కోలీవుడ్ః శునకం ప్రధాన ఇతివృత్తంగా అనేక సినిమాలు వచ్చాయి. హీరో శిబిరాజ్ నటించి, నిర్మించిన చిత్రం ‘నాయిగళ్ జాగ్గిరతై’ మంచి విజయాన్ని సాధించింది. ఇపుడు శునకాన్ని కేంద్రంగా చేసుకుని ‘అన్బుళ్ళ గిల్లి’ అనే చిత్రం నిర్మితం కానుంది. కొత్తగా పరిచయమవుతున్న రామలింగం శ్రీనాథ్ కథను సమకూర్చి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రేయ రాజశేఖర్, తుషారా విజయన్, శాంతిని తమిళరసన్, మైమ్ గోపి, ఆషిక్, నాంజిల్ విజయన్, ఇళవరసు, పూ రాము, ఇందుమతి, శ్రీరంజని, బేబి కీర్తిక తదితరులు ఈ చిత్రంలో నటించారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు శ్రీనాథ్ మాట్లాడుతూ.. ‘‘మనిషికి నిజమైన స్నేహితుడుగా, విశ్వాసంగా ఉండే మూగజీవాల్లో శునకం ఒకటి. మనిషికి - శునకాల మధ్య వెయ్యేళ్ళ అనుబంధం ఉంది. కుక్క సాధారణ జంతువు మాత్రమే కాదు. ఇంటి రక్షకభటుడు. ప్రతి ఒక్కరి ఇంటిలో శునకం ఒక కుటుంబ సభ్యుడుగా ఉంటుంది. అలాంటి శునకాలతో మనిషికి ఉన్న అద్భుతమైన బంధాన్ని తెలియజెప్పే చిత్రం ఇది. శునకాలను ప్రధానంగా చేసుకుని గతంలో వచ్చిన చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా వుంటుంది’’ అని తెలిపారు. రైజ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, మాస్టర్ చానెల్, శ్రీనిధి సాగర్, ఈ. మాలా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈనెల 3వ తేదీన సినీ సెలెబ్రిటీలు సునీల్ శెట్టి, ఐశ్వర్య రాజేష్, సూరిలు విడుదల చేయగా.. సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది.