హీరో శ్రీకాంత్ (Srikanth) తనయుడు రోషన్ (Roshan) హీరోగా, కొత్త అమ్మాయి శ్రీలీల (Srileela)ను కథానాయికగా పరిచయం చేస్తూ.. గౌరీ రోణంకి (Gowri Ronanki) దర్శకత్వంలో రూపొందిన వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ‘పెళ్ళిసందD’ (Pellisandadi). ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K.Raghavendrarao) దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది. గతంలో శ్రీకాంత్ హీరోగా, రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెళ్ళిసందడి’ చిత్రానికిది సీక్వెల్. ఇందులో రాఘవేంద్రరావు అతిథి పాత్రలో కనిపించడం విశేషం.
కీరవాణి (Keeravani) సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలకు మంచి స్పందన లభించింది. టీజర్, ట్రైలర్, సింగిల్స్.. చిత్రంపై భారీ అంచనాల్ని నెలకొల్పాయి. గతేడాది అక్టోబర్ 15న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి, డివైడ్ టాక్ వచ్చింది. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ చిత్రానికి అనూహ్యమైన వసూళ్ళు దక్కాయి. ఈ సినిమాతో నిర్మాతలకు మంచి లాభాలొచ్చాయి. హీరోగా రోషన్ కు ఈ సినిమా విజయం మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఈ మూవీ తర్వాత అతడికి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
అసలు విషయానికొస్తే.. ‘పెళ్ళిసందD’ చిత్రం విడుదలై ఎనిమిదినెలలు అయినా.. ఇప్పటివరకూ డిజిటల్ రిలీజ్ చేయకపోవడం ఆశ్చర్యమనిపించకమానదు. ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా.. విడుదలై నెలరోజులు కాకుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అలాంటిది ‘పెళ్ళిసందD’ లాంటి మీడియం రేంజ్ చిత్రం ఇంత లేటుగా ఓటీటీలోకి రానుండడం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఈ సినిమా జూన్ 24న జీ5 (Zee 5) ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్కు రెడీ అయింది. ఈ విషయాన్ని నిర్మాతలు ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ టీజర్‌ను కూడా వదిలారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఇంకెంతటి ఆదరణను దక్కించుకుంటుందో చూడాలి.