బిడ్డకు తల్లి పాలు ఇచ్చే విషయంలో ప్రశ్నలేల?

ABN , First Publish Date - 2021-07-12T06:11:14+05:30 IST

‘‘నా కుమార్తెకు నేను స్వయంగా పాలు ఇస్తున్నానా? లేదా? అనేది ఇతరులకు చర్చనీయాంశం కాకూడదు’’ అని సామాజిక మాధ్యమాల ద్వారా మార్పుకు ప్రయత్నించే ‘పోస్ట్‌ ఫర్‌ ఛేంజ్‌’ సంస్థ సహ వ్యవస్థాపకురాలు...

బిడ్డకు తల్లి పాలు ఇచ్చే విషయంలో ప్రశ్నలేల?

‘‘నా కుమార్తెకు నేను స్వయంగా పాలు ఇస్తున్నానా? లేదా? అనేది ఇతరులకు చర్చనీయాంశం కాకూడదు’’ అని సామాజిక మాధ్యమాల ద్వారా మార్పుకు ప్రయత్నించే ‘పోస్ట్‌ ఫర్‌ ఛేంజ్‌’ సంస్థ సహ వ్యవస్థాపకురాలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌ దీపా ఖోస్లా వ్యాఖ్యానించారు. కాన్స్‌ చలన చిత్రోత్సవాల్లో స్తన్యశోషక యంత్రం (బ్రెస్ట్‌ పంప్‌)తో ఆమె ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఏప్రిల్‌లో దీపా ఖోస్లా ఓ బిడ్డకు జన్మ ఇచ్చారు. అప్పట్నుంచీ సామాజిక మాధ్యమాల్లో ఎదురవుతున్న విమర్శలకు సమాధానం ఇవ్వడానికి ఈ విధంగా చేశానని ఆమె పేర్కొన్నారు. ‘‘నా దృష్టిలో తల్లిగా ఉండటం అంటే... జన్మనివ్వడం మాత్రమే కాదు. మనం చూడకముందు నుంచీ ఓ బిడ్డను ప్రేమించడం. తల్లి కావడం అంటే ప్రతి ఒక్కరికీ టార్గెట్‌ కావడం కాదు. ‘నువ్వు తప్పు చేస్తున్నావ్‌?’, ‘చంటిపాప విషయంలో ఇలా ఎలా చేస్తున్నావ్‌?’ - ఈ ప్రశ్నలు ఎన్నిసార్లు వింటుంటాం! తల్లి ఇలాగే ఉండాలనే నిబంధన ఏదీ లేదు. కొత్తగా తల్లైన వాళ్లకు తాము చేస్తున్న పని సరైనదా? కాదా? అనే ఆందోళన ఉంటుంది. మాతృత్వపు బాధ్యతలు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా పాలు ఇచ్చే విషయంలో లెక్కలేనన్నివి చెబుతుంటారు. ప్రతి తల్లికి అన్నీ చేయడం కుదరదు. అలాగని, జడ్జ్‌ చేయడం కరెక్ట్‌ కాదు. నేనొకటి చెబుతా... బిజినెస్‌ ట్రిప్‌ మీద రెండు రోజులు ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. బిడ్డతో ఉండటం కుదరదు కనుక... బయలు దేరేముందే బ్రెస్ట్‌ పంపింగ్‌ చేశా’’ అని దీపా ఖోస్లా తెలిపారు.


Updated Date - 2021-07-12T06:11:14+05:30 IST