అశ్లీలమా? శృంగారమా?

ABN , First Publish Date - 2021-07-21T09:50:53+05:30 IST

రాజ్‌ కుంద్రా... ప్రస్తుతం వార్తల్లో వ్యక్తి. హిందీ కథానాయిక శిల్పాశెట్టి భర్తగా సినిమా ప్రేక్షకులకు తెలుసు. ఆయన వ్యాపారవేత్త కూడా! కానీ, ఇప్పుడు వార్తల్లో ఉండటానికి కారణం భార్య కాదు...

అశ్లీలమా? శృంగారమా?

రాజ్‌ కుంద్రా... ప్రస్తుతం వార్తల్లో వ్యక్తి. హిందీ కథానాయిక శిల్పాశెట్టి భర్తగా సినిమా ప్రేక్షకులకు తెలుసు. ఆయన వ్యాపారవేత్త కూడా! కానీ, ఇప్పుడు వార్తల్లో ఉండటానికి కారణం భార్య కాదు, వ్యాపారం! అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు. దాంతో ఒక్కసారిగా ఏది అశ్లీలం? ఏది శృంగారం? అనే చర్చ సైతం మొదలైంది. రాజ్‌ కుంద్రాకు గెహ్నా వశిష్ఠ్‌ మద్దతు పలకగా... తనను న్యూడ్‌ ఆడిషన్‌ ఇవ్వమన్నారని సాగరికా సోనా సుమన్‌ మాట్లాడిన వీడియో వైరల్‌ అవుతోంది. అరెస్ట్‌ తర్వాత కంగనా రనౌత్‌, పూనమ్‌ పాండే సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజ్‌ పాత ట్వీట్లు, ఓ టీవీ షోలో మాటలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు, రాజ్‌ కుంద్రా అరెస్ట్‌కు కారణం ఏమిటి? ఈ గొడవ ఎలా మొదలైంది?


రాజ్‌ కుంద్రా అరెస్ట్‌కు కారణమైన కేసు ఉన్నట్టుండి పెట్టిందేమీ కాదు. ఈ ఏడాది ఆరంభంలో నమోదైనదే. ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఫిబ్రవరిలో అడల్ట్‌ ఫిల్మ్‌ రాకెట్‌ను చేధించారు. అశ్లీల చిత్రాల్లో (పోర్న్‌ ఫిల్మ్స్‌) నటించాల్సిందిగా మహిళలను బలవంతం చేస్తున్నారనే ఆరోపణపై కొందరిపై కేసు నమోదు చేశారు. వెబ్‌ సిరీస్‌లో అవకాశం ఇస్తామని చెబితే వెళ్లానని, తీరా వెళ్లిన తర్వాత అందాల ప్రదర్శన చేయమని బెదిరించారని ముగ్గురు మహిళలు(ఔత్సాహిక నటీమణులు) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఆ కేసులో హిందీ నటుడు ఉమేశ్‌ కామత్‌, నటి గేహనా వశిష్ఠ్‌ను అరెస్ట్‌ చేశారు. వీడియో ఎప్పటిదీ అనేది స్పష్టత లేనప్పటికీ... వీడియో కాల్‌లో తనను న్యూడ్‌ ఆడిషన్‌ ఇవ్వమని ఉమేశ్‌ అడిగినట్టు సాగరికా సోనా సుమన్‌ మాట్లాడిన వీడియో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం గేహనా బెయిల్‌పై విడుదలై బయట ఉన్నారు. మరి, రాజ్‌ కుంద్రా ఎందుకు పోలీసు కస్టడీలోకి వెళ్లారు? ఆయనకు, ఈ కేసుకు సంబంధం ఏమిటి?


కారణాలు ఇవే!

అశ్లీల చిత్రాలు (పోర్న్‌ ఫిల్మ్స్‌) రూపొందించడం, వీక్షకుల నుంచి సబ్‌స్ర్కిప్షన్‌ ఫీజు వసూలు చేసే మొబైల్‌ అప్లికేషన్స్‌ (యాప్స్‌)లో విడుదల చేయడం దేశంలో అక్రమవ్యాపారం. అశ్లీల చిత్రాలు అప్‌లోడ్‌ చేసిన యాప్స్‌లో ఒకటైన ‘హాట్‌షాట్స్‌’ను డెవలప్‌ చేసిన ఆర్మ్స్‌ ప్రైమ్‌ ప్రై.లి. కంపెనీ రాజ్‌కు చెందినదని ఆరోపిస్తున్నారు. వీటిలో విడుదల చేసిన చిత్రాల ద్వారా రాజ్‌ కుంద్రా, ఆయన తల్లితండ్రులు లక్షల్లో లాభార్జన గడించారని పేర్కొన్నారు. ఆ చిత్రాలు అప్‌లోడ్‌ చేస్తున్న యాప్స్‌కు 20 లక్షలమంది సబ్‌స్రైబర్లు ఉన్నారని, ఎలా లేదన్నా నెలకు రూ. 60 లక్షల ఆదాయం అందుతోందని ముంబై గుసగుస. ఈ కేసులో రూ.7 కోట్ల అక్రమ సంపాదనను పోలీసులు సీజ్‌ చేశారని సమాచారం. గతంలో ఈ కేసు విషయమై రాజ్‌ కుంద్రా స్పందించారు. ‘‘నేను ఆర్మ్స్‌ప్రైమ్‌ మీడియాలో కొంత పెట్టుబడి పెట్టాను. సెలబ్రిటీలకు అది యాప్స్‌ డెవలప్‌ చేస్తుంది. ఆ కంపెనీలోంచి 2019లో వైదొలిగా. ప్రస్తుత స్టేక్‌ హోల్డర్లకు నా షేర్లు అమ్మేశా. దానిపై వేసిన కేసు గురించి నాకు తెలియదు’’ అని ఆయన పేర్కొన్నారు.


రాజ్‌ కంపెనీలో ఉమేశ్‌... ఛాటింగ్స్‌ కీలకం!

అడల్ట్‌ ఫిల్మ్‌ రాకెట్‌ను చేధించే క్రమంలో పోలీసులు గతంలోనే తొమ్మిది మందిని ఆరెస్ట్‌ చేశారు. అందులోని ఉమేశ్‌, గతంలో రాజ్‌ కుంద్రా దగ్గర పని చేశారు. గేహనా వశిష్ఠ్‌ తీసుకున్న ఎనిమిది అశ్లీల చిత్రాలను అతను యాప్‌లో అప్‌లోడ్‌ చేశారనేది ఆరోపణ. ఉమేశ్‌, యూకే ప్రొడక్షన్‌ కంపెనీ కెన్‌రిన్‌, రాజ్‌ కుంద్రా మధ్య అశ్లీల చిత్రాలకు సంబంధించి జరిగిన వాట్సాప్‌ ఛాటింగ్స్‌ ఆధారంగా అరెస్ట్‌లు జరిగాయి. అడల్ట్‌ ఫిల్మ్‌ రాకెట్‌, పోర్న్‌ మాఫియాకు ప్రధాన సూత్రధారి రాజ్‌ కుంద్రా అని పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా ఆధారాలతో ఆయన్ను అరెస్ట్‌ చేశామంటున్నారు.


అశ్లీల చిత్రాలు వర్సెస్‌ వ్యభిచారం!

రాజ్‌ కుంద్రా అరెస్ట్‌ తర్వాత గతంలో ఆయన చేసిన ట్వీట్లు వైరల్‌ అవుతున్నాయి. ‘‘పోర్న్‌ వర్సెస్‌ ప్రాస్టిట్యూషన్‌... కెమెరాలో శృంగారం చేస్తున్న వ్యక్తులను చూడటం కోసం డబ్బు చెల్లించడం ఎందుకు చట్టబద్ధం కాదు? అందుకు ఇంకొకటి (నేరుగా ఓ వ్యక్తికి డబ్బులిచ్చి శృంగారం చేయడం) ఎందుకు భిన్నమైనది?’ అని మార్చి 29, 2012లో రాజ్‌ కుంద్రా ట్వీట్లు చేశారు. అదే ఏడాది మే 3న ‘‘యాక్టర్లు క్రికెట్‌ ఆడుతున్నారు. క్రికెటర్లు రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయ నాయకులు అశ్లీల చిత్రాలు చూస్తున్నారు. అశ్లీల చిత్రాల్లో నటించిన తారలు యాక్టర్లు అవుతున్నారు’’ అని మరో ట్వీట్‌ చేశారు. భార్య శిల్పాశెట్టి, మరదలు షమితా శెట్టితో కపిల్‌ శర్మ షోకు ఓసారి రాజ్‌ కుంద్రా వెళ్లారు. అప్పుడు ‘‘సినిమా తారలతో ఫుట్‌బాల్‌ మ్యాచులు ఆడతారు. భ్యారతో షాపింగ్‌కు వెళతారు. ఎప్పుడు చూసినా పార్టీలు అంటారు. మీరు ఇంత లగ్జరీగా బతకడానికి ఎక్కడ నుంచి వస్తుంది? 


డబ్బు సంపాదించే టైమ్‌ ఎక్కడిది?’’ అని రాజ్‌ కుంద్రాను కపిల్‌ శర్మ ప్రశ్నించారు. ఇప్పుడు ఆ వీడియో, రెండు ట్వీట్లు వైరల్‌ అవుతున్నాయి. సులభంగా డబ్బు సంపాదించడానికి అక్రమ మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడని, అశ్లీల చిత్రాలను ప్రోత్సహిస్తున్నాడని రాజ్‌ కుంద్రా మీద నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. 


రాజ్‌ కుంద్రా అరెస్ట్‌ తర్వాత ఆయనకు రాఖీ సావంత్‌, గేహనా వశిష్ఠ్‌ మద్దతుగా నిలిచారు. రాజ్‌ను దోషిగా నిర్ధారించలేదు కనుక, ఆయన్ను ట్రోల్‌ చేయవద్దని రాఖీ సావంత్‌ వ్యాఖ్యానించారు. రాజ్‌ కుంద్రా న్యాయవాది సైతం అవి అశ్లీల చిత్రాలు కాదంటున్నారు. రాజ్‌ కుంద్రాపై తాను 2019లో కేసు పెట్టానని పూనమ్‌ పాండే తెలిపారు. అంతకు మించి వివరాలు వెల్లడించలేదు. రాజ్‌ కుంద్రా కేసు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అవుతోంది.ఈ నెల 23వరకూ ఆయన కస్టడీని పోలీసులకు అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.



‘‘చిత్ర పరిశ్రమను మురికి కాలువ అనేది ఇందుకే. కనిపించే మెరుపులన్నీ బంగారం కాదు. నేను నిర్మిస్తున్న ‘టీకూ వెడ్స్‌ షేరూ’లో బుల్లీవుడ్‌ (బాలీవుడ్‌)లో ఏం జరుగుతుందో చూపిస్తా. మనకు విలువలు ఉన్న వ్యవస్థ, సృజనాత్మక చిత్ర పరిశ్రమ కావాలి’’ 

- కంగనా రనౌత్‌  



అవి అశ్లీల చిత్రాలు కాదు - గేహనా వశిష్ఠ్‌


ఈ కేసుతో సంబంధం కలిగి, గతంలో జైలుకు వెళ్లి బెయిల్‌ మీద వచ్చిన గేహనా వశిష్ఠ్‌ మాత్రం అవి అశ్లీల చిత్రాలు కాదంటున్నారు. ‘‘బోల్డ్‌ కంటెంట్‌ను పోర్న్‌తో కలపకూడదు. అవి ఏక్తా కపూర్‌, అనురాగ్‌ కశ్యప్‌, విభు అగర్వాల్‌, ఇతర దర్శక-నిర్మాతలు తీసేటటువంటి బోల్డ్‌ చిత్రాలే. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌లో ఇంతకంటే బోల్డ్‌ కంటెంట్‌ ఉంది. శృంగారానికి, అశ్లీలతకు మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలి. మేం తీసిన చిత్రాలు చూసి కామెంట్‌ చేయండి’’ అని గేహనా వశిష్ఠ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. హిందీ ‘బిగ్‌ బాస్‌’తో పేరు తెచ్చుకున్న ఈవిడ, అంతకు ముందు తెలుగులో ‘ఆపరేషన్‌ దుర్యోధన’ సహా కొన్ని చిత్రాల్లో ఐటమ్‌ సాంగులు చేశారు. ఏక్తా కపూర్‌ నిర్మించిన బోల్డ్‌ సిరీస్‌ ‘గండీ బాత్‌’లో నటించారు. 

Updated Date - 2021-07-21T09:50:53+05:30 IST