‘ప్లాన్-బి’ మూవీ రివ్యూ
ABN , First Publish Date - 2021-09-17T07:23:50+05:30 IST
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామానికి చెందిన ప్రజలకు వీర్యకణాల లేమి కారణంగా సంతానం అనేది కలగదు. ఈ సమస్యతో నిరాశతో ఉన్న ఆ గ్రామానికి ఓ డాక్టర్ వచ్చి.. సమస్యను తీర్చి ఆ గ్రామ ప్రజలకు దేవుడవుతాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక జంటకు మాత్రం పిల్లలు పుట్టరు. అప్పుడు ఆ డాక్టర్ వారికి..

చిత్రం: ప్లాన్-బి
విడుదల తేదీ: 17, సెప్టెంబర్ 2021
నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్, నవీనారెడ్డి, మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్, కునాల్ శర్మ తదితరులు
బ్యానర్: ఏవీఆర్ మూవీ వండర్స్
మ్యూజిక్: స్వర
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: శక్తికాంత్ కార్తీక్
ఎడిటింగ్: ఆవుల వెంకటేష్
కెమెరా: వెంకట్ గంగాధరి
నిర్మాత: ఏవీఆర్
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కెవి రాజమహి
టాలీవుడ్‌లో ‘హిట్’ తర్వాత ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాలు అంతగా రాలేదు. ఒకటి రెండూ వచ్చినా అవి ఓటీటీలో విడుదలవడంతో.. పెద్దగా ప్రేక్షకులకు అవి రీచ్ కాలేదు. ఇప్పుడు ‘ప్లాన్-బి’ టైటిల్‌తో ఈ శుక్రవారం ఓ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. కరోనాతో పాటు, ఏపీలో సినిమా ఇండస్ట్రీకి ఉన్న సమస్యల దృష్ట్యా కొన్ని పెద్ద సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీ బాట పడుతున్నాయి. ఇటువంటి సమయంలో సినిమాపై ఉన్న కాన్ఫిడెంట్‌తో ‘ప్లాన్-బి’ చిత్ర దర్శకనిర్మాతలు మాత్రం థియేటర్‌లోనే ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కమెడియన్ నుండి హీరోగా మారిన శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్ర ట్రైలర్ విడుదల తర్వాత ఇందులో ఏదో మ్యాటర్ ఉన్నట్లే కనిపించింది. మరి ఆ మ్యాటరేంటి? ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని థియేటర్‌కి రప్పించే కంటెంట్ ఈ చిత్రంలో ఉందా? ‘హిట్’ తర్వాత వచ్చిన గ్యాప్‌ని ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిల్ చేసిందా? వంటి విషయాలను రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామానికి చెందిన ప్రజలకు వీర్యకణాల లేమి కారణంగా సంతానం అనేది కలగదు. ఈ సమస్యతో నిరాశతో ఉన్న ఆ గ్రామానికి ఓ డాక్టర్ వచ్చి.. సమస్యను తీర్చి ఆ గ్రామ ప్రజలకు దేవుడవుతాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక జంటకు మాత్రం పిల్లలు పుట్టరు. అప్పుడు ఆ డాక్టర్ వారికి కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలు ఎలా పుడతారో చెప్పి.. ప్రాసెస్ స్టార్ట్ చేసి వారికి ఓ బిడ్డ పుట్టేలా చేస్తాడు. ఆ తర్వాత ఆ డాక్టర్, అతని వైఫ్ హత్యగావింపబడతారు. ఇక ప్రస్తుతానికి వస్తే.. తెలంగాణ రాష్ట్రంలో సద్దాం (కునాల్ శర్మ) అనే మాఫియా నాయకుడి కన్ను, రిటైర్డ్ పోలీసాఫీసర్ (రాజేంద్ర)కి ఉన్న భూమిపై పడుతుంది. దానిని సొంతం చేసుకునే ప్రాసెస్‌లో ఆ పోలీస్ అధికారిని సద్దాం చంపేస్తాడు. చనిపోతూ ఆ ఆఫీసర్ తన కూతురు అవంతిక(డింపుల్)కు రూ. 10 కోట్లు ఇస్తాడు. అవంతిక తను ప్రేమించిన గౌతమ్(సూర్య వశిష్ఠ)తో కలిసి తండ్రి అస్థికలు కలపడానికి రాజమండ్రి వెళ్లి వచ్చేసరికి ఆ రూ. 10 కోట్లు దొంగిలించబడతాయి. అదే సమయంలో లాయర్ విశ్వనాధ్(శ్రీనివాసరెడ్డి), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా చేస్తోన్న రిషి(అభినవ్ సర్దార్) హత్యకు గురవుతారు. ఈ హత్యలకు, ఆ రూ. 10కోట్లకు, అలాగే గ్రామంలోని డాక్టర్ మరియు అతని వైఫ్ హత్యకు ఉన్న లింకేంటి? ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ విఖ్యాత్‌సేన(మురళీశర్మ) ఈ కేసును చేధించే క్రమంలో తెలుసుకున్న ‘ప్లాన్-బి’ ఎవరు? వంటి విషయాలను తెలుసుకోవాలంటే థియేటర్‌లో ఈ చిత్రం చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డికి విభిన్నతరహా పాత్రలో నటించే అవకాశం దక్కింది. తనకున్న అనుభవంతో శ్రీనివాసరెడ్డి ఈ పాత్రను సునాయాసంగా చేశాడు. వకీల్‌సాబ్‌గా వాదించే సన్నివేశాలు లేవు కానీ, వైవిధ్యభరిత పాత్రతో మాత్రం ఆకట్టుకున్నాడు. అతని భార్య జ్యోతి పాత్రలో చేసిన నవీనారెడ్డిది అంతగా ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదు. ఉన్నంతలో చక్కగా నటించింది. అవంతికగా డింపుల్, గౌతమ్‌గా సూర్య వశిష్ట సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్‌ను ప్రదర్శించారు. ముఖ్యంగా కొత్తవాడైనా.. అనుభవం ఉన్న నటుడిలా సూర్య వశిష్ట తన నటనతో ఆకట్టుకున్నాడు. అతని పాత్ర కూడా ఈ చిత్రానికి కీలకమే. రిషి పాత్రలో అభినవ్ సర్దార్, అతని భార్య గీత పాత్రలో నటించిన నటి.. హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన రాజేంద్ర, పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవిప్రకాశ్.. వారి పాత్రల పరిధిమేర నటించారు. ఇక ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా నటించిన మురళీ శర్మకు ఇటువంటి పాత్రలు కొత్తేం కాదు. ఏ పాత్ర అయినా ఆయన అవలీలగా చేయగలడు. ఇందులో ఆయనకు మంచి పాత్ర పడింది. మాములుగానే ఆయన చెలరేగిపోతారు.. అందులోనూ పోలీస్ ఆఫీసర్ పాత్ర అంటే.. ఒక్కమాటలో చెప్పాలంటే విజృంభించేశారు.
ఇక థ్రిల్లర్ అనగానే థియేటర్‌లో సినిమా చూస్తున్న ప్రేక్షకుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠతో చూడాలి. ఫస్టాఫ్ అంతా అటువంటి భావననే కలిగించిన ఈ చిత్రం ట్విస్ట్‌లతోనే సాగింది. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ట్విస్ట్‌తో ప్రేక్షకులంతా ఓ నిర్థారణకు వచ్చేస్తారు. కానీ ప్రేక్షకుల నిర్థారణ సగం మాత్రమే కరెక్ట్ అని చెబుతూ.. క్లైమాక్స్‌కి ముందు బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. క్లైమాక్స్‌కి ముందు వచ్చే ట్విస్టే ‘ప్లాన్-బి’. ట్విస్ట్‌లన్నింటిని ఎప్పటికప్పుడు మురళీశర్మతో రివీల్ చేయిస్తూనే.. ఇంకా ఏదో ఉంది అనేలా ప్రేక్షకులని కూడా ఇన్‌వాల్వ్ అయ్యేలా చేస్తూ.. ఆసక్తి కలిగించాడు దర్శకుడు. సెకండాఫ్ స్టార్టింగ్‌లో లాజిక్‌కి అందని విధంగా ఒక్క రాత్రిలో గౌతమ్‌తో చేయించే పనులు.. ప్రేక్షకులను కొంత కన్ఫ్యూజ్‌కి గురిచేస్తాయి. అలాగే టెక్నికల్‌గా కొత్తగా ఏమీ చెప్పలేదు కానీ.. సీసీటీవీ కెమెరా ముందు వెళ్లే మనిషి టార్చ్‌లైట్ వాడితే అందులో ఫేస్ కనబడదనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. అంతే తప్ప పెద్దగా టెక్నికల్ విషయాల జోలికి పోలేదు. మురళీశర్మ మైండ్‌నే ఎక్కువగా నమ్ముకున్నాడు దర్శకుడు. అలాగే సెకండాఫ్‌లో ట్విస్ట్ రివీల్ చేసే తీరులో కూడా దర్శకుడు తడబడ్డాడని అనిపిస్తుంది. సెకండాఫ్ ట్విస్ట్ రివీల్ చేశాక.. ఫస్ట్ నుంచి సినిమా చూసిన ప్రేక్షకుడికి.. దీనికి ఇంత అవసరమా? అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఫస్టాఫ్ అంతా ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచిన దర్శకుడు సెకండాఫ్‌పై మాత్రం ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. క్లైమాక్స్‌కి ముందు వచ్చే ట్విస్ట్ బాగుంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ థ్రిల్లర్‌కి ప్రాణం పోసింది. ప్రేక్షకుడిని చూపు పక్కకి తిప్పుకోనివ్వకుండా చేయడంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రముఖ పాత్ర వహించిందని చెప్పవచ్చు. సినిమాలో పాటలేం లేవు. చివరిలో మేకింగ్ సీన్స్ చూపిస్తూ ప్లే చేసిన ఓ పాటలో సినిమా మొత్తాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. డిఓపీ వెంకట్ గంగాధరి కెమెరా పనితనం బాగుంది. కత్తిరించే సీన్స్ ఏమీ లేవు కానీ.. సెకండాఫ్ ఎడిటింగ్ విషయంలో ఇంకా శ్రద్ద పెట్టాల్సింది. ఉన్నంతలో నిర్మాణ విలువలు చక్కగా ఉన్నాయి. ఇటువంటి సెలక్టెడ్ స్టోరీస్‌తో వెళితే మాత్రం ఈ నిర్మాణ సంస్థ కూడా త్వరలోనే మంచి గుర్తింపుని తెచ్చుకుంటుంది. మురళీశర్మతో సందర్భానుసారంగా చెప్పించిన ‘పిరికివాడి గుండెల్లోనే చీకటి సామ్రాజ్య పునాదులుంటాయి’, ‘వ్యక్తికన్నా వ్యవస్థ.. బంధం కన్నా బాధ్యత గొప్పది’, ‘అబద్ధంతో వచ్చే ఆనందం.. నిజంతో వచ్చే నిరాశ కంటే ప్రమాదం’ వంటి డైలాగ్స్ బాగున్నాయి. సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అంతా సీరియస్ మోడ్‌లోనే నడిచింది. చిత్రం శీనుతో కామెడీ చేయించాలని అనుకున్నా.. అక్కడ అంత స్కోప్ దర్శకుడికి దొరకలేదు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న కెవి రాజమహి చాలా వరకు అన్నింటికి న్యాయం చేశాడు. టైటిల్ కార్డ్స్ వేసేటప్పుడే సాంకేతిక నిపుణుల ఫోన్ నెంబర్లు కూడా చూపిస్తూ.. కొన్ని ఫోన్ నెంబర్స్‌లో చివరి మూడంకెలు లేకుండా చేసి.. దీనిని ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ట్విస్ట్‌కి లింక్ చేయడం అతని దర్శకత్వ ప్రతిభను తెలియజేస్తుంది. టోటల్‌గా క్రైమ్, మర్డర్ మిస్టరీతో ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.