సినిమాలు... వ్యాపారం.. సూపర్‌హిట్‌

వెండితెరను ఏలుతున్న కథానాయికలు వ్యాపారాల్లోకి అడుగుపెట్టి రాణిస్తున్నారు. తమకు ఆసక్తి, అభిరుచి ఉన్న రంగాల్లో వ్యాపారాలు మొదలుపెడుతున్నారు. సినీ కెరీర్‌ను వ్యాపార బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ సక్సెస్‌ అవుతున్నారు. 


వీరి వ్యాపారం బంగారం

గ్లామర్‌ తారగా వెండితెరను ఏలుతున్నారు  తమన్నా. ప్రస్తుతం ఆమె సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో తీరిక లేకుండా ఉన్నారు. మూడేళ ్ల క్రితమే తమన్నా ఆన్‌లైన్‌లో నగల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ‘వైట్‌ అండ్‌ గోల్డ్‌’ పేరుతో సొంత బ్రాండెడ్‌ ఆభరణాలను విక్రయిస్తున్నారు. ఒకప్పటి ప్రపంచ సుందరి బాలీవుడ్‌ కథానాయిక సుస్మితాసేన్‌ దుబాయ్‌లో జ్యువెలరీ షాపును నడుపుతున్నారు. నిర్వహణను సోదరుడికి అప్పగించారు. పెళ్లి అయ్యాక కూడా క్రేజ్‌ తగ్గని హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. ప్రస్తుతం అగ్ర హీరోల సరసన నటిస్తున్నారు. తనకు ఇష్టమైన నగల వ్యాపారాన్ని ఆమె ప్రారంభించారు. ‘మార్సాలా’ పేరుతో బ్రాండెడ్‌ ఆభరణాలను విక్రయిస్తున్నారు. సోదరి నిషా అగర్వాల్‌కు వ్యాపార బాధ్యతలను ఆమె అప్పచెప్పారు. 


ఆతిథ్యం అదిరింది 

ఆరోగ్యానికి మించిన సంపద ఏముంది. అందుకే ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే ఆలోచనతో వ్యాపారాన్ని మొదలుపెట్టారు కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్‌. గతేడాది ఆమె చెన్నైలో ‘ఫర్‌ సే’ పేరుతో ఓ రెస్టారెంట్‌ ఏర్పాటు చేశారు. అందులో పలు రకాల ఆహారపదార్థాలతో పాటు ఆరోగ్యకరమైన సలాడ్లను అందిస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేస్తున్నారు. తెలుగులో తక్కువ చిత్రాల్లోనే నటించినా చక్కని గుర్తింపు సొంతం చేసుకున్నారు కథానాయిక ప్రణీతా సుభాష్‌. ఇటీవలె వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల క్రితమే ఆమె రెస్టారెంట్‌ బిజినెస్‌ ప్రారంభించారు. బూట్‌ లెగ్గర్‌ పేరుతో బెంగళూరులో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఫిట్‌నెస్‌ మంచి బిజినెస్‌

బాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తున్నారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. కెరీర్‌ ప్రారంభం నుంచి ఒకే తరహా ఫిజిక్‌ను మెయింటైన్‌ చేస్తూ అబ్బురపరుస్తున్నారు . దానికి కారణం ఆమెకు ఫిట్‌నెస్‌పై ఉన్న ఆసక్తే. తనకు ఇష్టమైన ఫిట్‌నెస్‌ రంగంలో వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఎఫ్‌ 45 పేరుతో పలు నగరాల్లో ఫిట్‌నెస్‌ సెంటర్లు ప్రారంభించి వ్యాపారంలోనూ సక్సెస్‌ను అందుకున్నారు. బాలీవుడ్‌లో ఒకప్పటి అగ్ర కథానాయిక శిల్పాశెట్టి యోగా శిక్షకురాలిగానూ మంచి గుర్తింపు పొందారు. యోగా, ఫిట్‌నెస్‌, స్పా వ్యాపారాల్లో అడుగుపెట్టారు. ముంబైలో చైన్‌ ఫిట్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌ యోగా పాఠాలను బోధిస్తున్నారు.మరిన్ని నగరాలకు తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో శిల్పా బిజీగా ఉన్నారు.  


వస్త్ర వ్యాపారంలోకి 


ఒకప్పటి టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ ఇలియానా పూర్తిగా బాలీవుడ్‌కు షిఫ్టయ్యారు. ఫ్యాషన్‌పై మంచి మక్కువ ఉన్న తార కావడంతో ఆ రంగంలోనే వ్యాపారాన్ని చేపట్టారు. ఫ్యాషన్‌ దుస్తుల స్టోర్‌ను ప్రారంభించారు. లాక్‌డౌన్‌ ఎత్తేశాక ఇతర రంగాల్లోనూ తన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆమె సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో అగ్రకథానాయికగా కొనసాగుతున్నారు సమంత. గతేడాది ఆమె సాకీ అనే బ్రాండ్‌తో మహిళల ఫ్యాషన్‌ వస్త్రాల విక్రయాన్ని ప్రారభించారు. ఎన్నాళ్ల నుంచో కంటున్న కల సాకీ ఏర్పాటుతో నెరవేరిందని సమంత భావోద్వేగంతో ఓ సందర్భంలో  చెప్పారు. ఆమె హైదరాబాద్‌లో ఓ ప్రీ స్కూల్‌ను కూడా నడుపుతున్నారు. వెడ్డింగ్‌ ఫ్యాక్టరీ


బాలీవుడ్‌లో కథానాయికగా ఫుల్‌ బిజీగా ఉన్నారు తాప్సీ. తన సోదరి, స్నేహితురాలితో కలసి ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారాన్ని ప్రారంభించారు. దీనికి వెడ్డింగ్‌ ఫ్యాక్టరీ అని పేరుపెట్టారు. కొన్నేళ్లపాటు టాలీవుడ్‌లో అగ్రకథానాయికగా కొనసాగారు శ్రియ. సినిమాలు చేస్తూనే సొంత వ్యాపారంపై పోకస్‌ పెట్టారు. ముంబైలోని అంధేరిలో బ్యూటీపార్లర్‌, స్పాను ప్రారంభించారు. సినిమాల్లో నటిస్తూనే వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. సినిమాలతో పాటు వ్యాపారంపైనా కాన్సంట్రేట్‌ చేస్తూ కెరీర్‌లో ముందుకెళుతున్నారు అమలపాల్‌. థింక్‌ బిగ్‌ పేరుతో చెన్నైలో ఫిల్మ్‌స్టూడియోను ఆమె ప్రారంభించారు. బాలీవుడ్‌ కథానాయిక లారాదత్తా కొన్నేళ్లుగా సొంతంగా సినిమా ప్రొడక్షన్‌ హౌస్‌ను నడుపుతున్నారు.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.