చైతూ నోటా... తండ్రి మాటే !

మీడియాను కలిసిన ప్రతీ సినీ సెలబ్రిటీకి ఇప్పుడు మొదటగా ఎదురవుతున్న ప్రశ్న ‘ఏపీలో సినిమా టికెట్స్ తగ్గింపుపై మీ రియాక్షన్ ఏంటి? అని. ఆ రేట్లతో మీ సినిమాకి సమస్య ఉందా లేదా? అంటూ వారికి ఎదురయ్యే ఈ ప్రశ్నకి ఒకొక్కరూ తమ స్పందన ఏంటో తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ‘బంగార్రాజు’ ప్రమోషనల్ ఈవెంట్‌లో నాగార్జున తమ ‘బంగార్రాజు’ సినిమాకి ఏపీలోని టికెట్ రేట్లు సమస్యే కాదని చెప్పి అందరికీ షాకిచ్చారు. అక్కడున్న ధరలతో ‘బంగార్రాజు’ చిత్రానికి ఎలాంటి ఇబ్బంది లేదని నొక్కి వక్కిణించారు. అంతేకాకుండా సినిమా వేడుకల్లో రాజకీయాలు మాట్లాడనని చెప్పి.. ఆ విధంగానూ ఆశ్చర్యపరిచారు. 


ఇక ఇప్పుడు నాగచైతన్య వంతు వచ్చింది. బంగార్రాజు ప్రమోషన్స్ లో భాగంగా మీడియాను కలిసిన చైతూకి సైతం ఇదే ప్రశ్న ఎదురైంది. తన తండ్రి నాగ్ ఏ అభిప్రాయాన్ని అయితే వెలిబుచ్చారో తను కూడా అదే వ్యక్తం చేశాడు. ‘నేను నటుడ్ని మాత్రమే.. ఈ ఇష్యూ గురించి నాకు అంతగా అవగాహన లేదు. నాన్నగారు ఆల్రెడీ సినిమా బడ్జెట్ పరంగా క్లియర్ గా ఒక మాట చెప్పేశారు. ఈ సినిమా బడ్జెట్‌కు ఈ ధరలైతే ఓకే. ఒక వేళ రేట్లు పెరిగే బోనస్’ అంటూ తన స్పందన తెలియచేశాడు. నాగ్ మాటలకు ఆల్రెడీ ఇండస్ట్రీలో దుమారం రేగుతోంది. అందుకే తాను కూడా కామెంట్ చేయడం ఎందుకనుకున్నాడో ఏమో.. తన తండ్రి మాటే తన మాట అన్నట్టుగా చెప్పి.. చైతూ జాగ్రత్తపడినట్టు అర్ధమవుతోంది. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.