‘మా’ కోసం ఇళయరాజాతో కచేరి పెట్టిస్తా: ప్రకాశ్ రాజ్

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (‘మా’) ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ‘మా’ సభ్యులందరికీ విందులు, సన్మానాలతో ప్రచారం మొదలు పెట్టాయి రెండు ప్యానళ్లు. అక్టోబర్ 10న జరగనున్న ‘మా’ ఎన్నికలలో  సిని‘మా’ బిడ్డలం ప్యానల్‌ నుంచి అధ్యక్షుడిగా ప్రకాశ్‌ రాజ్‌ బరిలోకి దిగుతున్నారు. ఆయన తాజాగా ‘మా’ మెంబర్స్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ అభివృద్దికి తన దగ్గరున్న ప్రణాళికను ప్రకాశ్ రాజ్ తెలియజేశారు. ‘మా’ ఎన్నికలలో గెలిచిన 6 నెలల్లో రూ. 10 కోట్ల ‘మా’ వెల్ఫేర్ ఫండ్‌ని క్రియేట్ చేయడమే తన ధ్యేయంగా ప్రకాశ్ రాజ్ ఈ సమావేశంలో తెలిపారు. దీని కోసం తన దగ్గర అనేక మార్గాలున్నాయని, ‘మా’ కోసం మేస్ట్రో ఇళయరాజాతో కన్సర్ట్ కూడా చేయిస్తానని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. 


ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎలక్షన్స్ వస్తుంటే భయమేస్తోంది. ఈ పక్కన నుంచుంటే వాడు ఏమంటాడో.. ఆ పక్కన నుంచుంటే వీడు ఏమంటాడో అని చిన్న ఆర్టిస్ట్‌లందరూ భయపడిపోతున్నారు. ఇక్కడ 100 మంది ఉన్నారు.. ఇంకో 100 గుండెలు నాతోనే ఉన్నాయని నాకు తెలుసు. భయపడుతున్నారంతే. నాకు ఎవరితో శత్రుత్వం పెట్టుకోవాలని లేదు. అందుకే వారితో చెప్పాను.. మనస్సాక్షితో వినండి. అక్కడ కూడా ఏం చెబుతున్నారో వినండి. అక్కడ కూడా మాట్లాడండి. ఎందుకంటే నా ఫ్రెండ్ అని ఓటు వేయకండి. ప్యానల్ చూడండి.. పది మందిని చూడండి. ఎందుకంటే ఉన్న సమస్యలన్నింటిని ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తున్నాడో.. ఆ దారి చూడండి.


మన ఫస్ట్ రూల్.. నేను గర్వంగా చెబుతున్నాను.. గెలవగానే 6 నెలల్లో ఫస్ట్ మేము క్రియేట్ చేసేది ‘మా’ వెల్ఫేర్ ఫండ్ రూ. 10 కోట్లు. ఇవ్వడానికి మనుషులు రెడీగా ఉన్నారు. దారులు మాకు తెలుసు. ఆల్రెడీ ఇళయరాజాగారితో మాట్లాడాను. డిసెంబర్‌లో ‘మా’ కోసం ఆయన పోగ్రామ్ చేస్తున్నాడు. ఆయన దగ్గరకి వెళ్లి గురువుగారూ.. ప్రోగ్రామ్ అనగానే.. ‘ఏయ్ ప్రకాశ్.. చేస్తా.. నువ్వు అడిగితే ఎందుకు చేయను’ అన్నారు. 3 కోట్లు ఛార్జ్ చేస్తారంట కదా మీరు? అని అడిగా. ‘అవును.. అవుద్ది కదా..’ అన్నారు. అంత ఇవ్వను కదా నేను అన్నాను. ‘మరి ఎంత ఇస్తావ్..’ అన్నారు. తగ్గించండి అన్నా. ‘అలా అయితే నాకు ఒక కోటి ఇవ్వు..’’ అన్నారు. కోటి ఎందుకు అవుతుందండి? అన్నా. ‘అలా కాదు చిత్ర మేడమ్, హరిహరన్.. వంటి సింగర్స్ అందరూ రావాలి కదా..’ అన్నారు. వెంటనే ఆయన ముందే వారికి ఫోన్ చేశా. ప్రకాశ్ రాజ్ నువ్వు ప్రోగ్రామ్ అంటే మేము ఎందుకు చేయం. తప్పకుండా చేస్తాం. అన్నారు. ఏ దేవిశ్రీ ప్రసాద్‌ని అడిగితే పాట పాడడా? ఇళయరాజాగారు వస్తున్నారంటే.. కీరవాణి వారు ఆర్టిస్ట్‌ల తరపున నిలబడి ఆయనను స్వాగతించరా? ఇళయరాజాగారు, ప్రకాశ్ రాజ్‌గారు ప్రోగ్రామ్ చేస్తున్నారని.. ఈ స్టేట్ సీఎం తన ఇంట్లో లంఛ్‌కి పిలవరా? ప్రతి తెలుగు వాడూ.. ‘మా’ అసోసియేషన్ ఎంత గొప్పగా ఇళయరాజా పాటలతో డబ్బులు సంపాదిస్తుంది.. తన మెంబర్స్ కోసం అని.. అందరి ముఖంలో నవ్వును తీసుకురాలేమా మనం? తప్పకుండా మనం చేయగలం.


దీనికి ఏ జాతో, ఏ కులమో, లోకలో, నాన్ లోకలో.. అని వాగే వాడు వాగుతూనే ఉంటాడు. ఎవరైనా ఇలా వాగుతుంటే నేను స్పందించను. ఎందుకంటే.. లోపల ఉంటేనే కదా.. బయటికి వచ్చేది. రానివ్వండి.. మొత్తం కక్కనివ్వండి అని వదిలేస్తాను. మనిషి ప్రవర్తనని, మనిషి మాట్లాడే మాటల్ని జనాలు చూస్తుంటారు. డెసిషన్ తీసుకునేటప్పుడు తీసుకుంటారు. ఇదేమీ యుద్ధం కాదు. ఇక్కడున్న సమస్యలను పరిష్కరించడానికి ఎన్నో దారులు ఉన్నాయి. వాటిని వెతుక్కుందాం. ఇది నేను ఒక్కడిని చెప్పింది కాదు. ఇన్ని రోజులుగా శ్రీకాంత్, బెనర్జీ, అనిత, హేమ.. ఇలా అందరితో ‘మీరేం చేశారు.. మనం ఏం చేద్దాం..’ అని మాట్లాడుకుంటున్నాం. వాళ్లు వేరే వేరే రాజకీయాలు క్రియేట్ చేస్తుంటే.. మేము ఒక ఆఫీస్ క్రియేట్ చేసి.. వంట చేసుకుంటూ ‘మా’ అభివృద్ది గురించే మాట్లాడుకుంటున్నాం. అందుకే ఎటువంటి పేపర్ లేకుండా నేను మాట్లాడగలుగుతున్నాను..’’ అని అన్నారు.  

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.