నేచురల్ స్టార్ నానీ (Nani) గత చిత్రం ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) ఆశించిన రీతిలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. థియేటర్స్‌లో నిరాశపరిచినప్పటికీ.. ఓటీటీలో మంచి స్పందన దక్కించుకుంది. ప్రస్తుతం నానీ ఆ సినిమా రిజల్ట్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా.. తదుపరి చిత్రం ‘దసరా’ (Dasara) పైనే తన దృష్టినంతటినీ కేంద్రీకరించాడు. సుకుమార్ (Sukumar) ప్రియశిష్యుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో నానీని నెవర్ బిఫోర్ అవతార్‌లో ప్రెజెంట్ చేస్తున్నాడు. అంతేకాదు మొట్టమొదటి సారిగా నానీచేత పూర్తి స్థాయిలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పిస్తున్నాడు. ఆ కారణంగా ఈ సినిమా చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ‘నేను లోకల్’ (Nenu Loacal) తర్వాత నానీ సరసన కీర్తి సురేశ్ (Keerthi Suresh) కథానాయికగా నటిస్తుండడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ‘దసరా’ చిత్రం కథాంశంపై ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నానీ మాస్ గెటప్, ఆ మేకోవర్ ను చూసి ఇదేదో యాక్షన్ చిత్రమని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇదొక పక్కా లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ప్రేమకథల్ని వైవిధ్యంగా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు సుకుమార్ చాలా దిట్ట. ఆ బాటలోనే అతడి శిష్యులు కూడా నడిచారు. ‘కుమార్ 21 ఎఫ్’ (Kumari 21 F) తో సూర్య ప్రతాప్ పల్నాటి (SuryaPrathap Palnati), ‘ఉప్పెన’ (Uppena) తో బుచ్చిబాబు సానా (Buchibabu sana) లవ్ స్టోరీల్లో కొత్తదనాన్ని చూపించి సూపర్ హిట్స్ కొట్టారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ రాసుకొన్న దసరా కథాంశం కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని చెబుతున్నారు. ఇది ‘కోటలో రాణి తోటలో రాజు’ లాంటి ప్రేమకథ అని సమాచారం.
హీరో మురికివాడలో ఉంటాడు. హీరోయిన్ కోటలాంటి ఇంటిలో ఉంటుందట. వారిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుందట. పోస్టర్స్, నానీ గెటప్ చూసి యాక్షన్ సినిమాగా భావించినా.. ఇందులో లవ్ స్టోరీ చాలా గమ్మత్తుగా ఉంటుందని, అదే సినిమాకి హైలైట్ పాయింటని టాక్. యాక్షన్ సినిమాలు, లవ్ స్టోరీలు నానీకి కొత్తకాదు. కథాంశం ఆసక్తిగా ఉండాలి గానీ, ఏ జోనరైనా అభిమానులకు అభ్యంతరం లేదు. అయితే ఈ రెండు జోనర్స్ మిక్స్ చేస్తూ శ్రీకాంత్ తెరకెక్కిస్తున్న ‘దసరా’ చిత్రం నానీకి ఓ వెరైటీ చిత్రమవుతుందని నిర్మాతలు చెబుతున్నారు.