సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్నారు. వి.వి.గోపాలకృష్ణ దర్శకుడు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. గురువారం టీజర్‌ని యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ విడుదల చేశారు. ‘ఈ కృష్ణమ్మలాగే మేము కూడా ఎప్పుడు పుట్టామో, ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలీదు’ అనే డైలాగ్ ఈ టీజర్లో ఆకట్టుకుంటోంది. టీజర్ చాలా బాగుందని, ఈ సినిమా కచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘విజయవాడ నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ చిన్న ఘటన ముగ్గురు స్నేహితుల జీవితాన్ని ఎలా మార్చిందనేది ఆసక్తికరంగా చూపిస్తున్నాం. యాక్షన్‌కి ప్రాధాన్యం ఉంటుంది. సత్యదేవ్‌ని ఓ సరికొత్త అవతార్‌లో చూస్తారు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’ని నిర్మాత తెలిపారు.