ఓటీటీలు వచ్చాయి కాబట్టి... విభిన్నమైన చిత్రాలు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాను. 


మీరు ఓటీటీలలో సినిమాలు చూస్తుంటారా?

చూస్తుంటాను. ఈ మధ్యే ఒక సినిమా చూశాను. నాకు తెలిసిన వాళ్లు కొందరు ఇక్కడ హాలీవుడ్‌లో పని చేస్తున్నారు. ‘‘మీరెందుకు ఓటీటీలలో చేయడం లేదు?’’ అని వాళ్లు అడుగుతున్నారు. ‘‘అయ్యబాబోయ్‌.. నేనిప్పుడు కొత్తగా ఆడిషన్స్‌కు ఇచ్చి,. హాలీవుడ్‌లో ఎక్కడ చేయను?’’ అని చెప్పాను. ‘‘నటన పరంగా మీరు చాలా చేశారు. ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలేవైనా డైరెక్ట్‌ చేయవచ్చు కదా... మీరెందుకు డైరెక్షన్‌ చేయకూడదు? మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలు మీరు ఎక్కువ చేశారు. ఇండియాలో ఉన్న మహిళల ఇబ్బందులు తెలియజెప్పేలా సినిమా ఎందుకు చేయకూడదు?’’ అని అడిగారు. బెంగాలీలో ఈ మధ్య ఓ సినిమా వచ్చింది. దళిత జర్నలిస్ట్‌ మీద తీశారు. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అన్ని అవార్డులు ఆ సినిమాకే వచ్చాయి. అలాంటి సినిమాలు చూసినప్పుడు ‘అవును... మనం కూడా గొంతెత్తి చెప్పాలి.. మనమెందుకు దర్శకత్వం చేయకూడదు?’ అని అనిపిస్తుంది. అంతలోనే ‘ఇప్పుడు ఈ వయసులో డైరెక్షనా?’ అని కూడా అనిపిస్తుంది కానీ... దానికి వయసుతో సంబంధం ఏముంది?. అమెరికా వచ్చాక... అయిదు నెలల్లో నేను నేర్చుకున్నది ఏమిటంటే... ‘ప్రతిభ ఉండి పని చేయాలనుకుంటే.. వయసు అనేది అసలు అడ్డు కాదు’ అని. అలా ఇక్కడున్న వాళ్లు చాలామంది నన్ను దర్శకత్వం చేయమని అంటూ ఉంటే...  కొంచెం ఆ వైపు ఆలోచన మొదలైంది .‘నేనెందుకు చేయకూడదు, నాకున్న అనుభవానికి నేనెందుకు ప్రయత్నించకూడదు’ అని అనిపించింది.


మరి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా?

ఇండియాకు వచ్చిన తర్వాత కచ్చితంగా ప్రయత్నిస్తాను. ఇండియాకు సంబంధించిన స్టోరీని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో చెప్పాలనుకుంటున్నాను. మన దేశం గురించి చెప్పడానికి చాలా కథ ఉంది. మనవాళ్లు ఇండియా అనగానే ‘పేదరికం’ అని చెబుతుంటారు. ఇక్కడ పేదరికం లేదని నేను అనడం లేదు. కానీ దాని గురించే చెప్పాలని ఏమీ లేదు. ఇప్పుడు యువత మారిపోయారు. పూర్వంలా లేరు. ప్రస్తుతం తల్లితండ్రులు తమ పిల్లలను గొప్పవారిని చేయాలనునుకుంటున్నారు. అమెరికాకు కూడా భారతీయులే ఎక్కువగా వస్తున్నారు. పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వారే కాదు... ఆటో డ్రైవర్‌, బస్‌ డ్రైవర్ల పిల్లలు కూడా ఉన్నత చదువులు చదివి గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. విద్యాపరంగా మనవాళ్లు ఎంతగా ఎదుగుతున్నారనేది తెలుస్తూనే ఉంది. మనవాడు వేరే దేశంలో సీఈఓ అయినప్పుడు... మన దేశంలో మార్పు రావాలి కదా! అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అలా చూస్తే... ఇండియాలో ఉన్న అనేక విషయాల గురించి చాలా కథలు తయారు చేయవచ్చు. చూద్దాం... ముందు ముందు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాను.


గత అయిదు నెలల కాలంలో ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నానంటారు...

అవును. ఎన్నో తెలుసుకున్నాను. ముఖ్యంగా నాలో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పగలను. ఒక మహిళగా నాకు ఎప్పుడూ ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. ఇప్పుడు ‘నా చుట్టూ పది మంది ఉన్నారు. నేను కచ్చితంగా చేయగలను’ అనే ధైర్యం వచ్చింది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మన వయసును బట్టి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే... ఎంత కష్టమైన పనినైనా చేయగలం. 


ఇప్పుడు మీరు ఒక్కరే జర్నీ చేస్తున్నారా?

లేదు లేదు.. మా కజిన్స్‌ ఉన్నారు. ఫ్యామిలీ ఉంది. స్నేహితులు ఉన్నారు. సమయాన్ని బట్టి ఒక్కో గ్రూపుతో జర్నీ ఉంటుంది. వచ్చిన తర్వాత... ఒకరి తరువాత ఒకరుగా పరిచయం అవుతారు కదా... వారితో ఒక అనుబంధం ఏర్పడుతుంది. 


ఒక ఇంగ్లీష్‌ మూవీ పూర్తి చేయడానికి వచ్చానన్నారుగా?

అది తెలుగు సినిమానే కానీ మాట్లాడటం అంతా ఇంగ్లీష్‌లో ఉంటుంది. ‘ఐస్‌ బ్రేక్‌’ అనే ఈ సినిమాకు అయోధ్య కుమార్‌ అంతా సిద్ధం చేసుకున్నారు. వచ్చే నెలలో... అంటే నేను ఇండియాకు వెళ్ళి, ఇక్కడికి తిరిగి వచ్చాక, అలాగే వర్క్‌పర్మిట్‌ వచ్చాక షూటింగ్‌ చేస్తాను.


మీ తర్వాత సినిమా అమెరికాలో షూటింగ్‌ జరగనుంది? అంతేనా?

అవును.. ఇప్పుడు అవకాశం వచ్చిన సినిమాలన్నీ అమెరికా నేపథ్యంలోనివే. ఒకటి మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా. ఇంకోటి షార్ట్‌ స్టోరీ సినిమా. ఆ షార్ట్‌ స్టోరీ సినిమాలో నేను రెండు సన్నివేశాల్లో చేయాలి. అది కూడా అమెరికా నేపథ్యంలోనే ఉంటుంది. అమెరికాలో ఉండే భారతీయులను బేస్‌ చేసుకున్న సినిమా అది.
నాకలాంటి పాత్ర ఇంకా రాలేదు!


నాకలాంటి పాత్ర ఇంకా రాలేదు!

అమెరికా వెళ్లిన తర్వాత చాలా నేర్చుకున్నానన్నారు! ఇక్కడికి, అక్కడికి మీరు గమనించిన తేడా...

భోజనం చేసేటప్పుడు టేబుల్‌ దగ్గర భిన్నమైన దేశాల వారిని చూసి ‘దేవుడా... ఏమిటీ సృష్టి?’ అని అనిపించింది. ఇండియన్‌, బ్లాక్‌, లాటినో, చైనీస్‌, స్పానిష్‌... ఇలా మేమంతా కలిసి ఒకే చోట భోజనం చేయడానికి కూర్చున్నాం. వారితో పరిచయం పెంచుకున్నప్పుడు.... అందరూ ఎంతో కాన్ఫిడెన్స్‌తో మాట్లాడేవారు. వారిలో నిజాయితీ, మంచితనం గమనించాను. అక్కడ నెగిటివ్‌నెస్‌ అనేది లేదు. విశ్వాసం, మంచితనం... వాటి గురించి ఎక్కువగా మాట్లాడేవారు. నేను అప్పుడప్పుడు భయపడేదాన్ని. వారు ధైర్యం చెప్పేవారు. ‘‘ఎందుకు భయపడుతున్నారు. అయితే అవుతుంది.. అవనీయండి’’ అనేవారు. అలాగే ఇక్కడ అందరిలో క్లారిటీ గమనించాను. ‘నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ’ అనే బేధాలు లేవు. మరీ ముఖ్యంగా ఒకరు ఏదైనా చెబితే... వారి మాట మీదే అందరూ సర్దుకుపోతారు. వేరే దేశం నుండి వచ్చిన వారిని గౌరవించడమే కాకుండా బాగా చూసుకుంటారు. ఇబ్బందులు పడేవారు కూడా ఉన్నారు.. కాదనను. మన ఇండియా ఉత్తమమైన దేశం. దీనికి మరో దేశంతో పోలికే లేదు. కానీ ఆత్మవిశ్వాసం మోతాదు కొంచెం తక్కువ. అమెరికాలో నాకు నచ్చిన మరో విషయం ఏమిటంటే... వయసు పైబడినవారు ఎక్కువగా పని చేస్తున్నారు. అలాంటివారికి అవకాశం ఇస్తున్నారు. రెస్టారెంట్లలో 60, 70 ఏళ్ళ కన్నా ఎక్కువ వయసున్నవారు పని చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద స్టోర్స్‌లో కూడా అలాంటి వారే ఉంటారు. మనవాళ్ళయితే... ఆ వయసువారిని ఇంట్లోకి పంపించి, ‘ఇక్కడ కూర్చో!’  అంటూ ఉంటారు. అలాంటిది ఇక్కడ లేదు. ఆ వయసులోనూ పని చేస్తున్నవారిని చూసినప్పుడు... వారిలా మనమెందుకు చెయ్యకూడదనే స్ఫూర్తి నాకు కలిగింది. అది నాకు బాగా నచ్చిన విషయం. 


 సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

మీకు తెలుసా !..Latest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.