నా వెన్నెల... నా కలలోకి వచ్చేది!

Twitter IconWatsapp IconFacebook Icon
నా వెన్నెల... నా కలలోకి వచ్చేది!

ఒక్క సినిమాతో చిత్రసీమ మొత్తం చటుక్కున తనవైపు తిప్పుకొనేలా చేశాడు వేణు ఉడుగుల.‘నీదీ నాదీ ఒకే కథ’... ఈ దర్శకుడి స్థాయి, సామర్థ్యాలకు అద్దం పట్టింది. ఇప్పుడు ‘విరాటపర్వం’తో ప్రేమనీ, ఉద్యమాన్నీ ఏకం చేశాడు. ‘‘నేను ప్రపంచాన్ని ఉద్ధరించడానికి సినిమాలు చేయను. నన్ను నేను తెలుసుకోవడానికే తీస్తా’’ అని సినిమాపై సరికొత్త దృక్కోణాన్ని ఆవిష్కరించిన నవతరం దర్శకుడు వేణుతో ‘నవ్య’ భేటీ వేసింది.


ఈరోజు ప్రపంచ పర్యావరణ దినత్సవం. అడవుల్లో  చిత్రీకరిస్తున్న సమయంలో మీకు ఎదురైన అనుభవాలేంటి?   

అడవి అనేది విరాటపర్వంలో ఓ కీలకమైన పాత్ర. అడవిలోని మార్మిక సౌందర్యం ఈ కథలో ఉంటుంది. అదే ఈ కథకు ఆయువు పట్టు. ఈ సినిమా కోసం చాలా అడవులు చూశాం. వెళ్లిన ప్రతీచోటా.. వాటర్‌ బాటిళ్లు.. బీర్‌ బాటిళ్లూ కనిపించాయి. ముందు వాటన్నింటినీ క్లీన్‌ చేసి, మా పని ప్రారంభించాం. రానా, సాయి పల్లవితో సహా యూనిట్‌లోని అందరూ తలోచేయి వేసి, అడవిలోని చెత్తంతా ఏరేశాం. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. కొత్తగా మొక్కలు నాటకపోయినా ఫర్వాలేదు. ఉన్నవాటిని సంరక్షించుకోవడమైనా తెలిసి ఉండాలి. 


నీది నాదీ ఒకే కథ, విరాటపర్వం రెండూ బరువైన కథలే. మీ కెరీర్‌ ప్రారంభంలోనే ఇంత బరువు మీ భుజాలపై వేసుకొని నడవడం కష్టమనిపించలేదా?

నేను వరంగల్‌ జిల్లాలోని ఉప్పరపల్లి అనే చిన్న పల్లెటూరిలో, మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలో పుట్టా. ఆ చోటు.. అనేక ఉద్యమాలకు వేదిక. రాజకీయ ప్రయోగశాల. అక్కడ జరిగిన నక్సల్‌ మూమెంట్స్‌, అస్థిత్వ ఉద్యమాలు దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. తెలంగాణలో కట్టెపుల్లని పట్టుకొన్నా కవిత్వం చెబుతుంది. నేను పుట్టి పెరిగిన వాతావరణం, నేను చూసిన, కలిసిన మనుషులు.. ఇవే నాకు ఓ దారిని చూపాయి. నేను ఎలాంటి సినిమాలు తీయాలనే విషయంపై ఓ దృక్పథం ఏర్పడేలా చేశాయి. మన ఆలోచనలు, మన టెంపర్‌మెంటే మన సినిమా. ఇలాంటి కథలే చెప్పాలనుకొన్నా.. చెబుతున్నా. అంతే.


‘నాదీ నీదీ ఒకే కథ’ మీకో విజిటింగ్‌ కార్డ్‌లా ఉపయోగపడిందా?

నేను పదిమందికీ తెలియడానికి ఆ సినిమా చాలా దోహదం చేసింది. ‘మార్కెట్‌లోకి ఓ దర్శకుడు వచ్చాడు. కమర్షియల్‌ సినిమానీ బాగా హ్యాండిల్‌ చేయగలడు’ అనే నమ్మకం కల్పించింది. నా తొలి సినిమా విడుదల కాకముందే.. ‘విరాటపర్వం’ అవకాశం వచ్చింది. 


ఈ రెండు సినిమాలకూ పురిటి నొప్పులు తప్పలేదు కదా?

ఏ సినిమాకి ఆ సినిమానే. ప్రతీసారీ ఓ కొత్త ప్రయాణమే. ‘నా బాధ నాదైన పద్దతిలో చెప్పాలి’ అని తపనపడే ప్రతీ దర్శకుడూ ఇలాంటి పురుటి నొప్పులు పడాల్సిందే. 


అలాంటప్పుడు ‘హాయిగా కమర్షియల్‌ పాయింట్‌ ఎత్తుకుంటే బాగుండేది’ అనిపించిందా?

మనం ఎంచుకునే కథా వస్తువుకీ, బడ్జెట్‌కీ కొంత సమతుల్యత కుదురుతున్న రోజులివి. ఇది వరకు ఏ కాన్సెప్టూ లేకపోవడం కమర్షియల్‌ అయితే, ఇప్పుడు కాన్సెప్టు ఉంటేనే కమర్షియల్‌. ఫిల్మ్‌ మేకింగ్‌లో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఓటీటీ ప్రభావం విపరీతంగా పడింది. మామూలు, నేల క్లాసులో, కమర్షియల్‌ సినిమాలు చూసుకునేవాళ్లకు కూడా.. వరల్డ్‌ సినిమా అంటే ఏమిటో అర్థమైంది. తీసే వాడికి సినిమాపై ఎంత అవగాహన, పరిజ్ఞానం ఉందో, చూసేవాడికీ అంతే ఉంది. ఏది పడితే అది తీసి ‘ఇది కమర్షియల్‌ సినిమా’, ‘ఇది ఆర్ట్‌ సినిమా’ అని చెబితే ఎవరూ నమ్మరు. విభిన్నమైన కథ చెబితే తప్ప జనం చూడరు. ఈ పరిణామం రావడం వల్ల నాలాంటి దర్శకులకు మంచి రోజులు వచ్చాయి. 


మీరు స్వతహాగా కవిత్వం రాస్తారు. కవిత్వం వస్తే.. సినిమా డైలాగుల మీటర్‌ సులభంగా అర్థం అవుతుందా?

నా సినిమాని సాహిత్య స్థాయికి తీసుకెళ్లాలి అని తపన పడుతుంటా. అర్థవంతమైన సంభాషణల్ని రాయడానికి ఇష్టపడతా. భాష ఎంత సరళంగా ఉంటే అంత బాగుంటుంది. డైలాగుల్లోనే కాదు. విజువల్స్‌లోనూ పొయెట్రీ చూపించడం నాకు ఇష్టం. కవిత్వం రాసేవాళ్ల మాటలకు, కవిత్వం అంటే తెలియని రచయితల సంభాషణలకు చాలా తేడా ఉంటుంది. ఆ పరిమళం తెలిసిపోతుంది. స్పష్టత, గాఢత, క్లుప్తత.. ఇవన్నీ కవిత్వంలో ఉంటాయి. అవన్నీ తెలియకుండానే డైలాగుల్లో కూడా కనిపిస్తాయి.


వేటూరిగారి దగ్గర శిష్యరికం చేశారట కదా?

ఏదో కొద్ది రోజులంతే. నా స్నేహితుడు వేటూరి గారి దగ్గర సహాయకుడిగా పనిచేసేవాడు. వాడు ఊరెళ్తూ.. తన బాధ్యత కొన్ని రోజుల పాటు నాకు అప్పగించాడు. ఆయన పాట చెబుతూ ఉంటే, నేను రాసేవాడ్ని. నాకు చిన్నప్పటి నుంచీ కవుల్ని, ఉద్యమకారుల్ని కలవడం ఓ హాబీగా ఉండేది. అలా.. వేటూరి గారిని కలవాలనుకొన్నా. వేటూరిగారు చనిపోయినప్పుడు ఓ కవిత రాశా. అది ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైంది.  


పలాస, జైభీమ్‌ లాంటి సినిమాలు బాగా ఆడాయి. కొత్త దర్శకులకు, అణగారిన మనుషుల కథని చెప్పాలనుకునేవాళ్లకు ఈ విజయాలు ఎంత ఊతం ఇచ్చాయి?

రెండేళ్ల కాలంలో సినిమా అనేది చాలా మారింది. ఇప్పటి వరకూ ఎవరూ చెప్పలేని, రాయలేని కథలు, మనుషుల జీవితాలు తెరపైకి వస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లోంచి, అన్ని కులాల్లోంచి, అన్ని జీవితాల్లోంచి కథకులు, దర్శకులు రావాలి. అప్పుడే అందరి జీవితాలూ తెరపైకొస్తాయి. అప్పుడు తెలుగు సినిమా మరింత వర్థిల్లుతుంది.

అన్వర్‌


‘‘చిన్నప్పుడు క్లాస్‌ రూమ్‌లో పాఠాలకంటే, బయట ఉండే ప్రపంచంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. బొమ్మలు బాగా గీసేవాడ్ని. భాగవతం, ఒగ్గు కథ చెబుతుంటే భలే ఎంజాయ్‌ చేసేవాడ్ని.  కవిత్వం రాయడం, కథలు రాయడం మొదలెట్టా. నా కథ ఒకటి పత్రికలో ప్రచురితమైంది. అప్పట్లో త్రిపురనేని సాయిచంద్‌ గారి దగ్గర అసిస్టెంట్‌గా చేసేవాడ్ని. ఆ కథ చూసి నన్ను మదన్‌ గారి దగ్గర పంపించారు. 2005లో పూర్తిగా డిజిటలైజ్డ్‌ అవ్వలేదు. ఇప్పుడు ఫోన్లలో షార్ట్‌ ఫిల్మ్‌, సినిమాలూ తీసేస్తున్నారు గానీ, అప్పుడు ఫిల్మ్‌ ఉంది. కాబట్టి మన ప్రతిభ నిరూపించుకోవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు రాయడం మానేశా. నా ప్రతీ ఎక్స్‌ప్రెషన్‌ సినిమా చుట్టూనే తిరుగుంది’’.‘‘నేను విరాటపర్వం కథ రాస్తున్నప్పుడే కథానాయిక పాత్రకు వెన్నెల అని పేరు పెట్టా. అప్పుడప్పుడూ ఆ పాత్ర నాకు కలలో కనిపిస్తుండేది. సాయి పల్లవి రూపంలో. అప్పుడే ఈ కథ సాయి పల్లవితోనే చేద్దామని ఫిక్సయ్యా. ఆమెకు ఈ కథ నచ్చడం, వెంటనే ఓకే చెప్పడం అదృష్టంలా భావిస్తా. నిజాయతీతో ఓ కథ రాస్తే.. తనకు కావల్సినవి ఆ కథే సమకూర్చుకుంటుంది. విరాటపర్వం విషయంలో అదే జరిగింది. నందితా దాస్‌ పదేళ్లుగా కెమెరాముందుకే రాలేదు. అలాంటిది ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు. రానా, ప్రియమణి, ఈశ్వరీరావు, నవీన్‌ చంద్ర.. వీళ్లంతా కథని నమ్మే ఈ సినిమా చేశారు’’

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.