ఎన్టీఆర్‌కు నకిలీ పుత్తూరు వారి వైద్యం

ABN , First Publish Date - 2021-05-17T19:27:26+05:30 IST

ఎన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించిన తొలి చిత్రం ‘పల్లెటూరి పిల్ల‘ (1950). బి. ఏ. సుబ్బారావు దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ చేయికి తగిలిన గాయం ఆ సమయంలో ఆయన చేతికి జరిగిన వైధ్యంపై ఆసక్తికరమైన కథనం..

ఎన్టీఆర్‌కు నకిలీ పుత్తూరు వారి వైద్యం

ఎన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించిన తొలి చిత్రం ‘పల్లెటూరి పిల్ల‘ (1950). బి. ఏ. సుబ్బారావు దర్శకుడు. అంజలీ దేవి కథానాయిక. ఓ రోజు ఈ చిత్రం షూటింగ్ లో ఎన్టీఆర్ దున్నపోతు తో ఫైట్ చేసే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు సుబ్బారావు డూప్ పెట్టీ తిద్దామన్నారు. కానీ ఆ ఫైట్ తనే చేస్తానని ఎన్టీఆర్ చెప్పారు. దర్శకుడు వద్దన్నా వినలేదు. చిత్రీకరణ మొదలైంది. ఫస్ట్ షాట్‌లోనే దున్నపోతు ఎన్టీఆర్‌ను ఎత్తి కుదేసింది. ఆయన స్పృహ తప్పి పోయారు. కుడి చెయ్యి దెబ్బ తగిలింది. సెట్‌లో ఉన్న అందరూ కంగారు పడి డాక్టర్ కోసం కబురు పెట్టారు.


ఆ రోజుల్లో చెయ్యి విరిగితే పుత్తూరు వైద్యుడు కట్టు కట్టాల్సిందే. 

ఇంతలో ఒక వైద్యుడు వచ్చి నేను పుత్తూరు వైద్యుడిని. హీరోగారికి కట్టు కడతా.. అంటూ వచ్చి అర్జెంటుగా కట్టు కట్టి వెళ్ళిపోయాడు..రెట్టింపు డబ్బు వసూలు చేసుకొని. అయితే కట్టు కట్టినా నొప్పి తగ్గలేదు. పైగా చెయ్యి బరువెక్కింది. దాంతో ఆ వైద్యుడి కోసం వెదికితే ఎక్కడా కనిపించలేదు. మరో వైద్యుడిని పిలిపించారు. అతడు చెప్పిన విషయం వినగానే అంతా నిర్ఘాంత పోయారు. అంతకుముందు వచ్చి కట్టు కట్టిన వాడు పుత్తూరు వైద్యుడు కాదు కదా అసలు డాక్టరే కాదట. డబ్బు కోసం నకిలీ వైద్యం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అతను కట్టిన కట్టు మరో నాలుగు రోజులు అలాగే ఉంటే ఎన్టీఆర్ చెయ్యి పనికి రాకుండా పోయేది. పుత్తూరు వైద్యులకు మంచి పేరు ఉంటుందని ప్రతి ఒక్కడూ మా ఊరి పేరు వాడేస్తున్నాడు..జాగ్రత్త ..అని హెచ్చరించాడు అసలు వైద్యుడు. నకిలీ వైద్యుడు కట్టిన కట్టు విప్పి మళ్లీ కట్టాడు. నెల రోజుల తర్వాత ఎన్టీఆర్ చెయ్యి స్వాధీనం లోకి వచ్చింది. కొసమెరుపు ఏమిటంటే చెయ్యి విరిగి ఇంత బాధ పడినా ఎన్టీఆర్ డూప్ పెట్టడానికి అంగీకరించలేదు. దున్నపోతు తో తనే స్వయంగా ఫైట్ చేసి రియల్ హీరో అనిపించుకున్నారు.

Updated Date - 2021-05-17T19:27:26+05:30 IST