నెట్‌ఫ్లిక్స్‌పై చెస్ మాజీ ఛాంపియన్ పరువు నష్టం దావా.. రూ.38 కోట్లు చెల్లించాలంటూ..

ABN , First Publish Date - 2022-01-29T18:44:22+05:30 IST

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌పై జార్జియన్ మాజీ మహిళా ప్రపంచ ఛాంపియన్ 5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 38 కోట్ల పరువు నష్టం దావా వేసింది...

నెట్‌ఫ్లిక్స్‌పై చెస్ మాజీ ఛాంపియన్ పరువు నష్టం దావా.. రూ.38 కోట్లు చెల్లించాలంటూ..

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌పై జార్జియన్ మాజీ మహిళా ప్రపంచ ఛాంపియన్ 5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 38 కోట్ల పరువు నష్టం దావా వేసింది. అందులో ఈ ఓటీటీలో టెలికాస్ట్ అయిన ‘ది క్వీన్స్ గాంబిట్’లో ఆమెను తక్కువ చేసి చూపించారని పేర్కొంది.


చెస్ గ్రాండ్‌మాస్టర్ నోనా గప్రిందాష్విలి(80) గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ దావా వేసింది. ఈ సిరీస్‌లోని ఒక పాత్ర నోనా కెరీర్‌లో ‘ఎప్పుడూ పురుష ఆటగాళ్లని ఎదుర్కోలేదు’ అని అంటుంది. అది తనను కించపరిచేలా ఉందని చెప్పుకొచ్చింది. నిజానికి తాను 1968 నుంచి ఎంతోమంది పురుష చెస్ క్రీడాకారులతో పోటీ పడ్డానని తెలిపింది.


అయితే నెట్‌ఫ్లిక్స్ తరపు న్యాయవాదులు ఈ షో కల్పితమని, అందువల్ల వాక్ స్వేచ్ఛను రక్షించే యూఎస్ రాజ్యాంగంలోని మొదటి సవరణని చూపి ఈ దావాను కొట్టివేయాలని కోర్టును కోరారు.


కానీ ఫెడరల్ న్యాయమూర్తి వర్జీనియా ఫిలిప్స్ జనవరి 27న వారి అభ్యర్థనను తోసిపుచ్చారు. ‘ఈ సిరీస్ నిజంగా కల్పిత రచన అయినప్పటికీ ఇందులో పరువు నష్టం సంబంధించిన అంశాలను నెట్‌ఫ్లిక్స్ ఎదుర్కొక తప్పదు’ అని తేల్చి చెప్పారు.


అన్య టేలర్ జాయ్ నటించిన ‘ది క్వీన్స్ గాంబిట్’ 1983లో వాల్టర్ టెవిస్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో ఓ అనాథ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా ఎలా మారిందనేది కథ. ఫిక్షనల్ అయినప్పటికీ ఎన్నో నిజ జీవితంలో చెస్ ఛాంపియన్ల క్యారెక్టర్స్ ఇందులో కనిపిస్తాయి. అలాగే నోనా పాత్ర కూడా వస్తుంది.


కాగా, నోనా 1978లోనే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను అందుకుని ఆ గౌరవం దక్కించుకున్న మొదటి మహిళగా నిలిచింది. 1962-78 వరకు మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్ నిలవడమే కాకుండా ఎన్నో టోర్నమెంట్స్‌లో పురుషులతో కలిసి పాల్గొని రెండు టైటిళ్లను సైతం గెలుచుకుంది. అంతేకాకుండా మిగిలిన వాటిలో సైతం అందరికి గట్టి పోటీనే ఇచ్చింది.

Updated Date - 2022-01-29T18:44:22+05:30 IST