‘పాగల్’ రివ్యూ

Twitter IconWatsapp IconFacebook Icon
పాగల్ రివ్యూ

చిత్రం:  పాగ‌ల్ 

సెన్సార్‌:   యు/ఎ

న‌టీన‌టులు: విష్వ‌క్ సేన్‌, నివేదా పేతురాజ్‌, సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ‌, రాహుల్ రామ‌కృష్ణ, మురళీ శర్మ, మహేశ్ అచంట, ఇంద్రజ శంకర్ త‌దిత‌రులు

బ్యాన‌ర్స్‌:  శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా

స‌మ‌ర్ప‌ణ‌:  దిల్‌రాజు

నిర్మాత‌:  బెక్కెం వేణుగోపాల్‌

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: న‌రేశ్ కుప్పిలి

సినిమాటోగ్రఫీ:  మ‌ణికంద‌న్‌

మ్యూజిక్‌:  ర‌ధ‌న్‌

ఎడిట‌ర్‌:  గ్యారీ బి.హెచ్‌


‘ఫ‌ల‌క్‌నుమాదాస్‌, ఈన‌గ‌రానికిఏమైంది, హిట్’ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న యంగ్ హీరో విష్వ‌క్ సేన్‌ లేటెస్ట్ మూవీ ‘పాగల్’. కోవిడ్ సెకండ్ వేవ్ ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్టిన త‌ర్వాత ఎక్కువ థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతున్న చిత్ర‌మిదే. ‘పాగ‌ల్’ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగించాయి. మా ‘పాగ‌ల్’ ప్రేమ‌క‌థ మాత్ర‌మే కాదు.. ప్రేమ గురించి చెప్పే సినిమా అని, సినిమా ఎమోష‌న‌ల్‌గా ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంద‌ని చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్‌లో చెప్పింది. మ‌రి వారు చెప్పిన‌ట్లు ‘పాగ‌ల్’ ప్రేక్ష‌కుల‌ను ఎమోష‌న‌ల్‌గా మెప్పించిందా? లేక ఇది వ‌ర‌కు వ‌చ్చిన చాలా ప్రేమ‌క‌థా చిత్రాల స్టైల్లో ఇది కూడా ఒక‌టా? అనేది తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో చూద్దాం...

పాగల్ రివ్యూ

క‌థ‌:

అన్నీ తానై పెంచిన అమ్మ‌(భూమిక‌) అంటే ప్రేమ్(విష్వ‌క్‌సేన్‌)కు ఎంతో ప్రేమ‌. ఆమెలా ఎవ‌రూ త‌న‌ను ప్రేమించ‌లేర‌ని ఓ సంద‌ర్భంలో ప్రేమ్ త‌ల్లితో అంటాడు. అయితే నిజాయ‌తీగా మ‌నం ఎవ‌ర్నైనా ప్రేమిస్తే, వాళ్లు కూడా మ‌న‌ల్ని ప్రేమిస్తార‌ని ఆమె ప్రేమ్‌తో చెబుతుంది. అనుకోకుండా కాన్స‌ర్ కార‌ణంగా ప్రేమ్ త‌ల్లి ప్రేమ‌కు దూర‌మ‌వుతాడు. ఒంట‌రిగా బాధ‌ప‌డుతున్న ప్రేమ్‌తో, అత‌ని స్నేహితుడు అమ్మాయిల‌ను నిజాయ‌తీగా ప్రేమిస్తే వారు కూడా ప్రేమిస్తార‌ని చెబుతాడు. దాంతో ప్రేమ్ అమ్మాయిలకు ఐ ల‌వ్ యూ చెబుతూ, ప్రేమ‌ను వెతుక్కునే ప‌నిలో ప‌డ‌తాడు. హైద‌రాబాద్‌లో అమ్మాయిలెవ‌రూ ప్రేమ్‌ను ప్రేమించ‌రు. వైజాగ్‌కు వెళ్లి అక్క‌డ ప్రేమ కోసం అమ్మాయిల వెంట‌ప‌డుతుంటాడు. ఈ క్ర‌మంలో మూడు బ్రేక‌ప్స్ కూడా అవుతాయి. ఆరు నెల‌లు త‌ర్వాత హైద‌రాబాద్ చేరుకున్న ప్రేమ్‌.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రాజి రెడ్డి(ముర‌ళీశ‌ర్మ‌)ను ప్రేమిస్తున్నాన‌ని, ఐ ల‌వ్ యూ చెప్పాలంటూ వెంట‌ప‌డ‌తాడు. ఓ సంద‌ర్భంలో రాజిరెడ్డి ప్రాణం కూడా కాపాడుతాడు. త‌న‌కు ఐ ల‌వ్ యూ చెప్ప‌క‌పోతే పెద్ద బిల్డింగ్ పై నుంచి దూకి చ‌నిపోతాన‌ని రాజి రెడ్డిని బెదిరిస్తాడు ప్రేమ్‌. ప్రేమ్ ఉన్న ప్లేస్‌కు వ‌చ్చిన రాజి రెడ్డికి అనుకోని షాక్ ఎదుర‌వుతుంది. అదేంటి?  అస‌లు ప్రేమ్ ఎవ‌రు?  అత‌నికీ, ప్రేమ్‌కు ఉన్న లింకేంటి?  తీర(నివేదా పేతురాజ్‌) ఎవ‌రు?  చివ‌ర‌కు ప్రేమ్‌కు నిజ‌మైన ప్రేమ దొరుకుతుందా?  అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

పాగల్ రివ్యూ

విశ్లేష‌ణ‌:


త‌ల్లిత‌న‌పై చూపించిన ప్రేమ‌ను చూపించే అమ్మాయి దొరికితే ఆమెను త‌న త‌ల్లి అంత ప్రేమ‌గా చూసుకోవాల‌నుకునే ఓ కుర్రాడి ప్రేమ‌క‌థే ‘పాగ‌ల్‌’. ఇద్ద‌రు అనాథ‌ల క‌థ‌.. అందులో అమ్మాయి వైపు నుంచి ఓ విల‌నిజం ఉన్న వ్య‌క్తి.. అత‌న్ని హీరో మార్చ‌డానికి ఏం చేశాడ‌నేదే ఈ సినిమా.. సింపుల్‌గా క‌థ ఇదే. 


‘పాగ‌ల్‌’ సినిమాతో న‌రేశ్ కుప్పిలి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. పిచ్చిగా ప్రేమించే ఓ యువ‌కుడి క‌థ‌ను రాసుకున్నాడు. ఫ‌స్టాఫ్ అంతా హీరో ఐ ల‌వ్ యూ చెబుతూ అమ్మాయిల వెంట‌ప‌డటం.. అమ్మాయిలు హీరోను రిజెక్ట్ చేయ‌డం.. వంటి స‌న్నివేశాలు మామూలుగానే ఉన్నాయి. మ‌ధ్య‌లో పాగ‌ల్ టైటిల్ సాంగ్ వ‌స్తుంది. అందులో హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ను ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. మేఘా లేఖ‌, సిమ్రాన్ చౌద‌రిల‌ను హీరో ల‌వ్ చేయ‌డం వాళ్లు హీరోను రిజెక్ట్ చేయడం అంతా నార్మల్‌గా ఉన్నా కామెడీ కోణంలో సినిమా సాగుతుండ‌టంతో ఆ సీన్స్‌ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. మ‌ధ్య మ‌ధ్య‌లో హీరో.. రాహుల్ రామ‌కృష్ణ అండ్ గ్యాంగ్ కామెడీ ట్రాక్ బాగా న‌వ్విస్తుంది. అలాగే హీరోకి, మ‌హాలక్ష్మి అనే అమ్మాయికి మ‌ధ్య ఉండే ల‌వ్ ట్రాక్‌.. అందులో వాళ్లు మ‌ణిర‌త్నం హీరో, హీరోయిన్లలా మాట్లాడుకోవడం వంటి సీన్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయ‌న‌డంలో సందేహం లేదు. ఈ సీన్స్‌ను ద‌ర్శకుడు న‌రేశ్ కుప్పిలి చ‌క్క‌గా రాసుకోవ‌డ‌మే కాదు.. చ‌క్క‌గా తెర‌కెక్కించాడు కూడా. ఆ త‌ర్వాత విష్వ‌క్ సేన్‌, ముర‌ళీ శ‌ర్మ మ‌ధ్య ల‌వ్ అంటూ ఉండే ట్రాక్ కాస్త ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. అదేంటి సినిమా ఎక్క‌డో స్టార్ట్ అయ్యి.. ఎక్క‌డికో వెళుతుంది? అనిపిస్తుంది. కానీ.. అక్క‌డే క‌థ‌లో ట్విస్ట్ ఇచ్చి ఇంట‌ర్వెల్ కార్డ్ వేస్తారు. 


ఇంట‌ర్వెల్‌లో వ‌చ్చే ట్విస్ట్‌ వల్ల సెకండాఫ్ సినిమా క‌థేలా ఉండ‌బోతుంద‌నేది ప్రేక్ష‌కుడికి ముందే తెలిసిపోతుంది. అందుకు ప్ర‌ధాన కార‌ణం.. ఫస్టాఫ్‌లో మెయిన్ హీరోయిన్ నివేదా పేతురాజ్‌ క‌న‌ప‌డ‌క‌పోవ‌డ‌మే. ఇక సెకండాఫ్ అంతా ఆమె చుట్టూనే ఉంటుంది. ఆమెకు ఏదో జ‌రిగింది.. అందుకనే హీరో ఇలా చేస్తున్నాడ‌ని క్లారిటీ వ‌చ్చేస్తుంది. ఇక సెకండాఫ్‌లో ప్రేక్ష‌కుడు ఊహించిన‌ట్లే మెయిన్ హీరోయిన్ ఎంట్రీ.. హీరోయిన్ ప్రేమ కోసం హీరో ఆమె వెంట‌ప‌డ‌టం.. ముందు హీరోయిన్ వ‌ద్ద‌ని చెప్ప‌డం, త‌ర్వాత రొటీన్‌గానే ఇద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డుస్తూ వస్తుంది. ప్రీ క్లైమాక్స్ వ‌ర‌కు విల‌న్ క‌న‌పించ‌డు. దీంతో ప్రేక్ష‌కుడికి అస‌లు ఈ క‌థ‌లో విల‌న్ ఎక్క‌డ క‌నిపిస్తాడోన‌ని ఓ ఆస‌క్తి క‌లిగినా, తీరా అస‌లు సంగ‌తి రివీల్ అయిన త‌ర్వాత ఓర్నీ.. అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వ‌చ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌కి, క్లైమాక్స్‌కు లింకు పెడుతూ అక్క‌డ నుంచి న‌డిపిన మ‌రీ రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో క్లైమాక్స్‌ను త‌లపిస్తుంది. 

టైటిల్ సాంగ్‌.. హీరో వేరే అమ్మాయిల‌ను ప్రేమించ‌డం, వారు రిజెక్ట్ చేయ‌డం.. అలాగే మేఘా లేఖ‌, సిమ్రాన్ చౌద‌రిల‌తో వ‌చ్చే మాంటేజ్ సాంగ్స్‌, ఇక విష్వ‌క్ సేన్‌, నివేదా పేతురాజ్ మ‌ధ్య వ‌చ్చే రెండు సాంగ్స్‌, చివ‌ర‌లో హీరో, హీరోయిన్ విడిపోయిన‌ప్పుడు వ‌చ్చే ఎమోష‌న‌ల్ సాంగ్‌.. ఇలా పాట‌ల‌న్నీ క‌థ‌లో భాగంగానే ర‌న్ అయ్యాయి. మ‌ళ్లీ మ‌ళ్లీ పాడుకునేంత ఎఫెక్టివ్‌గా లేవు. నేప‌థ్య సంగీతం బాగానే ఉంది. మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. గ్యారీ బి.హెచ్ సెకండాఫ్‌ను కాస్త త‌గ్గించి ఉంటే బావుండేద‌నిపించింది. ‘బెగ్గ‌ర్‌నే ఇంత బాగా చూసుకుంటుంటే, ల‌వ‌ర్‌ను ఎంత బాగా చూసుకుంటారో’ అని సిమ్రాన్ చౌదరితో విష్వక్ చెప్పే డైలాగ్, సహా సందర్భానుసారం వచ్చే కామెడీ డైలాగ్స్, ఎమోషనల్ డైలాగ్స్ బాగానే ఉన్నాయి. 


నటీనటుల విషయానికి వస్తే.. విష్వక్ సేన్ సినిమా అంత‌టినీ తానై న‌డిపించాడు. ఇంత‌కు ముందు సినిమాల్లో ఎంత ఎన‌ర్జిటిక్‌గా క‌నిపించాడో, ఈ సినిమాలో అంతే ఎన‌ర్జీతో త‌న క్యారెక్ట‌ర్‌ను చేశాడు. ప్రేమ కోసం ప‌రిత‌పిస్తూ.. నిజ‌మైన ప్రేమ దొరికి కొంత‌కాలం ట్రావెల్ చేసిన త‌ర్వాత ప్రేమ‌ను, ప్రేయ‌సిని వ‌దులుకోలేక బాధ‌ప‌డే యువ‌కుడి పాత్ర‌కు విష్వ‌క్ వంద‌శాతం న్యాయం చేశాడు. మెయిన్ హీరోయిన్‌గా న‌టించిన నివేదా పేతురాజ్ రోల్ సెకండాఫ్‌లో వ‌స్తుంది. తెలుగులో నివేదాపేతురాజ్ చేసిన పూర్తిస్థాయి రోల్ ఇద‌నాలి. త‌న పాత్ర‌కు పెర్ఫామెన్స్ ప‌రంగా నివేదా న్యాయం చేసింది. ఇక సినిమా ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే మేఘా లేఖ‌, సిమ్రాన్ చౌద‌రి, ముర‌ళీ శ‌ర్మ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, రంగ‌స్థ‌లం మ‌హేశ్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ రామ్‌ప్ర‌సాద్, త‌ల్లి పాత్రలో న‌టించిన భూమిక అంద‌రూ వారి వారి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. 

‘పాగల్’... ల‌వ్‌లో కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ ఉన్నాయేమో కానీ..సెకండాఫ్ అదిరిపోద్ది ఏడ్చేయ‌డం ఖాయం అని చిత్ర యూనిట్ చెప్పినంత ఎమోష‌న్స్ అయితే క‌చ్చితంగా సినిమాలో లేవు. 


బోటమ్ లైన్: ‘పాగల్’... ఓ ప్రేమకథ


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.