కథ ఒకటే.. రెండు సినిమాలు!

ABN , First Publish Date - 2021-12-31T00:27:41+05:30 IST

బాలీవుడ్‌లో మిథున్‌ చక్రవర్తి, పద్మినీ కొల్హాపురి జంటగా కె.సి.బొకాడియా తీసిన ‘ప్యార్‌ జుక్తా నహీ’ (1985) చిత్రం పెద్ద హిట్‌ అయింది. ఈ సినిమా రీమేక్‌ హక్కులు నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు కొన్నారు. శోభన్‌బాబుతో ఆ సినిమాను తెలుగులో తీయాలని ఆయన ఆలోచన. అయితే అప్పటికే నిర్మాత మిద్దే రామారావు కృష్ణ, శ్రీదేవి జంటగా ఓ చిత్రాన్ని ప్రారంభించారు.

కథ ఒకటే.. రెండు సినిమాలు!

బాలీవుడ్‌లో మిథున్‌ చక్రవర్తి, పద్మినీ కొల్హాపురి జంటగా కె.సి.బొకాడియా తీసిన ‘ప్యార్‌ జుక్తా నహీ’ (1985) చిత్రం పెద్ద హిట్‌ అయింది. ఈ సినిమా రీమేక్‌ హక్కులు నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు కొన్నారు. శోభన్‌బాబుతో ఆ సినిమాను తెలుగులో తీయాలని ఆయన ఆలోచన. అయితే అప్పటికే నిర్మాత మిద్దే రామారావు కృష్ణ, శ్రీదేవి జంటగా ఓ చిత్రాన్ని ప్రారంభించారు. కొన్ని సీన్లు, రెండు పాటలు కూడా తీశారు. అయితే చిత్రకథ అనుకున్న రీతిలో రావడం లేదని షూటింగ్‌ ఆపేసి కొత్త కథ కోసం అన్వేషణ ప్రారంభించారు. ఆ సమయంలోనే ‘ప్యార్‌ జుక్తా నహీ’ చిత్రం నిర్మాత మిద్దే రామారావు దృష్టికి వచ్చింది. ఆ చిత్రం రీమేక్‌ రైట్స్‌ తనకు ఇవ్వమనీ, హీరో కృష్ణతో తీస్తానని  ఆయన అడగడంతో సరేనని ఇచ్చేశారు అట్లూరి పూర్ణచంద్రరావు. ఆ తర్వాత హీరో కృష్ణకు హిందీ సినిమా చూపించారు. ఆయన ఓకే చెప్పడంతో  తెలుగులో ‘పచ్చని కాపురం’ అని పేరు పెట్టి మళ్లీ షూటింగ్‌ ప్రారంభించారు. 

అయితే అదే కథతో శోభన్‌బాబు, విజయశాంతి జంటగా ‘శ్రీవారు’ పేరుతో మరో చిత్రం తయారవుతున్న విషయం ‘పచ్చని కాపురం’ మూడు షెడ్యూల్స్‌ పూర్తయ్యాక కానీ నిర్మాత మిద్దే రామారావుకు, దర్శకుడు తాతినేని రామారావుకు తెలీలేదు. అప్పటికి ప్యాచ్‌వర్క్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉంది. ఈ విషయం తెలిశార నిర్మాత మిద్దే రామారావు నిబ్బరంగానే ఉన్నా, దర్శకుడు రామారావులో టెన్షన్‌ మొదలైంది. ఒకే కథతో రెండు సినిమాలు ఒకే రోజున విడుదలైతే ఇన్నాళ్లూ తాము పడిన కష్టం వృధా అవుతుందనే భయం ఆయనలో మొదలైంది. అందుకే వారం రోజుల పాటు రాత్రి, పగలు అనే తేడా లేకుండా వర్క్‌ చేసి, మిగిలిన అన్ని కార్యక్రమాలు శరవేగంతో పూర్తి చేసి ఫస్ట్‌ కాపీ తెచ్చారు. వెంటనే రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు మిద్దే రామారావు. ‘పచ్చని కాపురం’ చిత్రం మొదట అంటే 1985 సెప్టెంబర్‌ 9న విడుదల అయింది. సినిమా పెద్ద హిట్‌. రెండు వారాల తర్వాత శోభన్‌బాబు నటించిన ‘శ్రీవారు’ రిలీజ్‌ అయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ సినిమా కూడా విజయం సాధించడం. 

–వినాయకరావు

Updated Date - 2021-12-31T00:27:41+05:30 IST