ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కోసం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జోయా అక్తర్ (Zoya Akhtar) ఓ సినిమాను నిర్మిస్తుంది. ఆ చిత్రానికీ ‘ది అర్చీస్’ (The Archies) అని టైటిల్ పెట్టారు. గత కొన్ని రోజులుగా ఈ మూవీ బీ టౌన్‌లో వార్తల్లో నిలిచింది. అందుక్కారణం ‘అర్చీస్’ లోని ప్రధానపాత్రల్లో బాలీవుడ్ స్టార్ కిడ్స్ నటిస్తున్నారు. బిగ్ బీ మనవడు అగస్త్య నందా(Agastya Nanda), బాలీవుడ్ బాద్ షా కూతురు సుహానా ఖాన్ (Suhana Khan), బోనీ కపూర్ వారసురాలు ఖుషి కపూర్ ( Khushi Kapoor ) ఒకేసారి ఈ షో ద్వారా బీ టౌన్‌కు ఎంట్రీ ఇస్తున్నారు.
‘ది అర్చీస్’ అమెరికన్ కామిక్ సిరీస్. ఈ షోను ఆధారంగా చేసుకుని అదే పేరుతో ఇండియన్ వెర్షన్‌ను తెరకెక్కిస్తున్నారు. 1960ల నేపథ్యంలో లైవ్ యాక్షన్ మ్యూజికల్ డ్రామాగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టైగర్ బేబీ ప్రొడక్షన్స్‌తో కలసి గ్రాఫిక్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తుంది. ‘ది అర్చీస్’ షూటింగ్‌ను ఏప్రిల్ 18న ప్రారంభించారు. మే 14న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడంతో పాటు టీజర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘‘బాస్కెట్‌లను రెడీగా ఉంచుకోండి.. అందమైన దుస్తులను ఎంచుకొని.. అర్చీస్ గ్యాంగ్‌ను అభినందించడానికీ సిద్ధంగా ఉండండి. జోయా అక్తర్ సినిమా ‘ది అర్చీస్’ పాత్రలను మీ ముందుకు తీసుకువస్తున్నాం’’ అని సోషల్ మీడియాలో నెట్‌ఫ్లిక్స్ ఇండియా పోస్ట్ పెట్టింది. ఈ సినిమాలో సుహానా ఖాన్, ఖుషి కపూర్, అగస్త్య నందాతో పాటు మిహిర్ అహుజా, డాట్, వేదంగ్ రైనా, యువరాజ్ మెండా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగస్త్య నందా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండటంతో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.