ఒకనాటి చెలిమికి సాక్షిగా ...
ABN , First Publish Date - 2022-08-21T16:11:49+05:30 IST
ఎన్.టి.ఆర్. వాణిశ్రీ నటించిన ‘నిండు హృదయాలు’ (15-08-1969) చిత్రంలోనిది యీ స్టిల్. విజయవాడలో నిర్మించిన రెండో థియేటర్ లక్ష్మీటాకీస్. మొదట అది డ్రామా హాలుగా ఉండేది. ఎన్.టి.ఆర్. బి.ఏ. చదివే రోజుల్లో, ఆయన నిమ్మకూరు నుంచి సైకిల్ మీద వచ్చి అ

ఎన్.టి.ఆర్. వాణిశ్రీ నటించిన ‘నిండు హృదయాలు’ (15-08-1969) చిత్రంలోనిది యీ స్టిల్. విజయవాడలో నిర్మించిన రెండో థియేటర్ లక్ష్మీటాకీస్. మొదట అది డ్రామా హాలుగా ఉండేది. ఎన్.టి.ఆర్. బి.ఏ. చదివే రోజుల్లో, ఆయన నిమ్మకూరు నుంచి సైకిల్ మీద వచ్చి అక్కడ జరిగే నాటకాల్లో నటించేవారు. అప్పట్నుంచి ఆ థియేటర్ యజమానులలో ఒకరైన మిద్దె జగన్నాథరావుతో ఏర్పడ్డ స్నేహం, మద్రాసు వరకూ సాగింది. ఆయన యస్.వి.యస్. ఫిలిమ్స్ స్థాపించి నిర్మించిన చిత్రాలలో ఇదొకటి. ఈ చిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్. ఈయన తొలిచిత్రం ‘ఆత్మగౌరవం’లో హీరో అక్కినేని.
‘ఆత్మగౌరవం’ తర్వాత విశ్వనాథ్ దర్వకత్వం వహించిన నాలుగు సినిమాల్లోనూ ఎన్.టి.రామారావే హీరో కావడం విశేషం. ‘నిండు హృదయాలు’ హీరోయిన్‌గా వాణిశ్రీ బుక్ అయిన మొదటి సినిమా. అప్పట్లో హీరోయిన్‌గా తారాపథంలో ఉన్న కృష్ణకుమారి హఠాత్తుగా సినిమాలు మానుకోవడంతో, ఆ అదృష్టం వాణిశ్రీని వరించింది. అప్పటి దాకా కామెడీ పాత్రలు వేస్తున్న వాణిశ్రీని హీరోయిన్‌గా తీసుకున్నారు. వాణిశ్రీ కూడా ఈ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుంది. దుక్కిపాటి తమ ‘ఆత్మీయులు’లో హీరో చెల్లెలి పాత్ర వేయమంటే ‘‘లేదండీ! అవతల ఎన్.టి.ఆర్ గారికి నాయికగా వేస్తున్నాను. యిక చెల్లి పాత్రలు వేయను’’ అని కరాఖండిగా చెప్పింది. ‘నిండు హృయాలు’లో వాణిశ్రీ, ఎన్.టి.ఆర్.ల కాంబినేషన్‌కు ప్రేక్షకులు ఆమోదముద్ర వేశారు.