సినిమా రివ్యూ : ‘వన్ బై టు’

ABN , First Publish Date - 2022-04-22T21:31:56+05:30 IST

వైవిధ్యమైన ప్రేమకథా చిత్రాల్ని అందించడానికి ఈ తరం దర్శకులు ఎంతో శ్రమిస్తున్నారు. కొత్త దనం కలిగిన కథాంశాల్ని అందించే ప్రయత్నంలో ప్రయోగాలకు సైతం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మక ప్రేమకథా చిత్రం ‘వన్ బై టు’తో ఈ రోజే (ఏప్రిల్ 22) ప్రేక్షకుల ముందుకొచ్చాడు శివ ఏటూరి అనే దర్శకుడు. ఎవరూ తీయడానికి సాహసించని కథతో, ఓ సరికొత్త జంటతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశాడు.

సినిమా రివ్యూ : ‘వన్ బై టు’

చిత్రం : వన్ బై టు 

విడుదల తేదీ : ఏప్రిల్ 22, 2022

నటీనటులు : సాయికుమార్, ఆనంద్ పాండి, శ్రీ పల్లవి, దేవీ ప్రసాద్, కాశీ విశ్వనాథ్ తదితరులు

సంగీతం : లియాండర్ లీ మార్టీ

ఛాయాగ్రహణం : శంకర్ కేసరి

డైలాగ్స్ : విజయ భారతి

నిర్మాణం : చెర్రీ క్రియేటివ్ వర్క్స్

నిర్మాత : కరణం శ్రీనివాసరావు

దర్శకత్వం : శివ ఏటూరి

వైవిధ్యమైన ప్రేమకథా చిత్రాల్ని అందించడానికి ఈ తరం దర్శకులు ఎంతో శ్రమిస్తున్నారు. కొత్త దనం కలిగిన కథాంశాల్ని అందించే ప్రయత్నంలో ప్రయోగాలకు సైతం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మక ప్రేమకథా చిత్రం ‘వన్ బై టు’తో ఈ రోజే (ఏప్రిల్ 22) ప్రేక్షకుల ముందుకొచ్చాడు శివ ఏటూరి అనే దర్శకుడు. ఎవరూ తీయడానికి సాహసించని కథతో, ఓ సరికొత్త జంటతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇంతకీ అతడు తీసిన ప్రేమకథలోని కొత్తదనమేంటి? అది ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అవుతుంది ? అనే విషయాలు రివ్యూలో చూద్దాం.


కథ 

పాండు (ఆనంద్ ) ఓ గల్లీలో అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు. తన ప్రాంతంలోని అమ్మాయిలందరికీ ఐలవ్ యూ చెప్పి వారిచేత ఛీకొట్టించుకొన్న చరిత్ర అతడిది. అయితే ఆ ఏరియాలోకి ఓ అందమైన అమ్మాయి అడుగుపెడుతుంది. ఆమె పేరు జెన్నీ (శ్రీ పల్లవి). తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు పాండు. కానీ ఆ అమ్మాయి పాండును ఏమాత్రం పట్టించుకోదు. అయినా సరే అతడు ఆ అమ్మాయిని ఫాలో అవుతునే ఉంటాడు. ఒకరోజు ఆ అమ్మాయికి ఇంట్లో వారు సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న పాండు ఆ అమ్మాయి మెళ్లో బలవంతంగా తాళి కట్టడానికి సిద్ధమవుతాడు. ఆ అమ్మాయి అడ్డు చెప్పే క్రమంలో, చూసిన వాళ్లు పాండు ఆ అమ్మాయి మీద ఏసిడ్ పోస్తున్నాడని పొరపాటు పడి.. అతడ్ని కొట్టే ప్రయత్నం చేస్తారు. ఈ విషయం జెన్నీ తండ్రి (కాశీ విశ్వనాథ్)కి తెలిసి.. ఆ ఏరియాలో పేరు మోసిన గ్యాంగ్ స్టర్ సాయన్న (సాయికుమార్) సహాయం అర్ధిస్తాడు. సాయన్న పాండుని చంపుదామనుకొని, మనసు మార్చుకొని వదిలేస్తాడు. దాంతో జెన్నీకి జాలి కలిగి  పాండుకి ఐలవ్ యూ చెప్పి.. తనకు సంబంధించిన ఓ నిజం చెబుతుంది. దాంతో పాండు ఖంగుతింటాడు. ఆ అమ్మాయిని తప్పించుకొని తిరుగుతాడు. ఇంతకీ జెన్నీ చెప్పిన నిజమేంటి? దాని వల్ల పాండు జీవితంలో చోటుచేసుకొన్న పరిణామాలేంటి? అన్నది మిగతా కథ. 


విశ్లేషణ 

మిగతా భాషల సంగతి పక్కనపెడితే.. తెలుగులో ఇంతవరకూ ఎవరూ టచ్ చేయడానికి సాహసించని కథాంశంతో కొత్త దర్శకుడు శివ ఏటూరి ఓ ప్రయత్నం చేశాడు. నిజంగా ఇది డేరింగ్ డెసిషన్. ఈ సినిమాలో కథానాయిక హిజ్రా అవడమే అతడు చేసిన ప్రయోగం. ఆమె హీరోకి ఐలవ్ యూ చెప్పినప్పుడు దాన్ని రివీల్ చేయడం ప్రేక్షకులకు పెద్ద షాక్. ఈ సమాజం హిజ్రాలపై చిన్న చూపు చూడడం.. వారిని అంటరానివారిగా ట్రీట్ చేయడం.. వారికీ ఒక మనసు ఉంటుందని, వారికీ కుటుంబంతో కలిసి మెలిసి ఉండాలని అనిపిస్తుందని, వారుకూడా తోడు కోరుకుంటారని అందరూ భావిస్తే వారికి రోడ్డుపై అడుక్కునే దుస్థితి రాదని ఈ సినిమాతో దర్శకుడు చెప్పాలనుకున్నాడు. అయితే అనుకోవడం వరకూ ఓకే. కానీ దాన్ని స్ర్కీన్ పై ఎగ్జిక్యూట్ చేయడంలో కొంత వరకూ మాత్రమే సక్సెస్ అయ్యాడు దర్శకుడు. చెప్పాలనుకున్న పాయింట్ ను సిన్సియర్ గానే అంటెమ్ట్ చేశాడు. కానీ కథాకథనాలపై సరైన స్థాయిలో దృష్ఠిపెట్టలేదని అనిపిస్తుంది. కథానాయిక హిజ్రా అవడం వల్లనే ఆమె తల్లి చిన్నతనంలో ఆత్మహత్య చేసుకుంటుంది. కానీ తండ్రి మాత్రం ఆమెను రోడ్డుమీదకు తరిమేయకుండా అక్కున చేర్చుకోవడం.. ఆమె తండ్రి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండడం సినిమాలో ఆకట్టుకొనే పాయింట్స్. కాకపోతే ఈ అంశం తప్ప ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా కదిలించే అంశం ఒక్కటీ లేకపోవడం మైనస్ పాయింట్. అలాగే. ఈ ప్రేమ కథాంశాన్ని సుఖాంతం చేయడాన్ని ఆడియన్స్ జీర్ణించుకోలేకపోవచ్చు. మొత్తం మీద  ‘వన్ బై టు’ చిత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఒక ప్రయోగాత్మక ప్రేమకథ అని చెప్పాలి. 


పాండుగా కొత్త కుర్రోడు ఆనంద్ బాగానే చేశాడు. కాకపోతే నటనలో మరింత పరిపక్వత కావాలి. జెన్నీగా నటించింది అమ్మాయి అయినప్పటికీ హిజ్రాగా హావభావాలు బాగా పలికించింది. సాయన్నగా సాయికుమార్ అంతగా చేసిందేమీ లేదు. కానీ కనిపించినంత సేపూ తన మార్క్ చూపించారు. అలాగే హీరో ఫ్రెండ్ గా నటించిన కుర్రాడు బాగా చేశాడు. అతడికి రచ్చ రవి వాయిస్ ఇవ్వడంతో ప్రేక్షకులు ఆ పాత్రతో కొంచెం కనెక్ట్ అవుతారు. ఇక దేవీప్రసాద్, విశ్వనాథ్ కాశీ, ఆర్కే పర్వాలేదనిపించుకుంటారు. నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి. సంగీతం ఆకట్టుకుంటుంది. ఛాయాగ్రహణం మెప్పిస్తుంది. ప్రయోగాలు కోరుకొనే వారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. 

ట్యాగ్ లైన్ : ప్రయోగాత్మక ప్రేమకథ 

Updated Date - 2022-04-22T21:31:56+05:30 IST