చాలా ఏళ్ళ తర్వాత విడిపోయిన తన తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రేణు దేశాయ్ (Renu Desai)లను కలిపాడు అకిరా నందన్ (Akira Nandan). ఇలాంటి సందర్భం ఒకటొస్తుందని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకుడిగా పరిచయమవుతూ పవన్ కళ్యాణ్ - రేణూ దేశాయ్ - అమీష పటేల్ (Ameesha Patel) ప్రధాన పాత్రలతో రూపొందించిన సినిమా బద్రి (Badri). ఈ సినిమా తర్వాత పవన్ - రేణూ దేశాయ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్ల వైవాహిక జీవితం తర్వాత వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
పరస్పర అంగీకారంతో చట్టబద్ధంగా ఇద్దరూ భార్యాభర్తలుగా విడిపోయి దూరంగా ఉంటున్నారు. అయినా కూడా పిల్లల కోసం అప్పుడప్పుడూ కలుస్తుంటారు. మెగా ఫ్యామిలీలో ఏ శుభకార్యం జరిగినా కూడా పిల్లలు అకీరా నందన్, ఆద్యలు వచ్చి వెళుతుంటారు. గత కొంతకాలంగా అకీరాను హీరోగా వెండితెరకు పరిచయం చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. దీనికోసం స్వయంగా మెగాస్టారే కథ వింటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మెగా అభిమానులు కూడా అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఇస్తాడో ..ఆ సమయంలో మళ్ళీ పవన్-రేణూ కలిసి ఒకే వేదికపై కనిపిస్తారా.. లేదా! అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
అయితే, దానికంటే ముందే ఎవరూ ఊహించని విధంగా పవన్-రేణూ ఒకే ఫ్రేమ్ లో కలిసి కనిపించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. అకీరా నందన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఈ అరుదైన ఘటన చోటుచేసుకోవడం ఆసక్తికరం. ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్న అకీరా.. గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఈ సోమవారం జరిగాయి. తల్లిదండ్రులుగా పవన్ కళ్యాణ్ - రేణూ దేశాయ్ కూడా ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ప్రస్తుతం అకీరా - ఆధ్యలతో పవన్ - రేణూ కలిసి ఉన్న లేటెస్ట్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. దీంతో పవన్, రేణూలను కలిపిన అకీరా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.