రేర్ పిక్: తొలి శతదినోత్సవ షీల్డ్‌ అందుకుంటోన్న నాగార్జున

ABN , First Publish Date - 2021-07-24T22:10:21+05:30 IST

అక్కినేని నాగేశ్వరరావు అన్నా, ఆయన సినిమాలన్నా దర్శకుడు దాసరి నారాయణరావుకు ఎంతో ఇష్టం. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏర్పడిన ఈ అభిమానం వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. తన అభిమాన నటుడిని చూడడం కోసం పోలీసు లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తికి ఆ అభిమాన హీరోని డైరెక్ట్‌ చేసే అవకాశం రావడం నిజంగా అరుదైన విషయమే.

రేర్ పిక్: తొలి శతదినోత్సవ షీల్డ్‌ అందుకుంటోన్న నాగార్జున

అక్కినేని నాగేశ్వరరావు అన్నా, ఆయన సినిమాలన్నా దర్శకుడు దాసరి నారాయణరావుకు ఎంతో ఇష్టం. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏర్పడిన ఈ అభిమానం వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. తన అభిమాన నటుడిని చూడడం కోసం పోలీసు లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తికి ఆ అభిమాన హీరోని డైరెక్ట్‌ చేసే అవకాశం రావడం నిజంగా అరుదైన విషయమే. అక్కినేని, దాసరి కాంబినేషన్‌కు శ్రీకారం చుట్టి , వీరిద్దరి కలయికలో అద్భుత చిత్రాలు ఎన్నో రావడానికి ‘దేవదాసు మళ్లీ పుట్డాడు’ చిత్రం తొలి వేదిక అయింది.  వీరిద్దరి కలయికలో మొత్తం 18 చిత్రాలు రూపుదిద్దుకొన్నాయి. అక్కినేని, దాసరి కాంబినేషన్‌కు శిఖరాగ్రస్థాయి అని చెప్పాల్సిన చిత్రం ‘ప్రేమాభిషేకం’. ఒక  సినిమా కమర్షియల్‌గా చారిత్రక విజయం సాధించడంతో పాటు ‘క్లాసిక్‌’గా ప్రశంసలు అందుకోవడం ‘ప్రేమాభిషేకం’ చిత్రం విషయంలోనే జరిగింది. అక్కినేనిని గొప్ప ప్రేమికునిగా చూపిస్తూ, ‘దేవదాసు’ చిత్రంలోని లేని త్యాగాన్ని ఇందులో కలిపితే సినిమా చరిత్ర సృష్టిస్తుందనుకున్న దాసరి నమ్మకాన్ని ‘ప్రేమాభిషేకం’ చిత్రం నిజం చేసింది.



తండ్రి అక్కినేనితోనే కాదు తనయుడు నాగార్జునతోనూ ‘మజ్ను’ వంటి డిఫరెంట్‌ లవ్‌ సబ్జెక్ట్‌ను తీసి, ఆయనకు తొలి హిట్‌ ఇచ్చిన ఘనత కూడా దాసరిదే. నాగార్జునకు ఇది నాలుగో చిత్రం. మొదటి మూడు చిత్రాలూ అంతంత మాత్రంగానే ఆడాయి. దానికి తోడు నాగార్జున నటన, డైలాగ్‌ డెలివరీ గురించి విమర్శలు వినిపిస్తున్న తరుణం అది. అటువంటి పరిస్థితుల్లో నాగార్జునతో ట్రాజెడీ పాత్ర చేయించాలనుకోవడం నిజంగా సాహసమే. అయినా రిస్క్‌ చేశారు దాసరి. దాసరి పద్మ నిర్మాతగా తన సొంత బేనరుపై ‘మజ్ను’ చిత్రం నిర్మించారు. 1987 జనవరి 14న విడుదలైన ‘మజ్ను’ చిత్రం హిట్‌ అయి, దాసరి కాన్ఫిడెన్స్‌ కరెక్టేనని చెప్పింది. నాగార్జున తొలి సినిమా ‘విక్రమ్‌’ విజయవంతమైనా ఫంక్షన్‌ చేయలేదు. అందుకే ‘మజ్ను’ వంద రోజుల వేడుకను 1987 మే నాలుగున చెన్నైలోని పద్మా విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు దాసరి. సీనియర్‌ హీరో కృష్ణంరాజు చేతుల మీదుగా తొలి శతదినోత్సవ షీల్డ్‌ అందుకున్నారు నాగార్జున.

–వినాయకరావు



Updated Date - 2021-07-24T22:10:21+05:30 IST