నాగార్జున,చైతన్య..నన్ను హీరోగా తీసుకున్నారు

కెరీర్‌ ఆరంభం నుంచి లవర్‌బాయ్‌ పాత్రల్లో ప్రేక్షకులను ఎంటర్టైన్‌ చేస్తూ వస్తున్నారు హీరో రాజ్‌తరుణ్‌. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్లోనూ హీరోగా తనకంటూ ఓ గుర్తింపును ఏర్పరుచుకున్నారాయన. సినిమా హిట్‌, ప్లాప్‌లతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో నిలకడగా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు రాజ్‌ తరుణ్‌. శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో ఆయన హీరోగా న టించిన తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. సుప్రియా యార్లగడ్డ నిర్మాత. ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలవుతోన్న సందర్భంగా రాజ్‌తరుణ్‌ సినిమా విశేషాలను పంచుకున్నారు. 


హీరోగా సినిమా సక్సెస్‌లో నేను భాగమే కానీ విజయం అనేది నా ఒక్కడి చేతుల్లో ఉండదు. ఒకప్పుడు హైదరాబాద్‌ ఎలా రావాలో కూడా తెలియని నేను ఇప్పటికి హీరోగా 14 సినిమాలు చేశాను. నాకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాను. ఇంతకంటే గొప్ప అదృష్టం ఇంకే కావాలి! 


గోదావరి జిల్లాల యాస, నేపథ్యంలో సాగే పాత్రలు నాకు బాగా సూటవుతాయి. ఈ చిత్రం కూడా భీమవరం, హైదరాబాద్‌ నేపథ్యంలో సాగుతుంది. కుటుంబ ప్రేక్షకులతో కలసి చూసేలా ఉంటుంది సినిమా. తండ్రీ కొడుకుల అనుబంధాలు, పుట్టిన ఊరిపై మమకారం మనసుకు హత్తుకునే భావోద్వేగాలు ఉన్న కథ ఇది. అమ్మిరాజు పాత్రలో అజయ్‌ గారు అద్భుతంగా నటించారు. 


చాలా ఏళ్లుగా శ్రీను, నేనూ మంచి స్నేహితులం. తను నాగార్జున, నాగచైతన్యకు కథ చెప్పినప్పుడు నన్ను హీరో అనుకోలేదు. వారిద్దరి సూచనమేరకు నన్ను తీసుకున్నారు. నాగచైతన్య సినిమా చూశాక 40 నిమిషాలు దర్శకుడితో మాట్లాడారట. చాలా బాగుందని ప్రశంసించారు. ప్రస్తుతం ‘స్టాండప్‌ రాహుల్‌’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ‘మాస్‌ మహారాజా’ షూటింగ్‌ జరుగుతోంది. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.