‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ
ABN , First Publish Date - 2020-02-02T00:37:35+05:30 IST
‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోగా పరిచయమైన నాగశౌర్య తర్వాత చాలా చిత్రాల్లో నటించిన మంచి గుర్తింపే వచ్చింది కానీ.. ఆశించిన స్థాయి సక్సెస్

బ్యానర్: ఐరా క్రియేషన్స్
నటీనటులు: నాగశౌర్య, మెహరీన్ తదితరులు
నిర్మాత: ఉషా ముల్పూరి
కథ: నాగశౌర్య
దర్శకత్వం: రమణతేజ
సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి
డిజిటల్: ఎంఎన్ఎస్ గౌతమ్
డైలాగ్స్: పరుశురాం శ్రీనివాస్
యాక్షన్: అన్బు, అరివు
‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోగా పరిచయమైన నాగశౌర్య తర్వాత చాలా చిత్రాల్లో నటించిన మంచి గుర్తింపే వచ్చింది కానీ.. ఆశించిన స్థాయి సక్సెస్ మాత్రం దక్కలేదు. అలాంటి సమయంలో ‘ఛలో’ సినిమాలో హీరోగా నటిస్తూ నిర్మించారు. తొలి సినిమాతో సక్సెస్‌ను సాధించాడు. కానీ నిర్మాతగా శౌర్య చేసిన మరో ప్రయత్నం ‘నర్తనశాల’ మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు నాగశౌర్య హీరోగా నిర్మాతగా చేసిన ‘అశ్వథ్థామ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు కథను కూడా నాగశౌర్యనే అందించడం విశేషం. సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశాడు. యాక్షన్ పంథాలో సాగే ఈ సినిమాతో నాగశౌర్యకు ఎలాంటి విజయం దక్కింది. లవర్‌బోయ్ ఇమేజ్ కోసం కాకుండా డిఫరెంట్‌గా చేసిన నాగశౌర్య ప్రయత్నం ఫలించిందా? లేదా? అని తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం...
కథ:
గణ(నాగశౌర్య) అమెరికా నుంచి చెల్లెలి నిశ్చితార్థం కోసం వస్తాడు. పెళ్లికి రెండు రోజుల ఉందనగా ప్రియ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుండగా అడ్డుకుంటాడు. తనకు తెలియకుండానే తాను గర్భవతిని అయ్యానని ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుందని చెల్లెలు చెప్పడంతోఅన్నగా ఆమెకు అండగా నిలబడి కాబోయే బావ(ప్రిన్స్) సాయంతో అబార్షన్ చేయిస్తాడు. తర్వాత వారిద్దరికీ పెళ్లి చేస్తాడు. కానీ అసలు తన చెల్లెలకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటాడు. ఆ క్రమంలో సిటీలో తన చెల్లెలుగా లాగానే కొంత మంది అమ్మాయిలు మాయమవుతున్నారని, వారందరూ మళ్లీ ఇళ్లకు తిరిగి వస్తున్నారని.. అయితే వారు గర్భవతులు అవుతున్నారని తెలుస్తుంది. దాంతో అసలు ఇదంతా చేస్తున్నదెవరు? అనే విషయాన్ని పసిగట్టాలనుకుంటాడు. ఇన్వేస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఇన్వేస్టిగేషన్‌లో ఎలాంటి ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్‌లు చేస్తున్నారనే నిజం తెలుస్తుంది. సిటీలో జరుగుతున్న కిడ్నాప్లకు కారణం ఎవరు? అనే విషయాన్ని గణ ఎలా కనుక్కుంటాడు? అసలు కిడ్నాప్‌లకు కారణమైన వ్యక్తి ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఒకటి ఆరా సినిమాల్లో తప్ప.. ఎక్కువ భాగం సినిమాల్లో లవర్‌బోయ్‌గా కనపడ్డ హీరో నాగశౌర్య తొలిసారి డిఫరెంట్‌గా చేసిన ప్రయత్నం ‘అశ్వథ్థామ’. ప్రస్తుతం ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు అనే కాన్సెప్ట్‌ను తీసుకున్నాడు కానీ.. దానికి ఓ డార్క్ సైకలాజికల్ కాన్సెప్ట్ జోడించి కథను రాసుకున్నాడు. హీరోగానే కాదు.. రచయితగా తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోగా తన లుక్ బావుంది. బాడీకూడా పెంచాడు. సినిమాలో సిక్స్ ప్యాక్ చూపంచలేదు కానీ... సిక్స్ పాక్య్ లుక్ అని చూడగానే మనకు అర్థమయ్యేలా ఉంది. పెర్ఫామెన్స్ పరంగా తను బాగా చేశాడు. ఇక హీరోయిన్ మెహ్రీన్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. పాటలకు పరిమితమైంది. తన పాత్రలో పెర్ఫామెన్స్‌కు స్కోప్ లేదు. పోసాని చిన్న సీన్‌లో కనపడినప్పటికీ తన నటనతో ఆ సీన్‌కు ప్రాణం పోశాడు. ప్రిన్స్ కూడా ఉప్పు చప్పగా ఉండే పాత్రలో కనపడ్డాడు. ఇక హీరో తల్లిదండ్రులుగా జయప్రకాశ్, ప్రగతి కూడా కనిపించి కనపడని పాత్రధారులయ్యారు. హీరో ఫ్యామిలీ మధ్య వచ్చే సన్నివేశాలు మరీ బోరింగ్‌గా ఎప్పుడా సన్నివేశం అయిపోతుందిరా బాబూ అనేలా ఉన్నాయి.
సాంకేతికంగా చూస్తే.. పాటలు బాగాలేవు. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఓకే. మనోజ్ కెమెరా పనితనం బావుంది. ఇక సిస్టర్ సెంటిమెంట్ అని చెప్పుకున్న ఈ సినిమాలో ఒకట్రెండు సీన్స్‌లో బ్రదర్ అండ్ సిస్టర్ సన్నివేశాలుంటాయి. అవి కూడా అంత ఎమోషనల్‌గా అనిపించవు. ఇక ఫ్యామిలీ సీన్స్ గురించి ఇది వరకే అన్నట్లు చెప్పుకోకుండా ఉంటేనే మంచిది. తమిళంలో వచ్చిన నా పేరు తరహాలో డార్క్ పాయింట్‌తో సన్నివేశాలను తెరకెక్కించారు. ఇక మెయిన్ విలన్‌గా నటించిన జుస్సుసేన్ గుప్తా నటన బావుంది. సైకో విలన్‌గా తన నటన ఆకట్టుకుంటుంది. అసలు సినిమాలో కిడ్నాప్‌లు ఎవరు? చేయిస్తారనేదే కీ పాయింట్. అది ఇంటర్వెల్ తర్వాత రివీల్ అయిపోతుంది.. అది కూడా సైకిక్ విలన్ కారణమని తెలిసిపోతుంది. దాంతో సినిమాలో ఉన్న కిక్ పోతుంది. సినిమాలో ఇంటర్వెల్ ముందు వచ్చే అంబులెన్స్ సీన్, ఫైట్ సీన్ చాలా బాగున్నాయి. కాకపోతే ఈ సినిమా లేడీస్ అందరిలో ఇలా కూడా జరగవచ్చు.. అనే ఓ అవగాహనను కల్పించేదిగా అయితే ఉంది. ఒక అమ్మాయి గర్భవతి అవడం.. అది ఎలా జరిగిందో ఆమెకే తెలియకపోవడం అనేది మొదటి భాగంగా ఆసక్తికరంగా ఉంటుంది. తన చెల్లెలి జీవితంలోని ఆ చేదు ఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి హీరో చేసే ప్రయత్నమే అశ్వథ్థామ.
చివరగా... లేడీస్‌కి మంచి మెసేజ్ ఇచ్చిన ‘అశ్వథ్థామ’
రేటింగ్: 2.5/5