ఎస్వీ రంగారావు తుపాకీ చూసిన పోలీస్‌ కమీషనర్‌ రియాక్షన్‌ ఇదే

ABN , First Publish Date - 2021-05-04T01:57:53+05:30 IST

‘మీ డిమాండ్‌కు తగ్గట్లు పారితోషికం పెంచవచ్చు కదా’ అని ఒకసారి ఓ పాత్రికేయుడు ప్రశ్నిస్తే, ‘ఎందుకయ్యా పెంచి నిర్మాతలను ఇబ్బంది పెట్టడం... ఒకవేళ పెంచినా ఆ మొత్తాన్ని ఆదాయపు పన్ను అధికారులకు కట్టాల్సిందే కదా’ అనేవారు. పారితోషికం కోసం రంగారావు

ఎస్వీ రంగారావు తుపాకీ చూసిన పోలీస్‌ కమీషనర్‌ రియాక్షన్‌ ఇదే

- 16 ఎం.ఎం. కెమెరాతో ఫొటోలు.. మిత్రుల నుంచి ప్రశంసలు

- ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ కంటే ఒక్క రూపాయైనా ఎక్కువ ఇవ్వాలిందే 

- గొప్ప నటుడు, పుస్తక ప్రియుడే కాదు మంచి వేటగాడు


పుస్తక ప్రియుడు

విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు గొప్ప నటుడే కాదు.. పుస్తక ప్రియుడు కూడా. షూటింగ్‌ స్పాట్‌లో కాస్త గ్యాప్‌ దొరికితే చాలు ఏదో పుస్తకం చదువుతుండేవారు. ముఖ్యంగా ఆయనకు వివేకానందుని రచనలంటే చాలా ఇష్టం. ఆయనకు సంబంధించిన పుస్తకాలు సేకరించి భద్రపరిచేవారు. రంగారావుకు ఉన్న మరో హాబీ ఫొటోగ్రఫీ. ఆయన దగ్గర రకరకాల కెమెరాలు ఉండేవి. వాటితోపాటు 16 ఎం.ఎం. కెమెరా కూడా ఉండేది. కొల్లేరు ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి రమణీయ దృశ్యాలను 16 ఎం.ఎం. కెమెరాతో చిత్రీకరించి, చెన్నై తిరిగి వచ్చిన తర్వాత తన మిత్రులకు ప్రదర్శించి.. వారి ప్రశంసలు పొందేవారు.


డబ్బు మనిషి కాదు

తను దర్శకత్వం వహించిన ‘చదరంగం’, ‘బాంధవ్యాలు’ చిత్రాలు ప్రేక్షకుల ప్రశంసల్నీ, ప్రభుత్వ అవార్డుల్నీ పొందినా రంగారావు దర్శకత్వం కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. అలాగే ఆర్టిస్ట్‌గా తనకు ఎంతో డిమాండ్‌ ఉన్నా పారితోషికం విషయంలో మాత్రం లిబరల్‌గా ఉండేవారు. ‘మీ డిమాండ్‌కు తగ్గట్లు పారితోషికం పెంచవచ్చు కదా’ అని ఒకసారి ఓ పాత్రికేయుడు ప్రశ్నిస్తే, ‘ఎందుకయ్యా  పెంచి నిర్మాతలను ఇబ్బంది పెట్టడం... ఒకవేళ పెంచినా ఆ మొత్తాన్ని ఆదాయపు పన్ను అధికారులకు కట్టాల్సిందే కదా’ అనేవారు. పారితోషికం కోసం రంగారావు నిర్మాతలను పీడించిన సందర్భాలు లేవు కానీ ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ కంటే ఒక్క రూపాయి అయినా తన పారితోషికం ఎక్కువగా ఉండాలని ఆయన పట్టుబట్టిన సంఘటనలు ఉన్నాయి. ఇవ్వాల్సిన పారితోషికాన్ని నిర్మాతల నుంచి గట్టిగా అడిగి తీసుకోవడం లేదని రంగారావు సతీమణి భర్తతో కలహించిన సందర్భాలూ ఉన్నాయి. 


వేటగాడు

రంగారావు గొప్ప నటుడు, పుస్తక ప్రియుడే కాదు మంచి వేటగాడు కూడా. ఆ రోజుల్లో ప్రతి నెలా వేటకు వెళ్లేవారు. ఒక్కోసారి ఆయనతో పాటు శివాజీగణేశన్‌ కూడా వెళ్లేవారు. రంగారావు దగ్గర ఓ తుపాకీ ఉండేది. అది చాలా బరువైంది కూడా. వారానికి ఒకసారి ఆ తుపాకిని శుభ్రం చేసేవారు. ఒకసారి లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం పోలీస్‌ కమిషనర్‌ దగ్గరకి వెళితే నీట్‌గా ఉన్న ఆ తుపాకీని చూసి ఆయన ముచ్చటపడి, తన సిబ్బందిని పిలిచి ‘తుపాకీని ఎలా శుభ్రంగా ఉంచాలో ఈయన దగ్గర నేర్చుకోండి’ అని చెప్పడం విశేషం.

-వినాయకరావు

Updated Date - 2021-05-04T01:57:53+05:30 IST