‘మా’ ఫైట్‌.. ఎవరు డ్రాప్‌?

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు టాలీవుడ్‌లో హీట్‌ని పుట్టిస్తున్నాయి. గురువారం ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌ ప్రకటన తర్వాత.. వేడి మరింతగా రాజుకుంది. దీనిలో భాగంగా నరేష్‌, జీవితా రాజశేఖర్‌ కలిసి ఓ ప్రెస్‌ మీట్‌ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. శనివారం జరగనున్న ఈ మీడియా సమావేశాన్ని ముందుగా ఫిల్మ్‌ ఛాంబర్‌లో అనుకున్నారు. సడెన్‌గా ఈ సమావేశాన్ని సూపర్‌ స్టార్‌ కృష్ణ ఇంటికి మార్చారు. దీంతో ప్రకాష్‌రాజ్‌ కాకుండా 'మా' అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మిగతావారంతా కలిపి ప్లాన్‌ మార్చబోతున్నారా?.. అనేలా ఊహాగానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈ బరిలో ఉన్న మంచు విష్ణు ఇప్పటికే సూపర్‌ స్టార్‌ కృష్ణను కలిసి మద్దతు కోరారు. ఇప్పుడు కృష్ణ ఇంటిలోనే మీటింగ్‌ అనేసరికి.. ఇండస్ట్రీ వర్గాల్లో మరింత ఆసక్తి క్రియేట్‌ అవుతోంది.

నామినేషన్‌కు ముందే విత్‌ డ్రా

'మా'కు సంబంధించి ఎన్నికల వివరాలను తెలపడానికి ఈ ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తున్నారనుకోవడానికి.. అధికారంలో ఉన్న వేరేవారు ఎవరూ లేకుండా.. కేవలం వారిద్దరే ఈ మీట్‌లో పాల్గొంటారని తెలిపారు. అంటే దీనిని బట్టి ప్రస్తుత 'మా'కి సంబంధించి అధికారంలో ఉన్న వీరు అటువంటివేమీ తెలిపే ప్రయత్నానికైతే ఈ మీట్‌ నిర్వహించడంలేదనేది అర్థమవుతోంది. మరి దేనికోసం ఈ ప్రెస్‌ మీట్‌?. జీవితా రాజశేఖర్‌కు వీకే నరేష్‌ మద్దతిస్తున్నానని తెలపడానికా?. అలా అయితే, మంచు విష్ణు 'మా' బరిలో దిగుతున్నానని తెలపగానే వీకే నరేష్‌ మద్దతిస్తున్నట్లుగా ప్రకటించారు. ''యువరక్తం, కష్టం తెలిసిన ఫ్యామిలీ కాబట్టి.. మంచు విష్ణుపై మాకు చాలా నమ్మకం ఉంది. నా మద్దతు అతనికే..'' అని నరేష్‌ తెలిపారు. మరి ఇప్పుడు జీవితా రాజశేఖర్‌తో కలిసి ప్రెస్‌ మీట్‌ అంటే ఇక్కడేదో తేడా కొడుతుంది. నామినేషన్‌కు ముందే 'మా' అధ్యక్ష పోటీ నుంచి విరమించుకుని.. మిగతా వారిని కూడా కలుపుకుని ప్రకాష్‌రాజ్‌ను ఎదుర్కొనే వ్యూహమా? అలా ఆలోచిస్తే.. రెండు రకాలుగా చర్చలు నడిచే అవకాశం ఉంది. 

ఎవరు ఎవరికి మద్దతివ్వబోతున్నారు?

జీవితా రాజశేఖర్‌ ఈ పోటీ నుంచి విరమించుకుని, మంచు విష్ణుకి మద్దతు తెలపడంతో పాటు ఆయన ప్యానెల్‌లో పోటీ చేయనున్నారా?. ఇంకోటి మంచు విష్ణు విరమించుకుని జీవితా రాజశేఖర్‌కు మద్దతు తెలపనున్నారా? ఈ రెండింటిలో ఏదైనా జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. ఇందులో రెండో ఛాన్స్‌ అయితే.. ప్రకాష్‌రాజ్‌ను ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంది. అదెలా అంటే.. మెగాస్టార్‌ చిరంజీవి కూడా గత 'మా' ప్రెస్‌ మీట్‌లో 'మా' అధ్యక్ష పదవికి ఈసారి లేడీకి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ రకంగా జీవితకు ఇది ప్లస్‌ అవుతుంది. అంతకు ముందు కూడా ఆమె 'మా' అధ్యక్ష పదవి కోసం ఎంతో ప్రయత్నించారు.. ఆ సమయంలో ఈసారి చూద్దాం అని చిరు మాట ఇచ్చినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అలాగే కొడుకును బరిలో దించాలని ప్రయత్నాలు చేసిన.. మంచు మోహన్‌ బాబు సైడ్‌ నుంచి కూడా గట్టి మద్దతు జీవితకు లభించే అవకాశం ఉంటుంది. 'అధ్యక్ష' పదవి కంటే ముందు ఆమె పోటీ చేయాలనుకున్న స్థానాన్ని హేమకు ఆఫర్‌ చేసి, ఆమెను కూడా కలుపుకుని.. వీరు ఒక ప్యానెల్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అప్పుడు రెండు ప్యానెల్స్‌ సమ ఉజ్జీలుగా బరిలోకి దిగితే.. పోటీ నువ్వా? నేనా? అనేలా జరుగుతుంది. మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడడానికి లేకుండా జీవిత, విష్ణులు చేసినట్లు అవుతుంది. అలాగే వీకే నరేష్‌ అకౌంట్‌లో ఉన్నాయని చెప్పుకుంటున్న 100కి పైగా ఓట్లు గెలుపుని డిసైడ్‌ చేసే అవకాశం కూడా ఉంది. ఏమో ఏదైనా జరగవచ్చు. ఒకవైపు ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌ ప్రకటించి స్పీడు మీదున్నా.. మంచు విష్ణు సైడ్‌ నుంచి ఎటువంటి మూమెంట్‌ కనబడటం లేదు. అంటే ఏదో జరుగుతుంది. అదేంటో శనివారం నరేష్‌, జీవిత ప్రెస్‌ మీట్‌ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇటువంటి ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.