మా బాధ్యత మరింత పెంచింది

‘‘సినిమా టికెట్‌ ధరలను తగ్గిస్తూ గతేడాది ఏప్రిల్‌లోనే ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణ దశలోనే ‘బంగార్రాజు’ సినిమా బడ్జెట్‌ తగ్గించుకున్నాం. అందుకే టికెట్‌ ధరలు తగ్గినా మా సినిమాకు ఇబ్బంది లేదు అన్నాను’’ అని నాగార్జున వివరణ ఇచ్చారు. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘బంగార్రాజు’. నాగచైతన్య, కృతిశెట్టి మరో జోడీగా నటించారు. ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా సినిమా విశేషాలను నాగార్జున పంచుకున్నారు. ‘‘సీఎం జగన్‌ను కలిసేందుకు చిరంజీవి నన్ను కూడా పిలిచారు. కానీ ఈ సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉండి వెళ్లలేక పోయాను’’ అని ఆయన అన్నారు. ‘బంగార్రాజు’ గురించి మాట్లాడుతూ ‘నాగచైతన్య పాత్ర ఈ సినిమాలో కొత్తగా వస్తుంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలోని బంగార్రాజుకు మనవడిగా బుల్లి బంగార్రాజు పాత్రలో చైతూ అభినయం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. పెద్ద బంగార్రాజు ఆత్మ బుల్లి బంగార్రాజులో ప్రవేశించినప్పుడు నాగచైతన్య నటన మేనరిజమ్స్‌ నన్ను అనుకరించేలా ఉంటాయి. అందుకే ‘సోగ్గాడే...’ సినిమాను చూడమని నాగచైతన్యకు చెప్పాను. కృతిశెట్టి ఆహార్యం, లుక్‌, భాష, ఎమోషన్స్‌ బాగా కుదిరాయి. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది కాబట్టి ఇప్పుడు ‘బంగార్రాజు’ను కూడా ప్రేక్షకులు చూడాలనుకుంటారు. అది మా బాధ్యతను మరింత పెంచింది’ అన్నారు. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.