తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నేడు 24 క్రాఫ్ట్స్‌కు చెందిన కార్మికులు సినీ కార్మికులు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. ఇందులో 24 క్రాఫ్ట్స్‌కు చెందిన వందలమంది కార్మికులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా ఎక్కడా తెలుగు చిత్రాల షూటింగ్స్ జరగవనీ, ఫిల్మ్ ఛాంబర్ కల్పించుకుని తమ సమస్యలను పరిష్కరించేవరకూ సమ్మెను కొనసాగిస్తామని వారు డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు పెంచే విషయంలో ఫిల్మ్ ఫెడరేషన్ పై ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీయ నటుడు నరేష్ స్పందించారు.
ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, "నిన్నటి నుంచి టీవీలన్నీ మార్మోగిపోతున్నాయి. షూటింగులు ఆగిపోతాయని ఒకటీ రెండు యూనియన్లు వేతనాలు పెంచకపోతే షూటింగ్ ఆపేస్తామని పోరాటం చేస్తున్నారు. మంచిదే, పెద్దలందరూ కలిసి దీనిమీద. ఒక నిర్ణయం తీసుకోవాలి..తీసుకుంటారు. కానీ, మనమందరం ఒకటి గుర్తుంచుకోవాలి. గత మూడు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి బారినపడి ప్రపంచంతో పాటు సినీ పరిశ్రమ అట్టడుగుకు వెళ్లిపోయి కార్మీకులు, చిన్న చిన్న ఆర్టిస్టులు పూట కూటికి కూడా గతిలేకుండా ఎన్నో ఇబ్బందులు పడి మెడికల్ ఖర్చులకు కూడా లేకుండా ఎంతోమంది ప్రాణాలను కూడా కోల్పోయారు. మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడిప్పుడు కాస్త కోలుకుంటుంది. సినిమాలు రిలీజవుతున్నాయి. తెలుగు సినీపరిశ్రమకు ఒక మంచి పేరొస్తుంది.
మనందరికీ కూడా బ్యాంకులు నిండకపోయినా కనీసం కంచాలు నిండుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనమందరం కూడా ఆలోచిచాలి. అన్నిటికీ పరిష్కారం ఉంటుంది. కానీ, ఇలా ఫ్లాష్ స్ట్రైక్..ఇవాళే ఆపేయండీ అంటే..చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. దర్శకనిర్మాతలు, జూనియర్ ఆర్టిస్టులు ఫోన్ చేసి మునిగిపోతామండీ అంటున్నారు. నేను ఇండస్ట్రీ బిడ్డగా కోరేదొక్కటే..వేతనాలు ఎంతోకొంత పెంచాలి. అయితే, ఇలా తొందరపాటు లేకుండా ఒక వారం లేదా పదిరోజులు సమయం తీసుకుని, ఫెడరేషన్, నిర్మాతలు కలిసి ఒక నిర్ణయానికి రావడం కష్టం కాదు. కృష్ణానగర్, ఫిలింనగర్‌కు ఉన్న దూరం 3 కిలోమీటర్లు. అందరం కలిస్తేనే ఒక కుటుంబం. అందరం కలిసి ఒక పరిష్కారం తీసుకువస్తాం. ఇండస్ట్రీ బిడ్డగా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. పెద్దలందరం కలిసి నిర్ణయం తీసుకుని.. సినీ పరిశ్రమ మరోసారి అంధకారంలోకి వెళ్లకుండా ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని అనుకుంటున్నా''.. అని నరేశ్ తెలిపారు.