టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers ) ఒకటి. మహేశ్ బాబు (Maheshbabu) ‘శ్రీమంతుడు’ (Srimanthudu) సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ ఆ తర్వాత పలు సూపర్ హిట్స్‌తో సత్తా చాటుకుంది. సూపర్ స్టార్స్ నుంచి చిన్న హీరోల వరకూ సినిమాలు నిర్మిస్తూ విజయవంతంగా దూసుకుపోతున్న మైత్రీ వారు.. ప్రస్తుతం దాదాపు ఏడు సినిమాల వరకూ నిర్మిస్తున్నారు. ఇటు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నుంచి అటు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) వరకూ సినిమాలు నిర్మిస్తూ.. తమ సామర్ధ్యం ఏపాటిదో చాటిచెబుతోంది. ఈ ఏడాది చిరంజీవితోనూ, మరో సీనియర్ హీరోతోనూ ఏక కాలంలో సినిమాలు నిర్మిస్తూ ప్రత్యేకతను నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ వారు మలయాళ చిత్రపరిశ్రమలోకి కూడా అడుగుపెడుతున్నారు.
మాలీవుడ్ యంగ్ హీరో, ‘మిన్నల్ మురళి’ (Minnal Murali) ఫేమ్ టోవినో థామస్ (Tovino Thomas).. నటిస్తూ తన సొంత నిర్మాణ సంస్థ టోవినో థామస్ ప్రొడక్షన్స్ (Tovino Thomas Productions) బ్యానర్ పై.. డాక్టర్ బిజు (Dr.Biju) తెరకెక్కిస్తున్న చిత్రం ‘అదృశ్య జాలకంగల్’ (Adrishya Jalakangal). ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్.. నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. దీనికి రాధిక లవు (Radhika Lavu) నిర్మాత. ఈ సినిమాకి రెండు సార్లు గ్రామీ అవార్డును అందుకున్న రిక్కీ కెజ్ (Ricky Kej) ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు ట్విట్టర్ వేదికగా అఫీషియల్ గా ప్రకటించారు. మరి ఈ సినిమా సూపర్ హిట్ అయితే మైత్రీ వారు మాలీవుడ్ లో వరుసగా సినిమాలు నిర్మిస్తారేమో చూడాలి.