ఎన్సీబీ డైరెక్టర్ Sameer Wankhede తాజా కామెంట్స్.. Aryan Khan బెయిల్ రద్దుపై స్పందించమని మీడియా అడిగితే..

ABN , First Publish Date - 2021-10-20T21:01:47+05:30 IST

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. ముంబైలోని ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

ఎన్సీబీ డైరెక్టర్ Sameer Wankhede తాజా కామెంట్స్.. Aryan Khan బెయిల్ రద్దుపై స్పందించమని మీడియా అడిగితే..

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. ముంబైలోని ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరి బెయిల్ పిటిషన్లను కూడా తిరస్కరిస్తూ తాజాగా తీర్పును వెల్లడించింది. వాస్తవానికి అక్టోబర్ 13, 14వ తారీఖుల్లో ఈ బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలను విన్న ప్రత్యేక కోర్టు తీర్పును 20వ తారీఖునకు వాయిదా వేసింది. తాజాగా బుధవారం ఈ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో మరికొన్నాళ్లు ఆర్యన్ ఖాన్‌కు జైలు జీవితం తప్పేట్లు లేదు.


ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ రద్దయిన వెంటనే ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఊహించని కామెంట్స్ చేశారు. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించగానే కోర్టు నుంచి బయటకు వెళ్తున్న సమీర్ వాంఖడేను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ఆర్యన్ బెయిల్ పిటిషన్ రద్దుపై స్పందించమని అడిగారు. అయితే మీడియా ప్రతినిధుల ప్రశ్నలను సున్నితంగా తిరస్కరించిన ఆయన.. ఈ వ్యవహారంపై స్పందించలేనన్నారు. అదే సమయంలో సత్యమేవ జయతే అంటూ వ్యాఖ్యానించి తన వాహనంలో వెళ్లిపోయారు. 


ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసును మొదటి నుంచి సమీర్ వాంఖడే సీరియస్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్యన్ సహా ఇతర నిందితుల అరెస్టును దగ్గరుండి మరీ పర్యవేక్షించిన సమీర్ వాంఖడే ఆ తర్వాత విచారణలో ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టలేదు. కోర్టులో ఎన్సీబీ తరపున లాయర్ బలమైన వాదనలు వినిపించేలా ఆధారాలు ఇవ్వగలిగినందువల్లే ఆర్యన్ ఖాన్ బెయిల్‌ను సమీర్ వాంఖడే అడ్డుకోగలిగారు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నందువల్లే గుర్తు తెలియని వ్యక్తులు తనపై నిఘా వేశారని కూడా సమీర్ వాంఖడే ఆరోపణలు చేశారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను కూడా పెంచింది. 

Updated Date - 2021-10-20T21:01:47+05:30 IST