మల్లియలారా... మాలికలారా

ABN , First Publish Date - 2022-07-03T17:59:09+05:30 IST

గౌతమి పిక్చర్స్‌ నిర్మించిన ‘నిర్దోషి’ (02-03-1967) చిత్రం స్టిల్‌ ఇది. అట్లూరి పుండరీకాక్షయ్యతో కలసి ‘మహామంత్రి తిమ్మరుసు

మల్లియలారా... మాలికలారా

గౌతమి పిక్చర్స్‌ నిర్మించిన ‘నిర్దోషి’ (02-03-1967) చిత్రం స్టిల్‌ ఇది. అట్లూరి పుండరీకాక్షయ్యతో కలసి ‘మహామంత్రి తిమ్మరుసు’ లాంటి గొప్ప చారిత్రక చిత్రాన్ని నిర్మించిన యన్‌.రామబ్రహ్మం .. ఆయన విడిపోయాక నిర్మించిన స్వతంత్ర చిత్రాలలో చెప్పుకోదగ్గది ‘నిర్దోషి’. దాదామిరాసి కథ సమకూర్చి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆనాటికి మంచి క్రైమ్‌ చిత్రంగా పేరు తెచ్చుకుంది. 

పటుత్వమైన కథ ఈ చిత్రానికి జీవమైతే, ఎన్‌.టి.ఆర్‌. చేసిన ద్విపాత్రాభినయం మరింత వన్నె తెచ్చింది. సుందర్రావు, ఆనందరావు అనే అన్నదమ్ములుగా నటించారు. అందులో ఒకరు మంచివాడుగా, మరొకరు చెడ్డవాడుగా ఒకే సినిమాలో వేర్వేరు షేడ్స్‌ చూపించడం రామారావు నటనా ప్రతిభకు గీటురాయి. వ్యసన పరుడు, వ్యాధిగ్రస్తుడు, నిర్దయుడైన ఒక తరహానటన ఒక వైపు; సౌమ్యత, నిగ్రహం, వేదన, పరిస్థితులకు తగిన బింకం, సంయమనం మరొక వైపు. నవరసాలను అద్భుతంగా ప్రదర్శించి, నటనలో పరిపూర్ణత చూపారు ఎన్‌.టి.ఆర్‌.

మల్లెలతో కూడిన పాన్పు, ఆకాశంలో జాబిలి, పక్క గది వరండాలో సావిత్రిని చూపిస్తూ సాగే ‘మల్లియలారా, మాలికలారా’ (సినారె - ఘంటసాల) పాట నాటి నుండీ నేటి వరకూ ప్రేక్షక శ్రోతల ఆదరణ పొందుతూనే ఉంది. ఆ మధ్య కాలంలో అజిత్‌, సిమ్రాన్‌ నటించిన తెలుగు, తమిళ భాషలలో విజయవంతమైన ‘వాలి’ చిత్రానికి మూలాలు యీ చిత్రంలోనివే!

- డా. కంపల్లె రవిచంద్రన్‌, 98487 20478.

Updated Date - 2022-07-03T17:59:09+05:30 IST