అసలు స్టార్‌ స్ర్కిప్టే’

ABN , First Publish Date - 2021-07-11T06:40:26+05:30 IST

నా పేరు కె.ఎస్‌. రవీంద్రనాథ్‌. ఇంట్లో ముద్దుగా ‘బాబీ’ అని పిలిచేవారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత నా ముద్దుపేరే కొనసాగుతోంది.

అసలు స్టార్‌ స్ర్కిప్టే’

ఆ గుంటూరు కుర్రోడు మెగాస్టార్‌ చిరంజీవి అభిమాని.పరీక్షలెగ్గొట్టి మరీ నాన్నతో కలిసి చిరంజీవి నటించిన ప్రతి సినిమా బెన్ఫిట్‌ షో చూసేవాడు. తన అభిమాన కథానాయకుడి ఆడియో క్యాసెట్లకోసం క్యూలో నిలబడేవాడు.  తన ఊర్లోని ‘చిరంజీవి అభిమాన సంఘం’కు నాయకుడైన ఆ కాలేజీఅబ్బాయి.. బైక్‌ర్యాలీలలతో తెగ హడావిడి చేసేవాడు. 


సీన్‌కట్‌ చేస్తే..

ఇష్టమైన హీరోను చూస్తే చాలనుకున్న ఆ అబ్బాయి భుజం మీద చేయి వేసి మరీ ఫొటో దిగాడు చిరంజీవి. ఎన్నో పరీక్షలు నెగ్గి త్వరలో మెగాస్టార్‌నే డైరక్ట్‌ చేయబోతున్నాడు. ఆడియోక్యాసెట్లు వింటూ బాల్యంలో ఈలలేసిన ఆ అబ్బాయే.. ఇపుడు చిరుతో ట్యూన్స్‌ చర్చిస్తున్నాడు. అతడే ‘బాబీ’ అనే కె.ఎస్‌. రవీంద్రనాథ్‌!  గుంటూరులోని అభిమాని.. తన అభిమాన హీరో చిరంజీవితో సినిమా చేసే స్థాయికి వచ్చిన దర్శకుడు బాబీ జీవిత మలుపులు ఆసక్తికరం. తన జీవిత విశేషాలను బాబీ ‘నవ్య’తో పంచుకున్నారిలా. 



మీ అసలు పేరు బాబీయేనా?

నా పేరు కె.ఎస్‌. రవీంద్రనాథ్‌. ఇంట్లో ముద్దుగా ‘బాబీ’ అని పిలిచేవారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత నా ముద్దుపేరే  కొనసాగుతోంది. నా అసలు పేరు చాలా మందికి తెలియదు. 


మీ బాల్యం ఎలా గడిచింది? 

మాది గుంటూరు. నాకు చిన్నప్పటినుంచి సినిమాలంటే పిచ్చి.  చిరంజీవిగారంటే మహా పిచ్చి.  ఆయన సినిమా విడుదలైన మొదటి రోజే నేను, నాన్న (కె. మోహనరావు) బెనిఫిట్‌ షో చూడాల్సిందే! నాకు ఊహ తెలిసిన తర్వాత- నేను చిరంజీవి గారి ఒక్క బెనిఫిట్‌ షో కూడా మిస్‌ కాలేదు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మా నాన్న నాటక రచయిత. ఆయనకు కూడా చిరంజీవిగారంటే అభిమానం. రచన- మా నాన్న నుంచి నాకు సంక్రమించిన వారసత్వం అనుకుంటా! ఇక కాలేజీలోకి వచ్చిన తర్వాత చిరంజీవి అభిమాన సంఘానికి అధ్యక్షుడిని. కొత్త సినిమా విడుదలయితే బైక్‌ ర్యాలీలు.. కటౌట్లకు దండలు.. ఒకటే హడావిడి. వీటన్నింటికీ నేనే లీడర్‌.


మరి మీరు సినిమా రంగంలోకి ఎలా వచ్చారు?

చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి వల్ల చదువు ఎక్కువ అబ్బలేదు. ‘ఇంద్ర’ సినిమా విడుదలయిన తర్వాత రచయిత చిన్నికృష్ణ గుంటూరు వచ్చారు. ఆయనను రిసీవ్‌ చేసుకోవటానికి చిరంజీవి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ తరపున రైల్వే స్టేషన్‌కు వెళ్లా. ఒక రోజంతా ఆయనతోనే ఉండి థియేటర్లు తిప్పి చూపించా. ఆయన వెళ్లేటప్పుడు-  ‘‘హైదరాబాద్‌ వస్తే మా ఇంటికిరా’’ అన్నారు. ఇది జరిగిన వారం రోజులకు ఒక 50 మంది చిరంజీవిగారిని చూడటానికి హైదరాబాద్‌ వెళ్లాం. ఆయన నా భుజం తట్టారు. అందులో ఏ శక్తి ఉందో కానీ- నా ఒళ్లు ఝల్లుమంది. అప్పుడే సినిమా రంగంలోకి రావాలని డిసైడ్‌ అయిపోయా!


వెంటనే అవకాశాలొచ్చాయా?

చిన్నికృష్ణ గారి దగ్గరకు వెళ్లి ‘వచ్చేశా సార్‌’ అన్నా. ఆయనకు నా పరిస్థితి అర్థమయినట్లుంది. ‘ఎప్పుడైనా కలవమన్నా కానీ వెంటనే వచ్చేయమనలేదు’ అన్నారు. అయినా వినకుండా- సినిమాల్లో ఛాన్స్‌ కోసం ఆయన వెంటపడ్డా. చిరంజీవి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ తరపున పనిచేస్తున్నా కదా... గొడవెందుకు అనుకున్నారేమో.. నన్ను ‘గంగోత్రి’ సినిమా తీస్తున్న రాఘవేంద్రరావుగారి దగ్గరకు పంపారు. ఆయన- తన అసిస్టెంట్‌ను పిలిచి- నా నిక్కరు కొలతలు తీసుకొమ్మన్నారు. ఆ మాటలకు చాలా హర్ట్‌ అయ్యా! ఎందుకంటే నాకు ఐదో క్లాసు నుంచి ప్యాంట్లు వేసుకోవటం అలవాటు. నేను నిక్కరు వేసుకొని సినిమాల్లో నటిస్తే- గుంటూరులో నా పరువు ఏమవుతుంది? మళ్లీ చిన్నికృష్ణగారి దగ్గరకు వెళ్లి- ‘నేనా సినిమా చేయను’ అని చెప్పా. మరేం చేస్తావు? అని అడిగారు. ‘సినిమా కథలు రాస్తా’ అన్నా. ఆయన కొద్ది కాలం నన్ను ఎవాయిడ్‌ చేయటానికి ప్రయత్నించేవారు. కానీ ప్రతి రోజు ఉదయమే వాళ్లింటి ముందు - ‘స్వాతిముత్యం’లో కమల్‌హాసన్‌లా నిలబడేవాడిని. నా బాధ తట్టుకోలేక- ఒక రోజు నన్ను పిలిచి- ‘గంగోత్రి’లో ఒక సీన్‌ రాయాలి.. రెండు రోజుల్లో రాసి తీసుకురా’ అన్నారు. ప్రకాష్‌రాజ్‌, సుమన్‌ల సీన్‌ అది. బహుశా నన్ను పంపించేయటానికి అంత కష్టమైన సీన్‌ ఇచ్చి ఉంటారు. కానీ నేను మధ్యాహ్నానికే ఆయనకు సీన్‌ రాసి ఇచ్చా. ఆయనకు నచ్చింది. వెంటనే నన్ను ఆయన టీమ్‌లో చేర్చుకున్నారు. 

 

ఆ తర్వాత ప్రయాణం ఎలా సాగింది? 

చిన్నికృష్ణగారి దగ్గర చేరినప్పుడు నాకు 19 ఏళ్లు. నేను ఆయన ఇంట్లోనే ఉండేవాడిని. ఒక వైపు రచనలు చేస్తున్నా- డైరక్షన్‌ చేయాలనే కోరిక కూడా ఉండేది. ఆ సమయంలో ఆదినారాయణగారు ‘పొలిటికల్‌ రౌడీ’ అనే సినిమా తీస్తున్నారు. ఆయన దగ్గర డైరక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరా. ఆ తర్వాత కోన వెంకట్‌గారి దగ్గర... దిల్‌రాజుగారి దగ్గర... ఇలా అనేక మంది దగ్గర పనిచేశా. ఒక దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చింది మాత్రం రవితేజ. ‘బలుపు’ సినిమాకు పనిచేస్తున్న సమయంలో ఒక రోజు రవితేజ నాతో ‘నీ గోల్‌ ఏమిటి?’ అని అడిగారు. ‘డైరక్షన్‌ చేయాలి.. ఒక కథ రాసుకున్నా’ అని చెప్పా.  ‘‘బలుపు’ హిట్‌ అయితే నెక్ట్స్‌ పిక్చర్‌ నీతో చేస్తా!’ అన్నారు. ‘బలుపు’ పెద్ద హిట్‌ అయింది. రవితేజకు అనేక ఆఫర్స్‌ వచ్చాయి. అయినా ఆయన నన్ను గుర్తుపెట్టుకొని ‘పవర్‌’కు అవకాశం ఇచ్చారు. నన్ను దర్శకుడిని చేశారు. 


ఒక రచయిత దర్శకుడిగా మారితే ఎలాంటి ప్రయోజనాలుంటాయి..?

నూటికి నూరుశాతం ఉపయోగం ఉంటుంది. ఒకప్పుడు రైటర్‌, డైరెక్టర్‌ వేర్వేరుగా ఉండేవారు. కానీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరి కథ వారే రాసుకోవటం వల్ల అనేక ఉపయోగాలుంటాయి. దర్శకుడే కథ రాసుకున్నప్పుడు తనకు కావాల్సిన రీతిలో దానిని మార్చుకొనే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో ఎక్కువ మంది నిర్మాతలు- డైరెక్టర్‌ కమ్‌ రచయితలనే ఎంపిక చేసుకుంటున్నారు. 


దీని వల్ల సృజనాత్మకత దెబ్బతింటుందని... కొత్త కోణాలు తెలిసే అవకాశం లేదనే విమర్శ కూడా ఉంది కదా...

ప్రస్తుతం సినిమా రచన.. నిర్మాణం ఒక టీమ్‌ ద్వారా జరుగుతోంది. ఉదాహరణకు నా దగ్గర నలుగురైదుగురు రైటర్స్‌ ఉన్నారు. ఒక కథను మలచటంలో వీరందరి పాత్ర కూడా చాలా ఉంటుంది. నేను ఒక రైటర్‌ని కాబట్టి.. నా టీమ్‌ చెప్పే కోణాలు నాకు వెంటనే అర్థమవుతాయి. నేను నా టీమ్‌ చెప్పేదంతా వింటా. 


తెలుగు సినిమా దర్శకులు ప్రయోగాలు చేయటానికి భయపడతారనే విమర్శ ఉంది కదా...

మనం ఎవరి కోసం సినిమా తీస్తున్నాం? దాని బడ్జెట్‌ ఎంత? అనే విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి కదా. మీకో ఉదాహరణ చెబుతా. రవితేజ- ‘నా ఆటోబయోగ్రఫీ’, ‘శంభో శివ శంభో’ వంటి చిత్రాల్లో నటించారు. ఆ చిత్రాలకు వచ్చిన కలెక్షన్స్‌కు.. ఆయన నటించిన కమర్షియల్‌ సినిమాల కలెక్షన్స్‌కు తేడా ఉంది. బడ్జెట్‌ తక్కువగా ఉన్న సినిమాలకు అలాంటి సమస్య ఉండదు. 


ఓటీటీలను ప్రేక్షకులు చూడటం మొదలుపెట్టారు కదా... దీని ప్రభావం సినీ నిర్మాణంపై ఎలా ఉంటుంది?

ఓటీటీ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఇప్పటి దాకా ఒక సినిమా హిట్‌ అయితే ఆ తరహా సినిమాల తీయటానికే నిర్మాతలు, దర్శకులు ప్రయత్నించేవారు. ఉదాహరణకు ‘కాంచన’ హిట్‌ అయిన తర్వాత అనేక దయ్యం కథలు వచ్చాయి. ‘కేజీఎఫ్‌’ హిట్‌ అయితే ఆ తరహా కథల కోసమే వెతుకుతున్నారు. కానీ ఓటీటీల వల్ల ప్రేక్షకులు సినిమాలను చూసే ధోరణిలో మార్పు వస్తోంది. దీని ప్రభావం సినీ నిర్మాణంపై కూడా ఉంటుంది. అయితే కమర్షియల్‌ సినిమా ఫార్ములాకి మాత్రం ఆదరణ ఏ మాత్రం తగ్గదు. థియేటర్‌లో చూసే ప్రేక్షకులు కిక్‌ కోరుకుంటారు. అది కమర్షియల్‌ సినిమా మాత్రమే ఇస్తుంది. 


 ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ సినిమా మీకు ఎలాంటి పాఠాలు నేర్పింది? 

దర్శకుడిగా నాకు రెండో సినిమా. అలాంటి అవకాశం రావటమే నా అదృష్టం. దర్శకుడిగా ఆయనతో నాకు ఒక అవకాశం వచ్చినందుకు ఆనందపడతా. కానీ ఒక అభిమానిగా మాత్రం నేను చాలా నిరాశ చెందా. స్ర్కిప్ట్‌ ఇంకా బావుంటే ఆ సినిమా తప్పకుండా హిట్‌ అయ్యేది. నావైపు నేను ఏదైనా మిస్‌ అయ్యానా? అని ఆలోచించుకున్నా. స్ర్కిప్ట్‌ బావులేకపోతే - ఎంత పెద్ద స్టార్‌ ఉన్నా సినిమా హిట్‌ కాదనే పాఠాన్ని నేర్చుకున్నా. అసలు స్టార్‌ స్ర్కిప్టే. 


ఎంతైనా రైటర్‌ కదా..

మా నాన్న నా సినిమాలన్నీ గుంటూరులోనే చూస్తారు. చూసిన వెంటనే ఫోన్‌ చేసి సినిమాలో ఎలాంటి మార్పులు చేయాలో చెబుతూ ఉంటారు. ఎంతైనా రైటర్‌ కదా... అందుకే ఆయనకు నా స్ర్కిప్ట్స్‌ చూపించను. ‘నువ్వు మాస్‌ సినిమా తీసావు.. విజిల్స్‌ కొట్టారు.. మరి నెక్ట్స్‌ సినిమా ఏమిటి. దానిలో ఏం మార్పులు చేస్తున్నావు?’ అంటారు. 


పూరీ బెస్ట్‌!

నాకు నచ్చిన రచయిత, దర్శకుడు పూరీ జగన్నాధ్‌. నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ‘ఇడియట్‌’ వచ్చింది. అప్పటి నుంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. హిట్‌ అయిందా?ఫెయిల్‌ అయిందా? అనే విషయాన్ని ఆయన పట్టించుకోరు. ఆయనను చూసి నాలాంటి యంగ్‌ డైరక్టర్స్‌ చాలా నేర్చుకోవాలి. ‘పూరీ సినిమా’ అని థియేటర్‌కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు విజిలేసి.. చప్పట్లు కొట్టి వెళతాడు.




చిరంజీవితో సినిమా చేస్తున్నారు కదా.. ఆ జర్నీ ఎలా ఉంది?

నేను కాలేజీలో ఉండగా- చిరంజీవి సినిమా పాటల క్యాసెట్‌ విడుదలయితే- దాన్ని కొనుక్కొని- ఒక పాతిక మంది కుర్రాళ్లం డ్యాన్సులు చేసేవాళ్లం. ఒకప్పుడు వాళ్లల్లో ఒకడినైన నేను- చిరంజీవి గారింటికి వెళ్లి దేవీ శ్రీ ప్రసాద్‌ చేసిన ట్యూన్‌ వినిపించి వచ్చా. ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత హటాత్తుగా డైరక్టర్‌ను అనే ఆలోచన వచ్చి షాక్‌ కొట్టినట్లయింది. ఇక సినిమా విషయానికి వస్తే- స్ర్కిప్ట్‌ రెడీ అయిపోయింది. మ్యూజిక్‌ రెడీ అవుతోంది. కొవిడ్‌ వల్ల ‘ఆచార్య’ లేటయింది. ఈ సినిమా తర్వాత ఆయన ‘లూసిఫర్‌’ తెలుగు రీమేక్‌ చేస్తున్నారు. తెలుగు ‘లూసిఫర్‌’తో పాటు మా సినిమా మొదలవుతుందా? ఆ తర్వాత మొదలవుతుందా? అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

                                                                                                               సివిఎల్‌ఎన్‌


తూనీగ.. తూనీగ

ఇంటర్‌ చదివే కుర్రాడు.. తొమ్మిదో తరగతి చదివే అమ్మాయిని ప్రేమించి...... పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది ? అదే మా ప్రేమ కథ. నా భార్య పేరు అనూష. మా ఇద్దరిది ప్రేమ వివాహం. మొదట్లో మా ఇంట్లో.. వాళ్లింట్లో ఒప్పుకోలేదు. అనూష వాళ్లకు నటుడు చలపతిరావుగారు దూరపు చుట్టాలు అవుతారు. ఆయన ఎంక్వైరీ చేసి- ‘కుర్రాడు మంచోడే!’ అని చెప్పారు. శ్రీహరిగారు నాకేమద్దతు ఇచ్చారు. ఇప్పుడు మావైపు వారు.. వారివైపు వారు అంతా హ్యాపీ! తను ఎంటెక్‌ చదివి రెండేళ్లు ఉద్యోగం చేసింది. నేను బిజీ అయిన తర్వాత ఉద్యోగం మానేసింది. మా కూతురి పేరు శ్రీవైష్ణవి. నాకు చిన్నప్పుడు రెండే గోల్స్‌ ఉండేవి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం, దర్శకుడిని అవ్వడం. ఈ రెండు నెరవేరాయి. 



అంత సింపులా!

చిరంజీవిగారిని చూస్తుంటే ఒక మెగాస్టార్‌ ఇంత సింపుల్‌గా ఉంటారా? అనిపిస్తుంది. 150 సినిమాలు చేసిన తర్వాత కూడా - తొలి సినిమాలో ఉండే ఎక్సైట్‌మెంట్‌ ఆయనలో కనిపిస్తుంది. ఇప్పటికీ హోమ్‌వర్క్‌ చేస్తూనే ఉంటారు. అర్థరాత్రి కూడా- ‘ఫలానా సినిమాలో ఆ సీన్‌ చూడు.. చాలా బావుంది..’ అని మెసేజ్‌లు పెడుతూనే ఉంటారు. 

Updated Date - 2021-07-11T06:40:26+05:30 IST