వారి కన్నా గొప్పవాడిని కాదు...

Twitter IconWatsapp IconFacebook Icon
వారి కన్నా గొప్పవాడిని కాదు...

సినిమా తీయాలంటే ‘దిల్‌’ ఉంటే సరిపోదు. ధైర్యం కూడా కావాలి. ఎందుకంటే... ఇది కోట్లతో పందెం. రాత్రికి రాత్రే జాతకాల్ని మార్చేసే... ఆట. అందుకే బరిలో దిగేవాళ్లకు ఆ ఆట నిబంధనలూ తెలియాలి. వాటిని బ్రేక్‌ చేసే నైపుణ్యమూ కావాలి. ఇవన్నీ అక్షరాలా అందిపుచ్చుకొన్న నిర్మాత... దిల్‌ రాజు. 

డబ్బుతో పాటు తన తెలివితేటల్ని, వ్యాపార దక్షితని పెట్టుబడిగా పెట్టి - నిర్మాత అనే పదానికి సరికొత్త నిర్వచనంలా మారారు. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండే దిల్‌ రాజుని ‘నవ్య’ పలకరించినప్పుడు... పొంగిపొర్లిన కబుర్లివి.‘ఎఫ్‌ 3’ విడుదలకు సిద్ధమైంది.. ఆ సినిమా కబుర్లేంటి?

‘ఎఫ్‌ 2’ పూర్తయ్యే సమయంలో అనిల్‌ రావిపూడి ‘ఎఫ్‌ 3’ లైన్‌ చెప్పారు. నాకు బాగా నచ్చింది. ‘ఎఫ్‌ 2’ పెద్ద హిట్‌ అవ్వడంతో ‘ఎఫ్‌3’ను పట్టాలెక్కించాం. సినిమా ఫన్‌ రైడ్‌లా ఉంటుంది. పాత్రల ద్వారా డైరెక్టర్‌ చెప్పాలనుకున్న పాయింట్‌ అనుకున్న విధంగా వచ్చింది. సీట్లలో ప్రేక్షకులు ఎగిరెగిరి పడి నవ్వుతారు. అంత ఫన్‌ ఉంటుంది ఈ సినిమాలో.


కథలు ఎంచుకోవడంలో మీరే విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు?

జానర్‌ గురించి నేను పట్టించుకోను. ప్రేక్షకులకు ఏమి చెబుతున్నాం?ఎలా చెబుతున్నాం? అనేవే ముఖ్యం. ‘వకీల్‌సాబ్‌’, ‘ఎఫ్‌ 3’, శంకర్‌-రామ్‌చరణ్‌ చిత్రం... ఇలా ఒక్కో కథ ఒక్కోలా చెప్పాలి. ఒకదానికీ మరోదానికీ సంబంధం ఉండదు. ఏ సినిమా అయినా మూడు గంటలు మనం ప్రేక్షకులను ఎంగేజ్‌ చేస్తున్నామా? లేదా? అనేదే చూడాలి.  


మీ జడ్జిమెంట్‌పై అందరికీ గురి ఎక్కువ. అదెలా కుదిరింది?

సినిమా రిలీజ్‌కు ముందే చూస్తాను కాబట్టి నాకంటూ ఒక జడ్జిమెంట్‌ ఉంటుంది. సినిమా రిలీజయ్యాక థియేటర్‌లో వెనుక డోర్‌ దగ్గర నిలబడి ప్రేక్షకులను గమనిస్తుంటాను. ప్రేక్షకుల నుంచి నేను అనుకున్న రియాక్షన్స్‌ వస్తున్నాయా లేదా అని చూస్తా. మనం అనుకున్నది వర్క్‌ అయింది, కానిది, ఎక్కడ మిస్‌ ఫైర్‌ అయింది అనేది అప్పుడు మనకు నేరుగా తెలిసిపోతుంది. సినిమా ఏ మాత్రం బోర్‌కొట్టినా ప్రేక్షకుల చేతులు గాల్లోకి లేస్తాయి. అస్సలు రియాక్షన్‌ లేకపోతే సినిమాతో ప్రేక్షకులు కనెక్ట్‌ కాలేదని తెలిసిపోతుంది. మల్టీప్లెక్స్‌, సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లలో విడివిడిగా ప్రేక్షకుల రెస్పాన్స్‌ ఎలా ఉందో పరిశీలిస్తాను. దాంట్లోంచి నేర్చుకుంటాను. 


మీలోని ప్రేక్షకుడు, నిర్మాతను డామినేట్‌ చేయడా?

అలా ఉండదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చూసినప్పుడు యాక్షన్‌ ఎపిసోడ్లని బాగా ఎంజాయ్‌ చేశాను.  ‘అల వైకుంఠపురం’ రిలీజ్‌కు ముందు త్రివిక్రమ్‌ ‘బుట్టబొమ్మ’ సాంగ్‌ నాకు చూపించారు. ‘వాహ్‌’ అనిపించి అక్కడే క్లాప్స్‌ కొట్టాను. సినిమా బ్లాక్‌బస్టర్‌ కాబోతోందని అప్పుడే నాకు అర్థమైంది. 


సినిమా అనేది సమష్టి కృషి. దానిపై మీకు అంత పట్టు ఎలా చిక్కింది?

అది సాధించాను కాబట్టే పరిశ్రమలో నిలదొక్కుకున్నాను. ‘దిల్‌’, ‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’ సినిమాలప్పుడు ఎలా పని చేశానో ఇప్పుడు కూడా అలానే చేయాలనుకుంటాను. కథ విన్నప్పుడు నాకు ఎగ్జైట్‌మెంట్‌  కలగాలి. నేను చేసిన హిట్‌ చిత్రాలన్నీ పాయింట్‌ నచ్చే నిర్మించాను. నేను ఇప్పటిదాకా రెండున్నర గంటలు కథ విని ఓకే చేసిన చిత్రం ఒక్కటీ లేదు. కథ విన్నప్పుడు అందులో లోపాలు చెప్పి వాటిని సరిదిద్దమంటాను. ఈ పాయింట్‌ బాగుంది దీన్ని డెవలప్‌ చేయి అని చెబుతా. అలా సినిమాతో నా ప్రయాణం మొదలవుతుంది. కథ ఆకృతి దాల్చుతుంది.


దర్శకుడు కథ చెబుతున్నప్పుడు ఏం గమనిస్తారు?

  వాళ్ల దృక్కోణంలోంచి కథను చూస్తాను. కథ చెబుతున్నప్పుడు ప్రేక్షకుడిలా వింటాను. ఏదైనా లోపం అనిపిస్తే చెబుతాను. 


మీ బలం ఏమిటి?

నా కుటుంబం. ఒక మంచి సినిమా నాకు ఎనర్జీ ఇస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఏదో ఒక కథ గురించి ఆలోచిస్తూ ఉంటా. దాదాపు రెండు మూడు గంటలు కథతో ట్రావెల్‌ అవుతా! మంచి స్టోరీలు నాకు అదనపు శక్తిని ఇస్తాయి.  


ఒక సినిమా బాగా ఆడలేదు అనుకోండి.. అప్పుడు మళ్లీ ట్రాక్‌ మీదకు ఎలా వస్తారు?

ఏ సినిమాపైనా నేను అంచనాలు పెట్టుకోను. విడుదలయిన తర్వాత ఒక సినిమా ఎలాంటి రికార్డ్‌ క్రియేట్‌ చేస్తుందనే విషయం మన  చేతుల్లో ఉండదు.  2017లో ఏడు హిట్‌ సినిమాలు తీశాను. దేనిపైనా నాకు అంచనాలు లేవు. అందరికీ అన్ని సినిమాలు నచ్చవు. ఉదాహరణకు ‘ఎఫ్‌3’ని మొదటి రోజు లక్ష మంది చూశారనుకుందాం. వాళ్లలో 20 వేల మంది ‘ఎఫ్‌ 2’ దృష్టిలో పెట్టుకొని వస్తారనుకుందాం. వారు- ఎఫ్‌2 అంత బాగోలేదు.. పర్వాలేదు అనుకోవచ్చు. ఆ తర్వాత సినిమా చూసేవారు ‘ఎఫ్‌2’ను దృష్టిలో పెట్టుకొని చూడరు. ఇలా ఒక సినిమా చూడటానికి రకరకాల కారణాలు ఉంటాయి.  


టికెట్‌ ధరలు పెరగడం ప్రభావం చూపలేదంటారా?

ఇంతకు ముందు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి స్పెషల్‌ మూవీస్‌ రావడం వల్ల  టికెట్‌ ధరలు పెరగాల్సి వచ్చింది. దాన్ని అందరు హీరోలు తర్వాత కంటిన్యూ చేశారు. ఇప్పుడు మేమే ‘ఎఫ్‌ 3’ తో దాన్ని బ్రేక్‌ చేస్తున్నాం. ఇక నుంచి మా సినిమాలకు టికెట్‌ ధరలు సాధారణంగానే ఉంటాయి. 


భవిష్యత్తులో సినిమాలలో ఎలాంటి మార్పులు వస్తాయి?

నా ఉద్దేశంలో మూడు లేయర్స్‌ ఉంటాయి. వరల్డ్‌ వైడ్‌ ఫిల్మ్‌, పాన్‌ ఇండియా ఫిల్మ్‌, రీజినల్‌ ఫిల్మ్‌. వచ్చే రెండేళ్లలో మనం ఈ మార్పులు చూడబోతున్నాం. 


వసూళ్ల పరంగా టాలీవుడ్‌ స్టామినా ఎంత ?

బ్లాక్‌బస్టర్‌ అయితే రూ. 300 కోట్లు వరకూ ఉంటుంది. పాన్‌ ఇండియా అయితే రూ. 500 కోట్లు వరకూ ఉంటుంది. అన్ని సినిమాలు పాన్‌ ఇండియా కాలేవు. చిన్న సినిమాలు సఫర్‌ అవుతాయి. చిన్న సినిమాలో కొత్తగా ఏదో ఉండాలి. లేదంటే నాలుగు షోలతో ఎత్తేయడమే. వీటిని రూఢీ చేసుకోవడానికి పూర్తిగా కొత్త వాళ్లతో నేను రెండు సినిమాలు చేస్తున్నా. 

వారి కన్నా గొప్పవాడిని కాదు...

చిన్న నిర్మాతలకు రిలీజ్‌కు వంద థియేటర్లు దొరికే పరిస్థితి ఉందా?

తప్పకుండా దొరుకుతాయి. అయితే పెద్ద సినిమాలు రిలీజయినప్పుడు మాత్రం అన్ని థియేటర్లు బ్లాక్‌ అయిపోతాయి. కొన్నిసార్లు ‘మాకు ఫలానా థియేటర్లే కావాల’ని ఒకేసారి ఇద్దరు ముగ్గురు నిర్మాతలు పట్టుబడతారు. అలాంటప్పుడు వారు కోరుకున్న థియేటర్‌ దొరక్కపోతే ‘మాకు అసలు థియేటర్లే దొరకడం లేద’ని ఆరోపిస్తారు. అసలు సమస్య థియేటర్లు దొరక్కపోవడం కాదు. వారు అనుకున్న థియేటర్లు దొరక్కపోవడం. కావాలంటే మల్టీప్లెక్స్‌లో రెండు షోలు వేసుకోవచ్చు. ఒక సినిమాతో డబ్బులు వస్తున్నప్పుడు థియేటర్‌ యజమాని ఆ సినిమాను తొలగించాలనుకోడు. కొత్త సినిమా వేసుకోవాలనుకోడు. 


ఓటీటీలో పే ఫర్‌ వ్యూ విధానం మనదగ్గరా వచ్చింది. దీని ప్రభావం ఎలా ఉంటుంది?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీఎఫ్‌ 2’ లాంటి చిత్రాలను భారీ మొత్తాలకు ఓటీటీ సంస్థలు కొన్నాయి. ఆ డబ్బు రాబట్టుకోవడానికి ఇప్పుడు ఒక ప్రయోగం చేస్తున్నారు. అది ఫలిస్తుందా లేదా అనేది వేచిచూడాలి. ప్రేక్షకులు డబ్బు చెల్లించి ఓటీటీలో చూస్తే కనుక మున్ముందు ఆ మోడల్‌ ఎక్కువగా వ్యాప్తిలోకి వస్తుంది.  


  డిస్ట్రిబ్యూటర్‌ ్స, ప్రదర్శన రంగంలో ఇంకా ఎలాంటి మార్పులు రావాలంటారు? 

ఇండస్ట్రీలో ప్రతి చోటా సమస్యలున్నాయి. హాలీవుడ్‌లో ఉన్నట్లు మనదగ్గర ఎగ్జిబిషన్‌, డ్రిస్టిబ్యూషన్‌ రంగంలో పారదర్శకత రావాలి. అది వస్తే హీరో, నిర్మాత కూడా సినిమా నిర్మాణంలో భాగస్వామి అవుతాడు. పారదర్శకత లేకపోవడంతో హీరోలు సినిమాలో భాగస్వాములవడానికి భయపడుతున్నారు. ఇప్పటికే తెలుగు  పరిశ్రమలో నగదు విధానం పూర్తిగా పోయింది. హాలీవుడ్‌ స్టైల్‌ ఇక్కడా తీసుకురావాలి. 


మిమ్మల్ని మీరు ఎలా నిర్వచించుకుంటారు?

నేను చాలా ఎమోషనల్‌గా, కాలిక్యులేటెడ్‌గా నిర్ణయాలు తీసుకుంటాను. నా సినిమా వల్ల ఒకరు నష్టపోవడం నాకు ఇష్టం ఉండదు. డిస్టిబ్యూటర్‌ దగ్గర డబ్బులు తీసుకొని, నిర్మాతగా లాభపడాలనుకోను.  నష్టపోయిన డిస్టిబ్యూటర్‌ నా తర్వాతి సినిమాతో లాభపడేలా చూస్తాను. వాళ్లు సంతృప్తిగా ఉండడం నాకు ముఖ్యం.  సినిమా అనేది చాలా డేంజర్‌ ఏరియా. అందుకే నేను ప్రతి సినిమాను ఒక లెక్క ప్రకారం చేస్తాను. ఒక్క సినిమా ఆడకపోయినా చాలా నష్టపోతారు. ప్రొడ్యూసర్‌, డిస్టిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ కుదేలవుతారు. సినిమా ఆడినా, పోయినా దర్శకుడు, హీరో, టెక్నీషియన్లకి ఏమీ కాదు. వాళ్ల డబ్బు తీసుకొని వె ళ్లిపోతారు. 


సినిమా ఫలితం విషయంలో మీ అంచనాలు తప్పిన సందర్భాలు ఉన్నాయా?

‘శ్రీనివాస కల్యాణం’ పెద్ద హిట్‌ అవుతుందనుకున్నాను. సోమవారంతో ఇక సినిమా ఆడదు అని అర్థమైంది.  


సినిమా అనే మాయా ప్రపంచంలో మిమ్మల్ని మీరు ఎలా గైడ్‌ చేసుకుంటారు?

డబ్బు, సక్సెస్‌... ఈ రెండింటికే చిత్ర పరిశ్రమలో విలువ ఉంటుంది. కొంతమంది నిర్మాతలు కమిట్‌మెంట్‌ కోసం భారీ పారితోషికం ఇస్తారు. ఆ తర్వాత మేం కూడా అంత మొత్తం ఇచ్చుకోవాల్సిందే. ఇక్కడ రిలేషన్‌ కన్నా డబ్బు ఎక్కువ పనిచేస్తుంది. అక్కడక్కడా సక్సెస్‌ పనిచేస్తుంది. అయితే మనీ కన్నా మనుషులకు ఎక్కువ విలువ ఇచ్చేవాళ్లు కూడా పరిశ్రమలో ఉన్నారు. 


మీకు అండగా నిలిచినవారి గురించి 

నాకు కష్టం వచ్చినప్పుడు నా స్నేహితులు, కుటుంబం కాకుండా అండగా ఉండేవారు ఎవరా అని చూస్తాను. పెద్ద నిర్మాత అనే హోదా తాత్కాలికమే అని నాకు తెలుసు. దాన్ని పక్కనపెట్టి కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకునే స్నేహితులు నాకు కొద్దిమంది ఉన్నారు. రామానాయుడు, చక్రపాణి,నాగిరెడ్డి కంటే గొప్పవాణ్ణి కాదు నేను. సక్సె్‌సలో ఉన్నాం కాబట్టి మన బ్రాండ్‌ నడుస్తోంది. మనది కాని రోజు ఒకటి వస్తుందనేది కూడా నాకు ముందే తెలుసు. మంచి సినిమా వల్లే నాకు పేరు, ప్రఖ్యాతులు వచ్చాయి. 


మీ ఎదుగుదలలో కుటుంబం పాత్ర ఎంత?

ఒక సినిమా బాగా ఆడుతుందా లేదా అనే విషయం వరకే నా ఇన్‌వాల్వ్‌ మెంట్‌ ఉంటుంది. ఆ తర్వాత అన్నయ్య శిరీష్‌ డ్రిస్టిబ్యూషన్‌ చూసుకుంటారు. ఇప్పుడు మా వారసులు కూడా ఎంటరయ్యారు. మా అమ్మాయి నిర్ణయం తీసుకునే విధానం, ప్లానింగ్‌ చూస్తున్నప్పుడు నన్ను నేను చూసుకుంటున్నట్లు ఉంటుంది. 


యువతరంతో నిర్మాతగా మీరు పోటీ పడుతూ ఉంటారా?

ఇప్పటికీ నేను యువకుణ్ణే (నవ్వుతూ). నేను అందరితో కలుపుగోలుగా ఉంటాను. ఇప్పుడు కొంచెం బిజీ అయ్యాను కానీ ఎవరు కథ చెప్పినా వినేవాణ్ణి. 


మీ లక్ష్యం?

నాలో శక్తి ఉన్నంతవరకూ మంచి సినిమాలు తీస్తుండాలి.

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌, 

ఫొటోలు: లవకుమార్‌


కరోనా వల్ల ఓటీటీ పుంజుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి కంటెంట్‌ ప్రేక్షకులకు చేరువ అయ్యింది. అయినా చాలామందికి ఇంకా ఓటీటీ చేరలేదు.  ఓటీటీల వల్ల ప్రేక్షకులు సినిమాకు రారు అనుకోవటం సరికాదు. కలెక్షన్లు కూడా ఈ విషయాన్ని నిర్థారిస్తున్నాయి. ‘అఖండ’.. ‘పుష్ప’-  సూపర్‌ హిట్‌ అయ్యాయిగా! ఏది ఏమైనా థియేటర్‌ ఎంజాయ్‌మెంట్‌ ఓటీటీలో రాదు. వసూళ్లు కూడా అదే చెబుతున్నాయి.  చిన్న సినిమాలకు మాత్రం ఓటీటీ డేంజరే. ఒక నెల ఆగి ఓటీటీలో చూద్దాంలే అనుకుంటారు.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

మీకు తెలుసా !..Latest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.