ఫైట్‌ మాస్టర్స్‌లా కాదు... ఫ్యాన్స్‌లా పనిచేశాం

ABN , First Publish Date - 2021-12-06T06:45:44+05:30 IST

‘అఖండ’ చూశాక అందరూ పోరాట సన్నివేశాల గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. బాలకృష్ణపై తెరకెక్కించిన యాక్షన్‌ ఘట్టాలు మాస్‌ని విపరీతంగా ఆకట్టుకున్నాయి...

ఫైట్‌ మాస్టర్స్‌లా కాదు... ఫ్యాన్స్‌లా పనిచేశాం

‘అఖండ’ చూశాక అందరూ పోరాట సన్నివేశాల గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. బాలకృష్ణపై తెరకెక్కించిన యాక్షన్‌ ఘట్టాలు మాస్‌ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి ఫైట్‌ మాస్టర్‌ గా పనిచేశారు స్టన్‌ శివ. ఆయన కుమారులు కెవిన్‌, స్టీవెన్‌లు కూడా ఫైట్లు కంపోజ్‌ చేశారు. ఈ సందర్భంగా స్టన్‌ శివ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో పోరాట సన్నివేశాలకు ఇంత మంచి స్పందన వస్తోందంటే దానికి కారణం... దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయనలో ఓ దర్శకుడే కాదు. ఫైటర్‌ కూడా ఉన్నాడు. మాకు ఏం కావాలో అది అందించారు. ఆయన కథ చెప్పేటప్పుడే.. ఎక్కడెక్కడ పోరాట సన్నివేశాలు అవసరమో.. వివరంగా చెప్పారు. ఆ ఫైట్స్‌ ఎలా కావాలో కూడా వివరించారు. దాంతో మా పని సులభం అయ్యింది. ఇంట్రవెల్‌ ఫైట్‌ దగ్గర్నుంచి క్లైమాక్స్‌ ఫైట్‌ వరకూ మేమే డిజైన్‌ చేశాం. ఫైట్స్‌ కోసమే 60 రోజులు పట్టింది. మరో 20 రోజులు ఎలివేషన్లు, యాక్షన్‌ పార్ట్‌కి కేటాయించాం. ఏ ఫైట్‌ ఎలా ఉండాలో ఓ డెమో షూట్‌ చేసి, దర్శకుడికి చూపించాం. ఆ తరవాతే సెట్స్‌పైకి వెళ్లాం. మా దృష్టిలో బాలకృష్ణ ఓ సూపర్‌ హీరో. ఆయన ఏం చేసినా జనం చూస్తారు. అందుకే ఆయనపై అలాంటి ఫైట్లు కంపోజ్‌ చేశాం.  మేం ఆయనకు అభిమానులం కూడా. అందుకే.. ఈ సినిమాకి ఫైట్‌ మాస్టర్లుగా కాకుండా, ఫ్యాన్స్‌లా పనిచేశాం. తమన్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా చాలా హెల్ప్‌ అయ్యింది. ఎక్కడకు వెళ్లినా ఈ సినిమా గురించి, అందులో ఫైట్స్‌ గురించీ మాట్లాడుకుం టున్నారు. అదెంతో సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’, ‘ధమాకా’ చిత్రాలకు పనిచేస్తున్నాం. ‘ఎఫ్‌ 3’లో కామెడీ విలన్‌ పాత్రని పోషించా’’ అన్నారు. 


Updated Date - 2021-12-06T06:45:44+05:30 IST