‘భీమ్లా నాయక్’ సింగర్‌ కిన్నెర మొగులయ్యకు ‘పద్మశ్రీ’

ABN , First Publish Date - 2022-01-26T02:38:06+05:30 IST

‘భీమ్లా నాయక్’ సింగర్‌ కిన్నెర మొగులయ్యను ‘పద్మశ్రీ’ వరించింది. నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల గ్రామంలో 1951లో జన్మించిన ఆయన పూర్తి పేరు దర్శనం మొగులయ్య. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడిగా..

‘భీమ్లా నాయక్’ సింగర్‌ కిన్నెర మొగులయ్యకు ‘పద్మశ్రీ’

‘భీమ్లా నాయక్’ సింగర్‌ కిన్నెర మొగులయ్యను ‘పద్మశ్రీ’ వరించింది. నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల గ్రామంలో 1951లో జన్మించిన ఆయన పూర్తి పేరు దర్శనం మొగులయ్య. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడిగా.. ఆయన 52 దేశాల ప్రతినిధుల ముందు తన 12 మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శలను ఇచ్చారు. మొగులయ్య జీవిత చరిత్ర ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా కూడా ఉంది. ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడాయనని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.


‘భీమ్లా నాయక్’ చిత్రంలో ఆయన పాడిన


‘‘ఆడ గాడు ఈడ గాదు అమీరొళ్ల మేడా గాదు

గుర్రం నీళ్ల గుట్టా కాడా అలుగువాగా వాగా తండాలోని

బెమ్మ జెముడు చెట్టు నది బెమ్మ జెముడు చెట్టు కింద


అమ్మ నొప్పులు పడతన్నాది ఎండ లేదు రాతిరి కాదు

ఎగుసుక్కా పొడవంగానే పుట్టిండాడు పులి పిల్ల

పుట్టిండాడు పులి పిల్ల నల్లమల్ల తాళ్ళుకాల


అమ్మ పేరు మీరాబాయి నాయన పేరు సోమలగండు

నాయన పేరు సోమలగందు తాత పేరు బహదూర్

ముత్తాల తాత ఈరా నాయక్ పెట్టిన పేరు భీమ్లా నాయక్’’.. 


పాటతో కిన్నెర మొగులయ్య బాగా ఫేమస్ అయ్యారు. అంతకుముందు 12 మెట్ల కిన్నెర వాయిస్తూ పండుగల సాయన్న, పానుగంటి మీరాసాహెబ్, ఎండబెట్ల ఫకీరయ్య గౌడ్, బండోళ్ల కురుమన్న, వట్టెం రంగనాయకమ్మ, వనపర్తి రాజుల కథలు వంటి తెలంగాణ వారి వీరగాథలు తన వాద్యంతో వినసొంపుగా వినిపించే మొగులయ్య.. ఈ పాటతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. మరుగున పడిపోతున్న ‘కిన్నెర’ కళను బతికిస్తూ.. దానితోనే జీవనం గడుపుతున్న మొగులయ్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’కి ఎంపిక చేసింది. ఆయనకు ‘పద్మశ్రీ’ పురస్కారం దక్కడం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కళాకారులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



Updated Date - 2022-01-26T02:38:06+05:30 IST