Nagababu: మురళీమోహన్‌ గట్టిగా ప్రయత్నిస్తే ‘మా’కు భవనం ఎప్పుడో వచ్చేది

ABN , First Publish Date - 2021-07-16T01:26:53+05:30 IST

ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అప్పటి ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్‌ భవన నిర్మాణానికి స్థలం కోసం ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత సీఎం వైఎస్‌ను ఎకరం భూమి ఇవ్వాలని మురళీమోహన్‌ కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గేట్స్‌ క్లోజ్‌ చేసింది.

Nagababu: మురళీమోహన్‌ గట్టిగా ప్రయత్నిస్తే ‘మా’కు భవనం ఎప్పుడో వచ్చేది

‘మా’ అసోసియేషన్‌ ఎన్నికలకు పోటీ అవసరం..

ఏకగ్రీవం అనేది తప్పు...

మిగిలిన వారు తప్పుకొంటే ప్రకాశ్‌ ఏకగ్రీవం అవుతాడు కదా? 

బరిలో ఉన్నవారిని నుంచి ఎందుకు తప్పుకోమనాలి? 

ఎవరు గెలిచినా అంతా కలిసే పని చేస్తాం.. 

భవనం కోసం ప్రయత్నం ఎప్పుడూ ఆగలేదు..

మురళీమోహన్‌ గట్టిగా ప్రయత్నిస్తే అప్పుడే భవనం సిద్ధమయ్యేది! 

‘మా’ అసోసియేషన్‌ ఎన్నికల గురించి ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’కి నాగబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు. 


ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అప్పటి ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్‌ భవన నిర్మాణానికి స్థలం కోసం ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత సీఎం వైఎస్‌ను ఎకరం భూమి ఇవ్వాలని మురళీమోహన్‌ కోరారు. అప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం గేట్స్‌ క్లోజ్‌ చేసింది. దాంతో రెండు ప్రయత్నాలు సఫలం కాలేదు. మురళీ మోహన్‌ అప్పట్టో గట్టిగా ప్రయత్నం చేసుంటే ‘మా’కు భవనం వచ్చేది. దాసరి నారాయణరావుగారు మంత్రిగా ఉన్న తరుణంలో కూడా పని జరగలేదు. నేను అధ్యక్షుడి ఉన్న టర్మ్‌లోనూ ప్రయత్నం విఫలం అయింది. రాష్ట్రం విడిపోవడం వల్ల రకరకాల కారణాలతో అసోసియేషన్‌ బిల్డింగ్‌ కట్టడం కన్నా వెల్ఫేర్‌ ముఖ్యమనే ఆలోచనతో భూమి సేకరణ, భవన నిర్మాణ పనులు మూలన పడ్డాయి. దాంతో ఫిల్మ్‌ ఛాంబర్‌లోనే ఓ గదిలో ‘మా’ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అక్కడే అడ్జస్ట్‌ కావాల్సి వస్తుంది. అయితే ఇప్పటికీ ‘మా’ భవన నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. 


‘మా’ తెల్ల కాగితం...

శివాజీరాజా ప్రెసిడెంట్‌గా ఉండగా అమెరికాకు వెళ్లి ఓ ప్రోగ్రామ్‌ ద్వారా.. ‘మా’ అసోసియేషన్‌కు ఫండ్‌  ేసకరించారు. వాటిని వెల్ఫేర్‌ కోసం ఉపయోగించారు. నరేశ్‌ టర్మ్‌లో పెద్దగా ఎఫర్ట్‌ పెట్టలేదు. ఏం జరిగిందో వారిని అడిగితేనే బావుంటుంది. ‘మా’ అనేది ఒక వైట్‌ పేపర్‌ లాంటిది. ఎవరైనా వెళ్లి అకౌంట్స్‌ అడగవచ్చు. అక్కడ డబ్బు దుర్వినియోగం అయిందనేది కరెక్ట్‌ కాదు.


ఆ నమ్మకంతోనే సపోర్ట్‌...

సౌత్‌ ఇండియాలో ఉన్న ప్రతి ప్రభుత్వంతో ప్రకాష్‌రాజ్‌కు మంచి సంబంధాలున్నాయి. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అతనిలో మంచి విజన్‌ ఉంది. ‘తెలుగు పరిశ్రమ నాకెంతో ఇచ్చింది. నేను ఏదో ఒకటి పరిశ్రమ కోసం చేయాలనుకుంటున్నా. అసోసియేషన్‌ సభ్యులు కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ఓ యాక్షన్‌ ప్లాన్‌తో ప్రకాశ్‌రాజ్‌ ఉన్నారు. ఆయన ఇవన్నీ చెప్పగనే ‘మీరు చాలా భాషల్లో బిజీ ఆర్టిస్ట్‌. అసలు ‘మా’ కోసం సమయం కేటాయించగలరా? అని అడిగాను. ఆయన వంద శాతం కేటాయిస్తానని చెప్పారు. ఆయన మాటల్లో నాకు నమ్మకం ఉండడంతో సపోర్ట్‌ చేస్తున్నాను. 


మేమంతా కలిసే పని చేస్తాం...

‘మా’కు సంబంధించిన విషయాల్లో ప్రకాశ్‌కు ఓ క్లారిటీ ఉంది. స్థలం, బిల్డింగ్‌ నిర్మాణం, ఇతర కార్యక్రమాలు పక్కా ప్రణాళిక ఉంది. అతని ఇంటెన్స్‌కి కన్విన్స్‌ అయ్యి సపోర్ట్‌ చేస్తున్నాం. ప్రకాశ్‌ గెలిచినా, విష్ణు గెలిచినా అంతా కలిసే పని చేస్తాం. మోహన్‌బాబు, మేమంతా కలిేస ఉంటాం. ప్రతి రోజు ఒకరి మొహం ఒకరు చూసుకుంటాం. 


ఏకగ్రీవం అనేది తప్పు...

ఎలక్షన్లు ఏకగ్రీవం అన్నదానిలో చాలా తప్పుంది. అలాగైతే దేశం, రాష్ట్రంలో ఎలక్షన్లు ఎందుకు? అన్ని ఏకగ్రీవం చేసేయొచ్చుగా! దేశంలో ఏం జరుగుతుంది అన్నది ఓటర్లకు తెలియాలి. సినిమా ఇండస్ట్రీలో అనుభవం ఉన్న వ్యక్తి ఓ పని చేయడానికి వస్తే ఎదుటి వ్యక్తి ఓ అడుగు వెనక్కి వేయడంలో తప్పులేదని నా అభిప్రాయం. మంచు విష్ణు కూడా ఏదో చేయాలనే కదా వస్తున్నారు. కాబట్టి పోటీ జరిగితేనే బావుంటుంది. నేను కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన వాడినే. అప్పుడు నాకు ఎదురుగా ఎవరూ రాలేదు. పోటీ ఎప్పుడూ మంచిదే! రౌడీయిజం, బెదిరింపులు ఉంటేనే ఏకగ్రీవాలు అవుతాయి. ఎలాంటి ఎన్నికలు జరిగినా ఆయా ప్రాంతాల పార్టీలు ఆరా తీయడం పెద్ద విషయం ఏమీ కాదు. 


కుసంస్కారులు మాటలు పట్టించుకోవద్దు...

నరేశ్‌, మంచు విష్ణు లోకల్‌, నాన్‌ లోకల్‌ గురించి మాట్లాడలేదు. అలా మాట్లాడిన వారి విచక్షణకే వదిలేస్తున్నా. కుసంస్కారులు మాట్లాడిన వాటిని పట్టించుకోవద్దు. ప్రకాశ్‌రాజ్‌ ఎక్కడా చెడ్డగా మాట్లాడలేదు. నేను ‘మా’ మసకబారింది’ అన్నాను. కొన్నాళ్లుగా జరుగుతున్న వివాదాల గురించి అలా అన్నాను. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. దానికి నరేశ్‌ చాలా బాధపడ్డారు. మంచు విష్ణు ఏకగ్రీవం కావాలని కోరుకున్నప్పుడు మిగిలిన వారు పక్కకు తప్పుకొంటే ప్రకాశ్‌ ఏకగ్రీవం అవుతాడు కదా! అందరూ మార్పు కోరుకుంటున్నారు కాబట్టి పోటీ జరిగితే బావుంటుంది. ‘బిల్డింగ్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం బరిస్తాను’ అని విష్ణు అనడం మంచిదే. బిల్డింగ్‌ కట్టేందుకు స్థలం ఎలా ేసకరిస్తారో విష్ణు చెప్పాలి. ఎలక్షన్లకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఇప్పుడు జరిగేది అంతా టీ కప్పులో తుపాను లాంటిది. 


జగన్‌కు అంత తీరిక ఉందా? 

తెలంగాణా ప్రభుత్వం ఎలాంటి సహకారం చేస్తుందనేది ప్రకాశ్‌రాజ్‌ చెబుతాడు. నేను అతను గెలవడానికి సపోర్ట్‌ మాత్రమే చేస్తున్నా. తన ఆలోచనల్ని బయట పెట్టడం కరెక్ట్‌ కాదు. ఇక ఆంధ్రా ప్రభుత్వం విషయానికొస్తే జగన్‌కు ఉన్న వంద తల నొప్పుల మఽధ్య ఆయన తెలుగు ఇండస్ట్రీ బాగోగులపై దృష్టి పెడతారని, ఆ తీరిక ఆయనకు ఉండదని అనుకుంటున్నా. 

Updated Date - 2021-07-16T01:26:53+05:30 IST