నాన్న నడిపించిన బాటలో...

ఒక తరంలో వెండితెరపై తమదైన ముద్రవేసిన దర్శకులు వారు. ఇప్పుడు వారి వారసులు  అగ్రతారలుగా ఇండస్ట్రీలను ఏలుతున్నారు. కుటుంబ నేపథ్యం కలిగి ఆర్టిస్టులుగా ఎంటర్‌ అయి, స్టార్స్‌గా ఎదిగిన వారు ఉన్నారు. అయితే ప్రముఖ దర్శకుల వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారిలో కొంతమంది మాత్రమే అగ్ర హీరోలుగా ఎదిగారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.


తండ్రి చెక్కిన శిల్పం 

బాలీవుడ్‌ దర్శకుడు రాకేశ్‌ రోషన్‌ తనయుడు  హృతిక్‌ రోషన్‌. బాలీవుడ్‌ అగ్ర హీరోగా హృతిక్‌  ఎదుగుదలలో   రాకేశ్‌  కృషిని మరువలేం. ‘కహోనా ప్యార్‌ హై’తో హృతిక్‌ను హీరోగా బాలీవుడ్‌కి పరిచయం చేయడమే కాదు తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని అందించారు  ఆ విజయం పునాదుల మీదనే ఎదిగిన హృతిక్‌రోషన్‌ బాలీవుడ్‌లో టాప్‌ హీరోగా నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న అగ్ర నటుల్లో హృతిక్‌ ఒకరు. తండ్రి  దర్శకుడు కావడంతో హృతిక్‌ రోషన్‌ బాల్యం నుంచి సినీ పరిశ్రమను చూస్తూ పెరిగారు. తండ్రి దర్శకత్వంలోనే బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత రాకేశ్‌ రోషన్‌ దగ్గర నాలుగు చిత్రాలకు సహాయ దర్శకుడిగా కూడా పనిచేశారు. కొన్ని ప్లాప్‌ చిత్రాలతో హృతిక్‌  రేస్‌లో వెనకడుగు వేసినప్పుడు మళ్లీ మెగాఫోన్‌ చేపట్టి ‘కోయి మిల్‌గయా’, ‘క్రిష్‌’ వంటి హిట్‌ సీక్వెల్స్‌తో కొడుకును  నిలబెట్టారు. 


నాన్నే అండ

బాలీవుడ్‌లో ఈ తరం ప్రముఖ హీరోల్లో వరుణ్‌ ధావన్‌ ఒకరు. కెరీర్‌ ప్రారంభంలో తనదైన కామెడీ టైమింగ్‌తో వైవిధ్యమైన పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత తన పంథా మార్చి పలు సీరియస్‌ పాత్రల్లోనూ ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేశారు వరుణ్‌.  దర్శకుడు డేవిడ్‌ ధావన్‌ తనయుడు కావడంతో  అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వరుణ్‌ తన సినీ కెరీర్‌ మొదలుపెట్టారు. 2012లో ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత తండ్రి డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వంలో తెలుగు చిత్రం ‘కందిరీగ’ హిందీ రీమేక్‌ ‘మై తేరా హీరో’తో సక్సెస్‌ అందుకున్నారు. వరుణ్‌ ‘జుద్వా 2’, గతేడాది వచ్చిన ‘కూలీ నంబర్‌ వన్‌’ చిత్రాలకు కూడా డేవిడ్‌ ధావనే దర్శకుడు. దర్శకుడిగా తనయుడికి మంచి హిట్లు ఇవ్వడమే కాదు, హీరోగా వరుణ్‌ వరుస  హిట్లు సాధించడంలోనూ తెర వెనుక డేవిడ్‌ ధావన్‌ ప్లానింగ్‌ ఉంది. సోదరుడు రోహిత్‌ ధావన్‌  దర్శకత్వంలో  కూడా వరుణ్‌ ‘డిష్యూం’ అనే చిత్రం చేశారు. 


నాన్న సలహాతో...

సామాన్యుల జీవితాల్ని, పరిస్థితుల్ని ఆవిష్కరిస్తూ సహజత్వానికి దగ్గరగా ఉండే కథలతో తెరకెక్కే చిత్రాల ద్వారా ఫహద్‌ దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సహాయపాత్రలు, సెకండ్‌ హీరో పాత్రలు చేస్తూ క్రమంగా మలయాళ చిత్ర పరిశ్రమలో అగ్రహీరోగా నిలదొక్కుకోవడానికి  ఫహద్‌ ఫాజిల్‌కు ఆయన తండ్రి అలెక్సా మహమ్మద్‌ ఫాజిల్‌ సలహాలు ఉపయోగపడ్డాయి. ఫహద్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మాతగా మారి స్వీయ దర్శకత్వంలో 2002లో ‘కైయెతుమ్‌ దూరత్‌’ మలయళ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. దాంతో ఫహద్‌ చదువుకోసం అమెరికా వెళ్లారు. తిరిగి 2009లో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటిదాకా నలబైకు పైగా చిత్రాల్లో నటించి స్టార్‌గా ఎదిగాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు తండ్రితో ఫాజిల్‌ మరో చిత్రం చేయబోతున్నారు. ఈ తండ్రి కొడుకుల కాంబినేషన్‌లో నిజజీవిత సంఘటనల నేపథ్యంలో ‘మలయకుంజు’ అనే చిత్రం తెరకెక్కుతోంది.  


అన్న మాట- నాన్న బాట

దక్షిణాదిన పరిచయం అవసరం లేని పేరు ధనుష్‌. తనదైన  పాత్రోచిత నటనతో తమిళనాట నటుడిగా, అగ్రహీరోగా అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. ధనుష్‌ సక్సెస్‌ వెనుక ఆయన తండ్రి కస్తూరి రాజా, సోదరుడు సెల్వ రాఘవన్‌ కృషి  ఉంది. ధనుష్‌ను హీరోగా పరిచయం చేస్తూ కస్తూరి రాజా 2002లో ‘తుల్లువాదో ఇలామై’ చిత్రం రూపొందించారు. ఈ చిత్రానికి సెల్వ రాఘవన్‌ స్ర్కీన్‌ప్లే అందజేశారు. తర్వాత ఆయన దర్శకుడిగా ‘కాదల్‌ కొండేయిన్‌’ రూపొందించి ధనుష్‌కు కమర్షియల్‌ హిట్‌ ఇచ్చారు. ధనుష్‌ 2004లో తండ్రి దర్శకత్వంలో ‘డ్రీమ్స్‌’ అనే మరో చిత్రం చేశారు. ఇప్పుడు ధనుష్‌ దక్షిణాదిన అగ్రహీరోగా వెలుగొందుతున్నారు. హాలీవుడ్‌ చిత్రం ‘ద గ్రే మ్యాన్‌’ లోనూ  నటిస్తున్నారు. 


పట్టుపట్టి హీరోగా నిలబెట్టి

తమిళ నాట రజనీకాంత్‌ తర్వాత ఆ స్థాయి ప్రేక్షకాదరణ సాధించిన హీరో విజయ్‌. మాస్‌ ప్రేక్షకుల్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. తమిళ ఇండస్ట్రీలో విజయ్‌ ఇంత గొప్ప పొజిషన్‌కు రావడం వెనుక ఆయన తండ్రి ఎస్‌. ఏ చంద్రశేఖర్‌ గట్టి పట్టుదల ఉంది.  ‘వెట్రి’ చిత్రంతో తన దర్శకత్వంలోనే విజయ్‌ను బాల నటుడిగా వెండితెరకు పరిచయం చేశారాయన. ఆ తర్వాత విజయ్‌ హీరోగా   స్వీయ దర్శకత్వంలో పలు చిత్రాలు నిర్మించారు. ప్రారంభంలో విజయ్‌కు సరైన బ్రేక్‌ రాకపోయినా పట్టు వదలకుండా తనయుడితో సినిమాలు చేస్తూ వచ్చారు. విజయ్‌ హీరోగా ‘సెందూర్‌పండి’, ‘రాశిగన్‌’, ‘దేవా’, ‘విష్ణు’, ‘మా భూమిగ మానవన్‌’, ‘ఒన్స్‌ మోర్‌’, ‘నెంజినిలే’ చిత్రాలను  చంద్రశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. అలాగే విజయ్‌ హీరోగా ‘ఆథి’ చిత్రాన్ని నిర్మించారు. విజయ్‌ను హీరోగా పెట్టి నూతన దర్శకులతో సినిమాలు నిర్మించారు. చంద్రశేఖర్‌ ముందుచూపు వల్ల విజయ్‌ హీరోగా నిలదొక్కుకొని కోలీవుడ్‌ మెగాస్టార్‌గా మన్ననలందుకుంటున్నాడు. 


తెలుగునాట కొందరే సక్సెస్‌

తెలుగులోనూ కొందరు అగ్ర దర్శకుల తనయులు హీరోలుగా అరంగేట్రం చేశారు. అయితే వారిలో ఎవ్వరూ అగ్రహీరో స్థాయిని మాత్రం అందుకోలేకపోయారు. దర్శకుడు టి. కృష్ణ తనయుడు గోపీచంద్‌ హీరోగా ఓ మోస్తరు క్రేజ్‌ దక్కించుకున్నాడు. ఈ.వి.వి. సత్యనారాయణ  తనయులు ఆర్యన్‌ రాజేష్‌, అల్లరి నరేష్‌ హీరోలుగా అరంగేట్రం చేశారు. అల్లరి నరేష్‌ మాత్రమే వైఫల్యాలను కూడా  తట్టుకొని పరిశ్రమలో కొనసాగుతున్నారు. రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి నటుడిగా కొనసాగుతున్నారు. ఈ జనరేషన్‌లో పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి, ‘వర్షం’ ఫేం శోభన్‌ తనయుడు సంతోష్‌ శోభన్‌ హీరోలుగా చేస్తున్నారు. సీనియర్‌ నటి, దర్శకులు విజయ నిర్మల తనయుడు వీకే నరేశ్‌ హీరోగా, హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.  రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్‌ కోవెలమూడి, దాసరి నారాయణరావు తనయుడు అరుణ్‌కుమార్‌, ఏ. కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్‌ రెడ్డి హీరోలుగా ప్రయత్నించినా సక్సెస్‌ కాలేకపోయారు. 


నాన్న  ప్రోత్సాహం...

తమిళనాట యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న హీరో శింబు. తన తండ్రి టి. రాజేందర్‌ దర్శకత్వంలోనే బాల నటుడిగా వెండితెర అరంగేట్రం చేశాడు శింబు. దాదాపు 15 చిత్రాల్లో బాల నటుడిగా ఆయన కనిపించారు. 2002 ‘కాదల్‌ అజివితిల్లై’ చిత్రంతో తనయుడు శింబును హీరోగా పరిచయం చేసి, మంచి హిట్‌ ఇచ్చారు టి. రాజేందర్‌. ఆయన నిర్మాతగా శింబుతో ‘ఇదు నమ్మ ఆలు’ చిత్రాన్ని నిర్మించారు. అలాగే శింబు హిట్‌ చిత్రం ‘వల్లభ’లో ఓ సాంగ్‌లో డ్యాన్సర్‌గా కనిపించారు టి. రాజేందర్‌. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.