ఆ తిట్లే నాన్నకు హిట్లు

ABN , First Publish Date - 2021-08-08T05:32:37+05:30 IST

నా చిన్నతనంలో మేము నాగార్జుననగర్‌ (ఇప్పుడు రంగరాజపురం అంటున్నారు)లోని సెకండ్‌ స్ట్రీట్‌లో ఉండేవాళ్లం.

ఆ తిట్లే నాన్నకు హిట్లు

తెలుగు సినిమాల్లో విలన్‌ పాత్రల స్వభావాన్ని పూర్తిగా మార్చేసిన నటుడు నాగభూషణం. విలనీలో కామెడీని, సెటైర్‌ని, నక్కజిత్తుల వినయాన్ని జోడించి తనదైన శైలిలో నటిస్తూ ఓ పదిహేనేళ్ల పాటు తెలుగు చిత్రపరిశ్రమను ఏలేశారు. ‘ముత్యాలముగ్గు’ చిత్రంతో రావు గోపాలరావు వెలుగులోకి వచ్చేవరకూ నాగభూషణం హవా కొనసాగింది. నాగభూషణం మూడో భార్య పేరు సీత. ‘రక్తకన్నీరు’ నాటకంలో ఆమె సహనటి. ఆమె కూతురు భువనేశ్వరి. ఆమె తన తండ్రి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ‘నవ్య’కు వివరించారు.


నా చిన్నతనంలో మేము నాగార్జుననగర్‌ (ఇప్పుడు రంగరాజపురం అంటున్నారు)లోని సెకండ్‌ స్ట్రీట్‌లో ఉండేవాళ్లం. ఆ వీధి అంతా సినిమా వాళ్లే ఉండేవారు. మాకు ఓ ఇంటి అవతల పద్మనాభం ఉండేవారు. అలాగే ఆర్టిస్ట్‌ మిక్కిలినేని కూడా ఆ వీధిలోనే ఉండేవారు. ఇక రాజబాబు అన్నయ్య మద్రాసు వచ్చిన తొలి రోజుల్లో నటి హేమలత ఇంట్లో అద్దెకు ఉండేవారు. అది మా ఇంటి పక్క ఇల్లే కావడంతో రెండు కుటుంబాల మధ్య రాకపోకలు బాగా ఉండేవి. రాజబాబు మరదలు రమోలా, మా అమ్మ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. నాకు బాగా ఊహ తెలిసేటప్పటికే ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్‌. అయినా మా ఇంట్లో ఏ ఫంక్షన్‌ జరిగినా ఆయన తప్పకుండా హాజరయ్యేవారు. నేను 1960లో పుట్టాను. నాన్నగారికి ‘మంచిమనసులు’(1962) చిత్రంతో బ్రేక్‌ వచ్చి ఆర్టిస్ట్‌గా చాలా బిజీ అయ్యారు. 


జయాబచ్చన్‌ దగ్గర ఆటోగ్రాఫ్‌ తీసుకున్నా

ప్రతి రోజూ నాన్న ఇంటికి రాగానే స్నానం చేసి బాల్కనీలో కూర్చునేవారు. మమ్మల్ని దగ్గరకు తీసుకుని కబుర్లు చెప్పేవారు. షూటింగ్‌ విషయాలు మాత్రం మాతో షేర్‌ చేసేకొనేవారు కాదు. అయితే ‘నవరాత్రి’ షూటింగ్‌ ఏవీఎం స్టూడియోలో  జరుగుతున్నప్పుడు పక్క ఫ్లోర్‌లో జయభాదురీ, సంజీవ్‌కుమార్‌ నటిస్తున్న హిందీ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. అప్పుడు మమ్మల్ని తీసుకువెళ్లి పరిచయం చేశారు. జయబచ్చన్‌ దగ్గర ఆటోగ్రాఫ్‌ తీసుకోవడానికి ఆ సమయంలో నా దగ్గర బుక్‌ లేకపోవడంతో నాన్నగారు జేబులోంచి పది రూపాయల నోటు తీసి ఇచ్చారు. దాని మీద ఆవిడ ఆటోగ్రాఫ్‌ తీసుకున్నా. ఆ నోటుని చాలా కాలం భద్రంగా దాచుకొన్నా.

 

ఆ తిట్లు వినలేక చెవులు మూసుకున్నాం

ఒకసారి గుంటూరులో ఉన్నప్పుడు ‘నాన్నా.. ఎప్పుడూ విలన్‌ వేషాలే ఎందుకు వేస్తున్నారు. వేరే పాత్రలు వేయవచ్చు కదా’ అని అడిగాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా పక్కనే ఉన్న థియేటర్‌కు తీసుకెళ్లి కూర్చోబెట్టి సినిమా చూడమని చెప్పి వెళ్లిపోయారు. ఆ సినిమా పేరు గుర్తు లేదు కానీ అందులో కూడా నాన్నది విలన్‌ వేషమే. తెరపై ఆయన చేసే పనులు చూస్తూ నా పక్కనున్న జనం తిట్టుకోవడం మొదలుపెట్టారు. కొందరు బూతులు కూడా లంకించుకున్నారు. అవి వినలేక  నేను, మా అన్నయ్య  చెవులు మూసుకున్నాం. సినిమా అయ్యాక నాన్నని కలిసి ‘ఏమిటి నాన్నా.. జనం మిమ్మల్ని అలా తిడుతుంటే వినలేక చఛ్చాం’  అన్నాను. ఆయన నవ్వేసి ‘మేం కోరుకొనేది ఆ తిట్లేనమ్మా. ప్రేక్షకులు నన్ను తిట్టడం లేదు. నేను పోషించిన పాత్రను తిడుతున్నారు. అంటే ఆ పాత్రతో వాళ్లు అంతగా కనెక్ట్‌ అయ్యారన్నమాట’ అన్నారు.


అమ్మతో పరిచయం, పెళ్లి

1956లో ‘రక్తకన్నీరు’ నాటక ప్రదర్శనని నాన్న మొదలుపెట్టారు. అమ్మ అప్పటికే ఆర్టిస్ట్‌. సోలో డాన్సులు, రేలంగి గారి పక్కన హాస్య పాత్రలు పోషిస్తుండేది. ‘మాయాబజారు’ చిత్రంలో నాన్న, అమ్మ ఇద్దరూ నటించారు. కానీ వాళ్లకి అప్పటికి పెళ్లి కాలేదు. తన నాటకంలో వ్యాంప్‌ పాత్ర అమ్మ పోషిస్తే బాగుంటుందని నాన్నకు అనిపించి అమ్మను అడిగారట. ‘నాకు ప్రత్యేకంగా కారు పెట్టాలి. ట్రైన్‌లో జాగ్రత్తగా తీసుకెళ్లాలి’ వంటి ఏవో కండీషన్స్‌ అమ్మ పెట్టిందట. నాన్న అన్నింటికీ ఒప్పుకొని ‘రక్తకన్నీరు’ ప్రదర్శన ప్రారంభించారు. తర్వాత రెండు నెలలకు వాళ్లిద్దరు  ప్రేమలో పడి, అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకొన్నారు. 


 తమిళ నాటకానికి తెలుగు మెరుగులు

ఆ రోజుల్లో ఎం.ఆర్‌.రాధ (నటి రాధిక తండ్రి) ప్రదర్శించే ‘రక్తకన్నీర్‌’ తమిళ నాటకం ఓ సంచలనం. సమాజంలోని అవకతవకల మీద ఆ నాటకంలో సైటర్లు ఉండేవి.  అటువంటి నాటకాన్ని తెలుగులో కూడా ప్రదర్శించాలనే తపనతో పాలగుమ్మి పద్మరాజుగారితో తెలుగు వాతావరణానికి తగ్గట్లుగా మార్పులు, చేర్పులు చేయించి నాటకాన్ని తిరగరాయించారు. 1956 మే నెలలో నాన్న సొంతవూరు నెల్లూరులో ఈ నాటకం తొలి ప్రదర్శన జరిగిందట. ఇక అప్పటినుంచి ఐదు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు నాన్న. ఈ నాటకం ప్రథమార్థంలో కొంత కథ నడిచినా, ద్వితీయార్థంలో నాన్న విశ్వరూపం కనిపించేది. ఏ ఊర్లో నాటకాన్ని ప్రదర్శిస్తున్నారో, ఆ ఊరి రాజకీయాల గురించి సెటైర్లు ఉండేవి. జనం కూడా బాగా కనెక్ట్‌ అయి ఎంజాయ్‌ చేసేవారు. ఇలా ప్రతి చోటా నేటివిటీ టచ్‌ ఇవ్వడంతో ‘రక్తకన్నీరు’ నాటక ప్రదర్శన ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉండేది. 


ఎన్టీఆర్‌తో  విభేదాలు లేవు

నాకు తెలిసినంతవరకూ ఎన్టీఆర్‌తో నాన్నకి విభేదాలు లేవు. ఆయనంటే ప్రత్యేక అభిమానం కూడా. రామారావుగారు తన సొంత సినిమాలు ఉమ్మడి కుటుంబం, వరకట్నం, తల్లా పెళ్లామా, కోడలు దిద్దిన కాపురం..ఇలా అన్నింటిలోనూ నాన్నకు మంచి అవకాశాలు ఇచ్చారు. నాన్న కూడా ఆయనతో ‘ఒకే కుటుంబం’ చిత్రం తీశారు. అయితే కృష్ణగారితో నాన్న ఎక్కువగా కలసి ఉండడంతో రామారావుగారు దూరం జరిగారేమో తెలీదు.


శకుని వేషం వేయనన్నారు

హీరో కృష్ణతో మొదటినుంచీ నాన్నకు అనుబంధం ఎక్కువ. ఆయన మా ఇంటికి వచ్చేవారు కాదు కానీ విజయనిర్మల వచ్చేవారు. మేం తీసిన ‘ప్రజానాయకుడు’  చిత్రంలో నాన్నది ప్రధాన పాత్ర.  అందులో హీరోది రిక్షా కార్మికుని పాత్ర. కృష్ణ ఆ సమయంలో చాలా బిజీగా ఉండేవారు. ఈ వేషానికి ఆయన్ని ఏం అడుగుతాం అనుకొని ఇతర హీరోల కోసం వెదుకుతున్నారు నాన్న. ఈ విషయం కృష్ణకి తెలిసి ఆయనంతట ఆయనే ఫోన్‌  చేసి ‘నువ్వు సొంతంగా సినిమా తీస్తూ నన్ను అడగకుండా వేరే వాళ్లని అడగడం ఏమిటి?’ అని నిలదీశారు. ‘నువ్వు బిజీగా ఉన్నావు కదాని అడగలేదు’ అని నాన్న అంటే ‘ఏం పరవాలేదు నేను డేట్స్‌ ఇస్తున్నాను’ అని చెప్పారట. అంత మంచి వ్యక్తి కృష్ణ. ఆయన నిర్మించిన ‘కురుక్షేత్రం’  సినిమాలో శకుని వేషం నాన్నతో వేయించారు. ఆ చిత్రానికి పోటీగా  తయారవుతున్న ‘దానవీరశూర కర్ణ’ చిత్రంలో ఆ పాత్రను ధూళిపాళగారు చేస్తున్నారు. శకుని పాత్రకు ఽఆయన పెట్టింది పేరు. నాన్న ఆ విషయమే చెప్పి ‘అవతల సినిమాలో ధూళిపాళ గారు చేస్తున్నారయ్యా.. నేను డైలాగులు బాగా చెప్పగలను కానీ శకుని పాత్రకు నా బాడీ లాంగ్వేజ్‌ సరిపోదు.  నన్ను వదిలెయ్యి. ధూళిపాళ డేట్స్‌ తీసుకుని ఆయనతో వేయించండి.’ అని చెప్పినా కృష్ణ వినలేదు. . నువ్వు వెయ్యాల్సిందే అని ఒప్పించారు. దాంతో నాన్న ఎక్కువ కేర్‌  తీసుకుని ఆ పాత్ర చేశారు.


పద్మనాభంతో కలసి  పద్యాలు పాడేవారు

సాయంత్రం షూటింగ్‌ నుంచి ఇంటికి రాగానే స్నానం చేసేసి షార్ట్స్‌ , కట్‌ బనీన్‌ వేసుకొనేవారు నాన్న. ఆయన నైట్‌ డ్రస్‌ అదే. ఆ తర్వాత బాల్కనీలోకి వెళ్లి ‘పద్దూ’ అని గట్టిగా అరిచేవారు. అవతల నుంచి ‘భూషణం’ అని పద్మనాభం  పలికేవారు. వెంటనే నాన్న ‘చెల్లియో చెల్లకో..’ పద్యం అందుకోగానే, పద్మనాభంగారు రెండో లైన్‌ పాడేవారు. వీరిద్దరి పద్యాలతో మా వీధి మారుమోగేది.


ఆర్ధిక ఇబ్బందులు లేనేలేవు

నాన్న చివరి రోజుల్లో ఆర్ధికంగా ఇబ్బంది ఎప్పుడూ పడలేదు. రిటైర్‌మెంట్‌ లైఫ్‌ను ఆయన చక్కగా ప్లాన్‌  చేసుకున్నారు. దానికి అవసరమైన డబ్బు కూడా దాచుకున్నారు. చెన్నైలో ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్పప్పుడు విదేశాల నుంచి కార్లు కొనేవారు. చివరి రోజుల్లో అంత వైభవం లేదు కానీ సొంత ఇల్లు, ఓ ఫియట్‌ కారు మాత్రం ఉండేవి. ఆ కారులో  తిరగడానికి ఆయన ఇబ్బందేమీ పడలేదు. పిల్లలందరినీ బాగా చూసుకున్నారు. దీపావళి వస్తే స్వీట్‌ బాక్స్‌తో  ఆడపిల్లల దగ్గరకు వెళ్లి ఎంతో కొంత డబ్బు ఇవ్వాలనేది ఆయన ఓ నియమంగా పెట్టుకున్నారు. అది. చివరి వరకూ ఆయన  పాటించారు. 


మీర్‌తో మతాంతర వివాహం

మా మామ ఎస్‌.డి.లాల్‌ డైరెక్టర్‌. మా వారు మీర్‌, మా అన్నయ్య క్లాస్‌మేట్స్‌ కావడంతో మా ఇంటికి తరచూ వస్తుండేవారు. ఓ రోజు మీర్‌ నాకు ప్రపోజ్‌ చేశారు. మొదట నాన్న ఒప్పుకోలేదు. ఎందుకంటే మేం బ్రాహ్మణులం. తను ముస్లిం. చివరకు ఆయన ఆలోచించుకుని సరేనన్నారు. మాకు ఇద్దరు మగ పిల్లలు. పెద్ద వాడు ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తున్నాడు. చిన్నవాడు విజువల్‌ ఎఫెక్ట్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు.  

వినాయకరావు 

Updated Date - 2021-08-08T05:32:37+05:30 IST