'భీష్మ' కాంబినేషన్ మళ్ళీ రిపీటవుతుందనే వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతక ముందు వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్‌కి యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుమల 'భీష్మ' సినిమాతో సాలీడ్ హిట్ ఇచ్చాడు. గత ఏడాది విడుదలయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టింది. నితిన్ కూడా ఫుల్ ఫాంలోకి వచ్చి వరుసగా క్రేజీ మూవీస్‌ని లైనప్ చేసుకున్నాడు. ఇటీవలే బాలీవుడ్ సూపర్ హిట్ 'అంధాదున్' రీమేక్ 'మాస్ట్రో' పూర్తి చేశాడు. త్వరలో 'పవర్ పేట' ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందని సమాచారం. అలాగే కొత్త ప్రాజెక్ట్‌కి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే మరోసారి వెంకీ కుడుమల - నితిన్ కాంబినేషన్లో మరో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయట. ఇటీవలే వెంకీ కుడుమల ..నితిన్‌కి ఓ కథ చెప్పాడట. ఆ కథ నచ్చి ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.