ఓదెల రైల్వేస్టేషన్
ABN , First Publish Date - 2022-09-04T08:49:07+05:30 IST
సైకో థ్రిల్లర్ కథల హవా నడుస్తోంది. ప్రేక్షకుల్ని కట్టిపడేసే అంశాలు సైకో కథల్లో ఉంటాయి.

సైకో థ్రిల్లర్ కథల హవా నడుస్తోంది. ప్రేక్షకుల్ని కట్టిపడేసే అంశాలు సైకో కథల్లో ఉంటాయి. ఈ జోనర్‌లో ఇది వరకే చాలా సినిమాలొచ్చాయి. అయినా.. అదే సైకోని నమ్ముకొని కొత్త నేపథ్యాలలో కథలు అల్లుకొంటున్నారు. అందులో కొన్ని సక్సెస్ అవుతున్నా, చాలా వరకూ తేలిపోతున్నాయి. ఇప్పుడు ఈ సైకో కథల కోవలో మరో సినిమా వచ్చి చేరింది. అదే.. ‘ఓదెల రైల్వే స్టేషన్’. ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయి. ఒకప్పుడు యువతరాన్ని ఉర్రూతలూగించిన హెబ్బా పటేల్ తొలిసారి డీ గ్లామర్ పాత్ర పోషించింది. హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందించారు. అనూప్ రూబెన్స్, సౌందర రాజన్ లాంటి టాప్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పనిచేశారు. అందుకే ‘ఓదెల..’పై గురి కుదిరింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఓటీటీ
ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్ అందించింది..?
ఓదెల అనే ఓ చిన్న పల్లెటూరి చుట్టూ నడిచే కథ ఇది. అక్కడ రాధ (హెబ్బా పటేల్) దిగువ మధ్య తరగతి మహిళ. ఇస్ర్తీ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. భర్త తిరుపతి (వశిష్ట) తాగుబోతు. భార్యపై ప్రేమ ఉంటుంది కానీ చీటికీ మాటికీ అబద్ధాలు చెబుతూ, మోసాలు చేస్తూ జీవితం సాగిస్తుంటాడు. ఆ ఊర్లో.. కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు హత్యకు గురవుతుంటారు. శోభనమైన మరుసటి రోజే.. వాళ్లని దారుణంగా అత్యాచారం చేసి హతమారుస్తుంటాడు ఓ సైకో. చిన్న ఊర్లో వరుసగా ఇన్ని హత్యలు జరగడం పోలీసు శాఖని కలవరపెడుతుంది. ఆ ఊరికే కొత్తగా అనుదీప్ (సాయి రోనక్) అనే యువ ఐపీఎస్ అఽధికారి ట్రైనింగ్ నిమిత్తం వస్తాడు. తనకు ఈ వరుస హత్యల ఉదంతం సవాలు విసురుతుంది. మరి అనుదీప్ సైకోని పట్టుకొన్నాడా, లేదా? ఈ సైకోని పట్టివ్వడంలో రాధ చేసిన సహాయం ఏమిటి? అనేది మిగిలిన కథ.
సంపత్ నంది అందించిన కథలో కాస్తో కూస్తో వైవిధ్యం ఉంది. సైకో కథల్లో ఇది ఓరకంగా కొత్త పాయింటే. సినిమా ప్రారంభంలోనే రాధ ఓ తల నరికి పోలీస్ స్టేషన్‌కి వచ్చి లొంగిపోతుంది. ఆ సీన్... ప్రేక్షకుడ్ని నేరుగా కథలో కూర్చోబెట్టడానికి అవకాశం కల్పించింది. వరుస హత్యలు జరగడం.. కలవరానికి గురి చేసే అంశమే. అయితే ఆ సస్పెన్స్‌ని చివరి వరకూ కొనసాగించలేకపోయాడు దర్శకుడు. తక్కువ పాత్రల చుట్టూ కథ నడపడం వల్ల కూడా సినిమా ముందే తేలిపోయినట్టు అనిపిస్తుంది. సైకో హత్యలు చేసే సన్నివేశాలు బీ గ్రేడ్ సినిమాల్ని తలపిస్తాయి. అసలు సైకో ఎవరు? అనేది రివీల్ చేయడం బాగుంది. కానీ సైకో అలా మారడానికి ఓ బ్యాక్ స్టోరీ చెప్పారు. అది మరింత తేలిపోయింది. సైకోని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ తన భార్యని ఎరగా వేయడం అనేది మరీ సిల్లీగా అనిపిస్తుంది. హెబ్బా, వశిష్టల సన్నివేశాలు రొమాంటిక్‌గా తీయడానికి ప్రయత్నించాడు దర్శకుడు.
అవి మినహాయిస్తే.. సినిమాలో చెప్పుకోదగిన విషయాలేం ఉండవు. ఓ పల్లెటూరి చుట్టూ కథ నడపడం వల్ల, హెబ్బా డీ గ్రామర్ పాత్రలో కనిపించడం వల్ల.. ఈ సైకో కథ కాస్త కొత్త కలరింగులో కనిపిస్తుందంతే.
హెబ్బాకిది కొత్త తరహా పాత్రే. క్లైమాక్స్‌లో నటించడానికి స్కోప్ దొరికింది. వశిష్ట కూడా ఆకట్టుకొంటాడు. ఎటొచ్చీ పోలీస్ పాత్రలో సాయి రోనక్ సూటవ్వలేదనిపిస్తుంది. తన అనుభవం సరిపోలేదు. అనూప్ నేపథ్య సంగీతం కూడా తేలిపోయింది. సౌందర రాజన్‌లాంటి ప్రతిభావంతుడు కెమెరామెన్‌గా ఉన్నా, కథలో బలం లేకపోతే కొత్త సన్నివేశాలు పుట్టకపోతే, ఫ్రేములు కూడా సరిగా రావు. ‘ఓదెల..’ విషయంలో అదే జరిగింది. కాకపోతే..నిడివి పరంగా చాలా చిన్న సినిమా ఇది. పాటలు లేకపోవడం మరో ప్లస్. పార్ట్ 2 ఉందని హింట్ ఇచ్చారు చివర్లో. కనీసం అందులో అయినా ఈ సైకో థ్రిల్లర్‌ని రక్తి కట్టిస్తారేమో చూడాలి.