OTT vs Multiplexes: ఓటీటీల విప్లవంతో ప్రశ్నార్థకంగా మల్టీప్లెక్స్‌ల పరిస్థితి..!

ABN , First Publish Date - 2022-08-28T00:07:46+05:30 IST

కరోనా అనంతరం ప్రేక్షకుల అభిరుచుల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి. లాక్‌డౌన్ కాలంలో నెట్‌ఫ్లిక్స్(Netflix), అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ప్రజలు అలవాటు పడ్డారు. సినిమాలు విడుదలైన..

OTT vs Multiplexes: ఓటీటీల విప్లవంతో ప్రశ్నార్థకంగా మల్టీప్లెక్స్‌ల పరిస్థితి..!

కరోనా అనంతరం ప్రేక్షకుల అభిరుచుల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి. లాక్‌డౌన్ కాలంలో  నెట్‌ఫ్లిక్స్(Netflix), అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ప్రజలు అలవాటు పడ్డారు. సినిమాలు విడుదలైన కొన్ని రోజులకే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి అందుబాటులోకి వస్తుండటంతో.. ఆడియన్స్ థియేటర్స్‌కు రావడానికి ఆసక్తి చూపించడం లేదు. సినిమా హాల్స్‌, మల్టీప్లెక్స్‌(multiplex) ల‌కు అయితే కొన్ని సమయాల్లో రెంట్ కూడా రావడం లేదంటే అతిశయోక్తి కాదు. మూవీస్ ఎలాగైనా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వస్తాయనే అంచనాతో ప్రేక్షకులు వాటివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఓటీటీల విప్లవంతో వీసీపీ, వీసీఆర్, డీవీడీల మాదిరి పరిస్థితులే మల్టీప్లెక్స్‌లకు ఎదురు కాబోతున్నట్టు బిజినెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2023నాటికి ఓటీటీ ఇండస్ట్రీ విలువ 12వేల కోట్లకు చేరబోతున్నట్టు అంచనా. 


ఓటీటీ ఇండస్ట్రీ విలువ 2018లో 2,590కోట్లు ఉంటే.. 2023నాటికి ఆ వ్యాల్యూ  రూ. 12వేలకోట్లకు చేరబోతుందని నివేదికలు తెలుపుతున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ‌లో ఓటీటీలు ఇప్పటికే 7శాతం నుంచి 9శాతం వరకు రెవెన్యూ షేర్‌ను కైవసం చేసుకున్నాయి. వివిధ భాషల్లో కలిపి దాదాపుగా 40 ఓటీటీలు ఉన్నాయి. వీటన్నింటికి కలిపి 45కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. 2023 చివరి నాటికీ ఈ సబ్‌స్క్రైబర్స్ సంఖ్య 50కోట్లకు చేరుతుందని అంచనా. రిలయన్స్ జియో వచ్చాక మొబైల్ ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఇంటర్నెట్‌ను ఉపయోగించేవారి సంఖ్య దాదాపుగా రెట్టింపు అయ్యింది. అందుబాటు ధరల్లోనే సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుండటం ఓటీటీల వైపు ప్రజలు మొగ్గు చూపడానికి కారణం. అత్యధికంగా డిస్నీ+హాట్‌స్టార్‌కు 14కోట్లు, అమెజాన్ ప్రైమ్ వీడియోకు 6కోట్లు, నెట్‌ఫ్లిక్స్‌కు 4కోట్లు, జీ-5కు 3.7కోట్లు, సోనీ లివ్‌కు 2.5కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అమెరికా ఇతర అభివృద్ధి దేశాలతో పోల్చుకుంటే 70 నుంచి 90 శాతం తక్కువ ధరకు ప్లాన్‌లను ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అందిస్తుండటంతో ప్రజలు వీటిని వినియోగించుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే కాలంలో సినిమాల లాభాలను ఓటీటీలు 50శాతం వరకు తినేస్తాయని అంచనా. ప్రతి వ్యక్తి ప్రస్తుతం నెలకు 5గంటలకు పైగా ఓటీటీలను వాడుతున్నారు. బడా నిర్మాణ సంస్థలు ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు కంటెంట్ అందించడం మొదలుపెట్టాయి. సినిమాలను నిర్మించడం కంటే ఓటీటీలకు కంటెంట్ అందిస్తే వచ్చే లాభం ఈ సంస్థలకు అధికంగా ఉంటుంది. కొన్ని నిర్మాణ సంస్థలయితే సొంతంగా ప్లాట్‌ఫామ్‌లను కూడా ప్రారంభించాయి. వీసీఆర్, వీసీపీలు 1980వ దశకంలో భారీ వృద్ధిని నమోదు చేశాయి. అప్పుడే చిత్ర పరిశ్రమ మొదటిసారిగా సవాళ్లను ఎదుర్కోవడం ప్రారంభమైంది. అనంతరం మెట్రో ప్రాంతాలు, నగరాల్లో 2000లో మల్టీప్లెక్స్‌లు వచ్చాయి. దీంతో డీవీడీ పరిశ్రమ, సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఓటీటీల విప్లవానికీ ముఖ్య కారణం ఏంటంటే కోవిడే. లాక్‌డౌన్‌లో దాదాపుగా 30హిందీ చిత్రాలు నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల అయ్యాయి. టెక్నాలజీ వినియోగం కూడా వీటి వినియోగానికి మరో కారణంగా పేర్కొనవచ్చు.    



Updated Date - 2022-08-28T00:07:46+05:30 IST