సీనియర్‌ హీరోలకు కొత్త సవాళ్లు

ABN , First Publish Date - 2022-08-21T06:04:11+05:30 IST

చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌... వీళ్లందరిదీ ఓ తరం. చిత్రసీమను తమ భుజాలపై వేసుకొని నడిపించారు. ఒకొక్కరూ ఒక్కో సీజన్‌లో చెలరేగిపోయారు. హిట్లు అందించారు. తాము ఎదిగారు.. చిత్రసీమ ఎదుగుదలకు ఓ చేయి వేశారు.

సీనియర్‌ హీరోలకు కొత్త సవాళ్లు

ఆరు పాటలు... నాలుగు ఫైట్లూ.. మధ్యలో హీరోయిన్‌తో రొమాన్సూ.. కామెడీ ట్రాకులూ.. అంటూ కాలం గడిపేస్తే చూసే రోజులు కావివి. జనరేషన్‌ మారిపోయింది. అభిరుచులూ మారిపోయాయి. ఎంత పెద్ద స్టార్‌ అయినా సరే, కొత్తగా ఆలోచించకపోతే ప్రేక్షకులు తిరస్కరిస్తారన్న విషయం ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. బాణీ మార్చాల్సిన తరుణం ఆసన్నమైంది. ముఖ్యంగా సీనియర్‌ హీరోలు తమ ఆలోచనా ధోరణి, కథల ఎంపిక విషయాల్లో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.


చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌... వీళ్లందరిదీ ఓ తరం. చిత్రసీమను తమ భుజాలపై వేసుకొని నడిపించారు. ఒకొక్కరూ ఒక్కో సీజన్‌లో చెలరేగిపోయారు. హిట్లు అందించారు. తాము ఎదిగారు.. చిత్రసీమ ఎదుగుదలకు ఓ చేయి వేశారు. అయితే ఇప్పుడు వీళ్ల వయసు అరవై దాటేసింది. చిరంజీవి (66), నాగార్జున (62), వెంకటేశ్‌ (61)... వీళ్లంతా వెటరన్‌ హీరోలు అయిపోయారు. రవితేజ (54),  పవన్‌ కల్యాణ్‌ (50) మహేశ్‌ బాబు (47) వీళ్లని అనుసరిస్తున్నారు. వయసుకి తగినట్టు కథల్ని ఎంచుకోవాలా?  ఇమేజ్‌ని చూసుకోవాలా? స్టార్‌ డమ్‌ని అనుసరించాలా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఈ పెద్ద హీరోల్ని వేదిస్తున్నాయి. అప్పట్లో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు అరవైలు దాటేసినా కాలేజీ కుర్రాళ్లు, పెళ్లి కాని అబ్బాయిల పాత్రల్లో కనిపించారు. అయితే... అభిమానులు పెద్దగా వంకలు పెట్టలేదు. తమ హీరోలు ఏం చేసినా చూశారు. కానీ ఇప్పుడు అలా కాదు. అరవై ఏళ్ల హీరో.. పెళ్లి చూపుల్లో కూర్చుంటే.. ప్రేక్షకులు నవ్వుకుంటున్నారు. హీరోల వయసు దాచేస్తే దాగేది కాదు. ‘ఈ వయసులో ఇంలాంటి పాత్రలెందుకు?’ అని బాహాటంగానే పెదవి విరుస్తున్నారు.


 అందుకే కథలు, తమ పాత్రల విషయంలో ఈ సీనియర్లకు కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. కొవిడ్‌ సమయంలో ఓటీటీ అందుబాటులోకి వచ్చి, ప్రపంచ సినిమాని కళ్ల ముందుకు తీసుకొచ్చింది. భాషతో సంబంధం లేకుండా సినిమాల్ని చూశారు. ప్రపంచ సినిమాని అవగాహన చేసుకొన్నారు. ఇప్పుడు ఆ కళ్లకు కంటెంట్‌ తప్ప హీరోల సిగ్నేచర్‌ స్టెప్పులు కనిపించడం లేదు. పంచ్‌ డైలాగులు వినిపించడం లేదు. ‘కొత్తగా ఆలోచించకపోతే... సినిమాని తిరస్కరిస్తాం..’ అని బాహాటంగానే హెచ్చరిస్తున్నారు. కొత్త కుర్రాళ్లు, యువ హీరోలు... కథల విషయంలో కాస్త కాస్త మారుతున్నారు. కాన్సెప్ట్‌ కథల్ని ఎంచుకొంటున్నారు. ఇక మారాల్సింది సీనియర్లే. కాకపోతే.. మార్పుని ఆహ్వానించడం అనుకున్నంత తేలిక కాదు. ఎన్నో ఏళ్లుగా ఓ ట్రాక్‌లో నడక సాగిస్తున్నవాళ్లు దారి మార్చుకోవడం కష్టమే. కాకపోతే ఇంకొన్నాళ్లు కెరీర్‌ నిలబడాలంటే మాత్రం రూటు మార్చడం మినహా మరో దారి లేదు. 


బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కీ ఇదే సమస్య వచ్చింది అప్పట్లో. కొత్తతరం దూకుడు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ వయసులోనూ ‘యాంగ్రీ యంగ్‌ మెన్‌’ అనుకొంటే ఎలా? ముందు ఆ ఛట్రం నుంచి బయటకు రావాలి అనుకొన్నారు. అలానే వచ్చారు. ‘చేస్తే హీరోగానే చేయాలి.. లేదంటే లేదు’ అనే మాట పక్కన పెట్టి, కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ కథల్ని ఎంచుకొన్నారు. వయసుకి తగిన పాత్రలు చేశారు. దాంతో ‘సర్కార్‌’లాంటి పవర్‌ఫుల్‌ రోల్స్‌ ఆయన్ని వెదుక్కొంటూ వెళ్లాయి. మోహన్‌లాల్‌, మముట్టిలు కూడా అంతే. హీరోగా టైమ్‌ అయిపోయిందనుకొన్నప్పుడు క్యారెక్టర్‌ పాత్రలవైపు మొగ్గు చూపించారు. అక్కడా అద్భుతమైన విజయాలు సాధించారు. ‘మన్యం పులి’, ‘యాత్ర’ చిత్రాల్లో... ఆయా హీరోల ఇమేజ్‌లు కనిపించవు. కేవలం పాత్రలే కళ్లముందు కదలాడతాయి. క్యారెక్టర్‌ పాత్రల వల్ల... వీళ్లందరి స్థాయి పెరిగింది. అలాగని పారితోషికాలేం తగ్గలేదు. తమ స్టార్‌డమ్‌కి తగినట్టే అందుకొంటున్నారు. హీరోగా యేడాదికి రెండు మూడు సినిమాలు చేసేవారంతా... క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారడం వల్ల ఏడెనిమిది కథల్లో కనిపిస్తున్నారు. ఓ రకంగా ఈ మార్పు వల్ల మంచే జరిగింది.





మన సీనియర్లకూ ఇంకో రెండు మూడేళ్లు హీరోగా కొనసాగే స్టామినా ఉంది. ఆ తరవాత అమితాబ్‌, మోహన్‌లాల్‌లా... శక్తిమంతమైన పాత్రల వైపు దృష్టి మళ్లిస్తే బాగుంటుందన్నది సినీ అభిమానుల, విశ్లేషకుల అభిప్రాయం. దాని వల్ల కొత్త కథలు కూడా పుడతాయి. కొత్త కాంబినేషన్లు చూసే అవకాశం లభిస్తుంది. అయితే ఈ రెండు మూడేళ్లు హీరోగా చేసే సినిమాల్లో మూస ఫార్ములాలకు దూరంగా ఉండాలి. కొత్త కథలకు, సరికొత్త కాన్సెప్టులకు పచ్చ జెండా ఊపాలి. అప్పుడే హీరోలుగా అభిమానుల్ని అలరించగలుగుతారు. 


మన హీరోలకే కాదు.. రజనీకాంత్‌ (71), కమల్‌హాసన్‌ (67)లకూ వయసు పెరిగిపోతోంది. ఇప్పుడు వాళ్ల ముందు కూడా ఇదే ప్రశ్న తచ్చాడుతోంది. దానికి సమాధానం వెతకాల్సింది. మూస కథల్ని ఎంచకోవడం వల్ల రజనీకాంత్‌కి ఈమధ్య వరుసగా ఫ్లాపులు ఎదురయ్యాయి. కమల్‌కి ఫ్లాపులొచ్చినా కొన్ని ప్రయోగాలు చేశాడు. ‘విక్రమ్‌’తో తన అన్వేషణ ఫలించింది. ఈ సినిమాతో కమల్‌ మార్పు స్పష్టంగా కనిపించింది. ఇక రజనీ కూడా... తన ఆలోచనా ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్యాన్స్‌ని అలరిస్తే సరిపోదు.. ప్రేక్షకులందరినీ దృష్టిలో పెట్టుకొనే కథలు ఎంచుకోవాలి.. అనే నిజాన్ని రజనీ తెలుసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. 

Updated Date - 2022-08-21T06:04:11+05:30 IST