దర్శకురాలు కృతిక ఉదయనిధి (Kiruthiga Udhayanidhi) ‘పేపర్ రాకెట్’ (paper rocket) పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఈ నెల 29వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఆడియో, ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరోలు శింబు (Simbhu), ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin), విజయ్ ఆంటోనీ (Vijay Antony), తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో శింబు మాట్లాడుతూ.. ‘కృతిక దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించేందుకు చర్చలు కూడా జరిగాయి. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. దర్శకుల్లో స్త్రీ - పురుష అనే భేదాన్ని చూడను. ఇప్పుడు పురుషుల కంటే మహిళలే అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారు’ అని అన్నారు.
కృతిక భర్త, హీరో, నిర్మాత, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘అందరు హీరోలతో మంచి కథలతో సినిమాలు రూపొందించే కృతిక.. నాకు మాత్రం క్రైమ్ స్టోరీలు చెబుతున్నారు. విజయ్ ఆంటోనీ నటించిన ‘కాళి’ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు. ఇది న్యాయమేనా? ఇప్పుడు మేమిద్దరం వెండి తెరపై పోటీపడుతున్నాం. నేను రిలీజ్ చేసే ‘గులు గులు’, థియేటర్‌లో, ‘పేపర్ రాకెట్’ ఓటీటీలో విడుదలవుతుంది’.. అని చెప్పారు.
దర్శకురాలు కృతిక మాట్లాడుతూ.. ‘శింబు హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆశ ఉంది. ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేసేలా ఉంటుంది’.. అన్నారు. ఇక ఈ వెబ్ సిరీస్‌లో కాళిదాస్ జయరాం, తాన్య రవిచంద్రన్, కరుణాస్, చిన్నిజయంత్, పూర్ణిమా భాగ్యరాజ్ తదితరులు నటించగా, సంగీతం సైమన్ కె.కింగ్, కెమెరా రిచర్డ్, ఎడిటర్ లారెన్స్ కిషోర్, నిర్మాత శ్రీనిధి సాగర్.