‘నాంది’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2021-02-19T19:57:57+05:30 IST

‘నాంది’ మూవీ రివ్యూ

‘నాంది’ మూవీ రివ్యూ

చిత్రం:  నాంది

బ్యాన‌ర్‌:  ఎస్‌.వి2 ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

న‌టీన‌టులు: అల్ల‌రి న‌రేశ్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, హ‌రీశ్ ఉత్త‌మ‌న్, విన‌య్ వ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, ప్ర‌వీణ్‌, దేవీ ప్ర‌సాద్ త‌దిత‌రులు 

ద‌ర్శ‌క‌త్వం:  విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌

నిర్మాత‌:  స‌తీష్ వేగేశ్న‌

సంగీతం:  శ్రీచ‌ర‌ణ్ పాకాల‌

సినిమాటోగ్ర‌ఫీ:  సిద్‌


ఇప్ప‌టి హీరోల్లో కామెడీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అల్ల‌రి న‌రేష్ మ‌ధ్య మ‌ధ్య‌లో కొన్ని డిఫ‌రెంట్ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలో మ‌రోసారి న‌రేష్ చేసిన వైవిధ్య‌మైన చిత్రం నాంది. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా పోస్ట‌ర్స్, టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై అంద‌రిలో ఆస‌క్తిని పెంచింది. అండ‌ర్ ట్రైల్ ఖైదీల గురించిన ఏదో ఎలిమెంట్‌ను ఈ సినిమాలో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించార‌ని అర్థ‌మైంది. అస‌లు కామెడీ సినిమాల‌తో త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్న హీరో న‌రేష్‌.. నాంది సినిమాను ఎందుకు చేశాడు?  న‌రేష్ చేసిన ఈ డిఫ‌రెంట్ సినిమా త‌న‌కు ఎలాంటి గుర్తింపు తెచ్చి పెడుతుంది?  సినిమా, న‌రేష్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందా?  అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో చూద్దాం...


క‌థ‌:  

బండి సూర్య ప్ర‌కాష్‌(అల్ల‌రి నరేష్‌) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. చ‌క్క‌టి కుటుంబంతో హాయిగా ఉంటాడు. మీనాక్షి(న‌వ‌మి)తో పెళ్లి కూడా కుదురుతుంది. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటోన్న సమయంలో పౌర హక్కుల నేత రాజగోపాల్ హత్య కేసులో సూర్యను సీఐ కిషోర్(హరీష్ ఉత్తమన్) అరెస్ట్ చేస్తాడు. తనకే పాపం తెలియదని సూర్య‌ చెప్పినా పోలీసాఫీస‌ర్ కిషోర్‌ వినిపించుకోడు. హత్య చేసినట్లు ఒప్పుకోమ‌ని చావగొడ‌తారు పోలీసులు. అండ‌ర్‌ట్రైల్ ఖైదీగా చంచ‌ల్ గూడ జైలుకి వెళ‌తాడు సూర్య‌. అక్క‌డే ఐదేళ్లే గ‌డిచిపోతాయి. అదే స‌మ‌యంలో లాయ‌ర్ ఆద్య‌(వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌) ఎంట‌ర్ అవుతుంది. సూర్య‌కేసుని టేక‌ప్ చేయ‌డ‌మే కాదు.. పోలీసులు అత‌న్ని కావాల‌నే కేసులో ఇరికించార‌ని నిరూపించి నిర్దోషిగా బ‌య‌ట‌కు తెస్తుంది. బ‌య‌ట‌కు వ‌చ్చి సూర్య అకార‌ణంగా త‌న‌ను కేసులో ఇరికించి త‌న జీవితాన్ని పాడు చేసిన సీఐ కిషోర్‌పై కేసు వేస్తాడు. సెక్ష‌న్ 211లో కేసు వేయడంతో కథ కొత్త మలుపు తీసుకుంటుంది. అసలు సూర్య హత్య చేయకుండానే సీఐ కేసులో ఎందుకు ఇరికించాల‌నుకుంటాడు?  ఇంత‌కీ రాజ‌గోపాల్‌ను ఎవ‌రు హ‌త్య చేస్తారు? క‌థ ఎలాంటి మ‌లుపు తీసుకుంటుంది?  అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే...


విశ్లేష‌ణ‌:

కొన్ని కాన్సెప్ట్ లు రేర్‌గా స్క్రీన్‌ మీదకు వెళ్తాయి. అలాంటి సినిమానే నాంది. ఇప్పటిదాకా సామాన్యుడి దృష్టిలో లేని ఐపీసీ సెక్షన్‌ 211 గురించిన సినిమా ఇది. ఒక వ్యక్తి మీద అన్యాయంగా నేరం మోపిన పోలీసుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని చెప్పే పీనల్‌ కోడ్‌ అది. నాంది సినిమా  ఆద్యంతం  కొత్తగా ఉంది. డైలాగులు ఆలోచింపజేసేలా ఉన్నాయి.  సాఫ్ట్ వేర్‌ ఇంజినీర్‌గా, ఓ అండర్‌ట్రయల్‌ ఖైదీగా ఇంటెన్స్ చూపించారు నరేష్‌. కాస్త ఒళ్లు చేసిన నరేష్‌ని చూడటానికి కొత్తగానే ఉన్నారు. మేకప్‌, కాస్ట్యూమ్స్ సెట్‌ అయ్యాయి. ఇలాంటి సినిమాలకు డబ్బింగ్‌ చెప్పడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. అయినా ఫ్రేమ్‌లో ఇంటెన్సిటినీ తన గొంతుతో పెంచేశారు నరేష్‌. గతంలో మహర్షిలో ఇలాంటి ఇంటెన్స్ ఉన్న కేరక్టరే చేశారు. ఈ సినిమా చూస్తున్నంత సేపూ నరేష్‌  గెడ్డం లుక్‌ మహేష్‌ మహర్షినే గుర్తుచేస్తుంది.  పాటలు కూడా మెలోడీగా ఉన్నాయి. మళ్లీ మళ్లీ పాడుకునేలా లేకపోయినా, సినిమా థియేటర్లో ప్రేక్షకుడికి కాసింత రిలీఫ్‌ ఈ పాటలే. ప్రియదర్శి, ప్రవీణ్‌ ఉన్నప్పటికీ కామెడీని ఎక్స్ పెక్ట్ చేయలేం. నరేష్‌ తల్లిదండ్రుల పాత్రలు, ఆ ఇంటి వాతావరణం కాస్త ఓవర్‌ మెలోడ్రామాలా అనిపించినప్పటికీ, సగటు మిడిల్‌ క్లాస్‌ బంధాలు అలాగే ఉంటాయేమోనని సర్దుకుపోవచ్చు. వరలక్ష్మి శ‌ర‌త్‌క‌మార్‌ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ బావుంది. ఆమె తీసే లా పాయింట్లు కూడా బానే అనిపిస్తాయి. అయితే శ్రీకాంత్‌ అయ్యంగార్‌ని లాయర్‌గా డమ్మీగా చూపించారు. దర్శకుడు విజయ్ కనకమేడల సినిమాను తెరకెక్కించిన తీరు బావుంది. కామెడీ స్టార్ అనే బ్రాండ్ ఉన్న నరేశ్‌తో ఇలాంటి కాన్సెప్ట్ మూవీ చేయాల‌నుకోవడం ప్ర‌శంసించి ద‌గ్గ విష‌యం. సినిమాను వీలైనంత స‌హ‌జంగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు డైరెక్ట‌ర్‌. క‌థ‌లో హీరో క్యారెక్ట‌ర్‌ను ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నంలో అదిరిపోయే ఫైట్స్‌, డాన్సులు, పాట‌లు పెట్టేస్తే అదిరిపోతుంద‌నే ఆలోచ‌న‌తో కాకుండా ఫోక‌స్డ్‌గా త‌ను తీయాల‌నుకున్న పాయింట్‌పై సినిమాను తెర‌కెక్కించిన తీరు బావుంది. శ్రీచర‌ణ్ పాకాల నేప‌థ్య సంగీతం బావుంది. టైటిల్ సాంగ్ బావుంది. సిద్ సినిమాటోగ్ర‌ఫీ కూడా బావుంది. ఎక్స్ హోమ్‌ మినిస్టర్‌ ఇన్వాల్వ్ అయినప్పుడు కేసు అంత వీక్‌గా ఉంటుందా? వ్యవహారం అంత మామూలుగా ఉంటుందా? ఇలాంటి లాజిక్కులు తీయకపోవడమే ఉత్తమం. ఒక జోనర్‌ సినిమాలు నచ్చేవారికి ఈ సినిమా నచ్చొచ్చు. అంతేకానీ, రెగ్యులర్‌గా సరదా కోసమో, ఫ్రెండ్స్, ఫ్యామిలీలతోనూ సినిమాలు ఎంజాయ్‌ చేయాలనుకునేవారికి నాంది పెద్దగా రుచించకపోవచ్చు. 


బాటమ్‌ లైన్‌: సెక్ష‌న్  211 గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి నరేష్ చేసిన‌ కొత్త ప్ర‌య‌త్నం

Updated Date - 2021-02-19T19:57:57+05:30 IST