మొగిల‌య్య‌ను సెల‌బ్రిటీని చేసింది మాత్రం ‘భీమ్లా నాయక్’ పాటే!

ABN , First Publish Date - 2022-01-31T02:35:39+05:30 IST

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో తెలంగాణ రాష్ట్రం తరపున కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య ‘పద్మశ్రీ’కి ఎంపికైన విషయం తెలిసిందే. 12మెట్ల కిన్నెర కళలో ఆయన

మొగిల‌య్య‌ను సెల‌బ్రిటీని చేసింది మాత్రం ‘భీమ్లా నాయక్’ పాటే!

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో తెలంగాణ రాష్ట్రం తరపున కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య ‘పద్మశ్రీ’కి ఎంపికైన విషయం తెలిసిందే. 12మెట్ల కిన్నెర కళలో ఆయన ఆఖరి తరం కళాకారుడు. ‘పద్మశ్రీ’కి ముందే ఆయనలో ఈ కళను గుర్తించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతగానో ప్రోత్సహించారు. మొగిలయ్య జీవిత చరిత్రను ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా కూడా చేర్చారు. అయితే ఇంత జరిగినా కూడా మొగిలయ్య ఎవరో, ఆయన వాయించే పరికరం, ఆయనకున్న కళ ఏమిటో చాలా మందికి తెలియదంటే అందులో అతిశయోక్తి లేనే లేదు. అలాంటి మొగిలయ్యను ఒక్కసారిగా సెలబ్రిటీని చేసింది మాత్రం ‘భీమ్లా నాయక్’ చిత్రమనే చెప్పుకోవాలి.


పవన్ కల్యాణ్, రానా దగ్గబాటి కాంబినేషన్‌లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ చిత్రంలో మొగిలయ్యతో సంగీత దర్శకుడు థమన్ ఓ పాట పాడించారు. టైటిల్ సాంగ్‌గా విడుదలైన ఈ పాట సంచలనాలకు కేంద్ర బిందువుగా మారడమే కాకుండా.. ఇప్పుడు మొగిలయ్యకు ‘పద్మశ్రీ’ వరించడంలో కూడా కీలక పాత్ర వహించిందన్నది ఇప్పుడంతా సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్. కేసీఆర్‌తో పాటు ఈ కళను గుర్తించిన పవన్ కల్యాణ్ అతనితో ఈ చిత్రంలో ఓ పాట పాడించాల్సిందిగా దర్శకుడు త్రివిక్రమ్‌ని కోరాడట. ఈ విషయం స్వయంగా థమనే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు, ఈ పాట పాడిన తర్వాత మొగిలయ్యకు పవన్ కల్యాణ్ ఆర్థికంగానూ సహాయం అందించారు. ఈ పాట సోషల్ ప్రపంచంలో బాగా పాపులర్ అవడంతో.. మొగిలయ్యకు గుర్తింపు దక్కడమే కాకుండా.. ఆయన కూడా ఓ సెలబ్రిటీగా మారిపోయారు. అనంతరం ఆయనతో పలు యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయన పేరును ‘పద్మశ్రీ’కి సూచించడం, కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం వంటివి జరిగాయి.


అయితే మరుగున పడిపోతున్న కళను గుర్తించి.. దానిని సినిమాలో భాగం చేసి ప్రపంచానికి ఈ కళ గురించి తెలిసేలా చేసిన ఘనత మాత్రం ‘భీమ్లా నాయక్’, పవన్ కల్యాణ్‌, థమన్‌లకే దక్కుతుంది. ఈ విషయంపై కొందరు నెటిజన్లు.. ‘పేరు సూచించింది తెలంగాణ ప్రభుత్వం అయితే.. పవన్ కల్యాణ్‌కి ఏంటి సంబంధం?’ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుపుతుండటం గమనార్హం. ‘పద్మశ్రీ’ రావాలంటే ప్రభుత్వం సూచించాలి.. ఇది నిజమే కానీ ముందు ఆ స్థాయికి చేరుకోవాలి కదా!. ఇంతకుముందు మొగిలయ్య తనకు వచ్చిన కళతో ఎన్నో కార్యక్రమాలు చేశారు.. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా చాలా కాలం అయింది. ఇప్పటి వరకు ఆయన పేరును ‘పద్మశ్రీ’కి ఎందుకు సూచించలేదు? అనే విషయం ఒక్కటి గమనిస్తే.. ఈ చర్చలు పెట్టాల్సిన అవసరమే లేదని మరికొందరు వాదిస్తున్నారు.

Updated Date - 2022-01-31T02:35:39+05:30 IST