ఆ విషయం ఇర్పాన్ ఖాన్‌కి రెండేళ్ల క్రితమే తెలుసు.. నా చావు అలా ఉండాలి.. : నసిరుద్దీన్ షా

ABN , First Publish Date - 2021-12-06T22:16:41+05:30 IST

మంచి సినిమాలు, మంచి పాత్రలతో బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు పొందిన నటుడు నసిరుద్దీన్ షా. ఈ వెటరన్ యాక్టర్, గతేడాది మరణించిన ఇర్ఫాన్ ఖాన్‌తో..

ఆ విషయం ఇర్పాన్ ఖాన్‌కి రెండేళ్ల క్రితమే తెలుసు.. నా చావు అలా ఉండాలి.. : నసిరుద్దీన్ షా

మంచి సినిమాలు, మంచి పాత్రలతో బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు పొందిన నటుడు నసిరుద్దీన్ షా. ఈ వెటరన్ యాక్టర్, గతేడాది మరణించిన ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి మక్బూల్ (2007), 7 ఖూన్ మాఫ్ (2011) సినిమాలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ గురించి కొన్ని విషయాలను పంచుకున్నాడీ ‘క్రిష్’ యాక్టర్.


ఓ ఇంటర్వ్యూలో నసిరుద్దీన్ మాట్లాడుతూ.. ‘ఇది ఎంతో ప్రత్యేకమైన విషయం, ఎందుకంటే ఇది జరగబోతోందని ఇర్ఫాన్‌కు సుమారు రెండేళ్లు క్రితమే తెలుసు. లండన్‌లోని ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా నేను ఆయనతో చాలాసార్లు ఫోన్‌లో మాట్లాడాను. ఆయన మాటల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ఇర్ఫాన్ ఓ సారి నాతో మాట్లాడుతూ..మరణం దగ్గరికి రావడం ఆయనకు తెలుస్తోందన్నాడు. ఇలాంటి అవకాశం ఎంత మందికి లభిస్తుందని చెప్పాడు. వాస్తవానికి, ఇది ఒక భయంకరమైన నష్టం. కానీ అది ఎవరి చేతుల్లో లేదు. దానిపై ఎవరికి ఎలాంటి నియంత్రణ ఉండదని చెప్పినట్లు’ తెలిపాడు.


నసిరుద్దీన్ షా ఇంకా మాట్లాడుతూ.. ‘చావు గురించి ఆలోచించడం ఆరోగ్యకరమైనదని నేను అనుకోను. నేను ఖచ్చితంగా అలా చేయను. నా సన్నిహితులు, నా తల్లిదండ్రులతో పాటు నా కుటుంబంలో అనేక మరణాలను చూశాను. ముఖ్యంగా ప్రియమైన మిత్రులు ముఖ్యంగా ఓం పూరీ, ఫరూక్ షేక్ మరణాలు నన్ను షాక్‌కి గురి చేశాయి.


అందుకే దానిపై మక్కువ పెంచుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. మరణం అనేది జీవితంలో అత్యంత అప్రధానమైన భాగమని, అనివార్యమైనదని నేను భావిస్తున్నాను. నేను వెళ్ళవలసి సమయం వచ్చినప్పుడు వెళ్తాను. కానీ ఉన్నంత కాలం వీలైనంత అప్రమత్తంగా, సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. నేను పోయినప్పుడు నా స్నేహితులు నా గురించి విలపించడం కంటే నా పనుల గురించి మాట్లాడుకోవడం నాకు ఇష్టమ‌’ని చెప్పాడు.

Updated Date - 2021-12-06T22:16:41+05:30 IST