ఆన్‌లైన్‌లో అమ్మకానికి సినిమా

ABN , First Publish Date - 2021-09-26T05:16:59+05:30 IST

టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌... సినిమా పరిశ్రమ ఏదైనా పైరసీ కామన్‌గా మారింది. దీర్ఘకాలిక వ్యాధిలాగా ఇన్నాళ్లూ చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ ఇప్పుడు ఓటీటీ వేదికల రాకతో విశ్వరూపం దాల్చింది. కొత్త సినిమాల ఒరిజినల్‌ క్వాలిటీ ప్రింట్‌లు పైరసీ సైట్లలో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో అమ్మకానికి సినిమా

టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌... సినిమా పరిశ్రమ ఏదైనా పైరసీ కామన్‌గా మారింది. 

దీర్ఘకాలిక వ్యాధిలాగా ఇన్నాళ్లూ చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్న  పైరసీ ఇప్పుడు  ఓటీటీ వేదికల రాకతో విశ్వరూపం దాల్చింది. కొత్త సినిమాల ఒరిజినల్‌ క్వాలిటీ ప్రింట్‌లు పైరసీ సైట్లలో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

కొన్ని సార్లు సినిమాలు విడుదలవకుండానే పైరసీ బారిన పడుతున్నాయి. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ లాంటి

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వేదికగా సినిమాలను అమ్మకానికి పెట్టి నిర్మాతలు,

ఓటీటీ వేదికలకు పైరసీదారులు సవాల్‌ విసురుతున్నారు.  


రిలీజయిన గంటలోనే పైరసీ కాపీ

నితిన్‌, నభా నటేష్‌ జంటగా నటించిన ‘మాస్ట్రో’ చిత్రం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో రిలీజయిన కొన్ని గంటల్లోనే  చాలా సన్నివేశాలు లీకయ్యి సోషల్‌ మీడియాలో కనిపించాయి. అంతేకాకుండా హెచ్‌ డి క్వాలిటీతో సినిమా పైరసీ కాపీలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. గతంలో నితిన్‌ నటించిన ‘భీష్మ’ సినిమా ఓ వైపు థియేటర్లలో ఆడుతుండగానే పైరసీ బారిన పడింది. తెలంగాణ ఆర్‌టీసీకి చెందిన సూపర్‌ లగ్జరీ బస్సుల్లో ‘భీష్మ’ సినిమాను ప్రసారం చేశారు. అలాగే నిఖిల్‌ నటించిన ‘అర్జున్‌ సురవరం’ సినిమాను కూడా అప్పట్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రసారం చేశారంటూ నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఎస్‌ ఆర్‌ కల్యాణ మండపం’ సినిమా పైరసీ కాపీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. 


బాలీవుడ్‌లో నాలుగు రోజులు ముందే...

కృతీసనన్‌ ముఖ్య భూమిక పోషించిన హిందీ చిత్రం ‘మిమి’ నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలకావాల్సి ఉంది. వారం పది రోజుల ముందు నుంచి చిత్రబృందం ప్రమోషన్‌ వర్క్‌ నిర్వహిస్తోంది. అయితే ఓటీటీలో విడుదలకు నాలుగు రోజుల ముందే సోషల్‌ మీడియాలో సినిమా లీకయ్యింది. ‘మిమి’ సినిమా పైరసీ ఫుల్‌ హెచ్‌డికాపీ ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో సినిమాను తొలగించేందుకు ప్రయత్నించినా కూడా అప్పటి కే వందలసంఖ్యలో డౌన్‌లోడ్‌లు అయ్యాయి. ఇక ఫలితం లేదని భావించి సినిమా విడుదలను ముందుకు జరిపి,  నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ చేశారు.  


పైరసీ చేసేవాళ్లకు సోషల్‌ మీడియా బాగా ఉపయోగపడుతోంది. పైరసీని కూడా కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘రాధే’ చిత్రం పైరసీ కాపీని ఏకంగా రూ. 50కు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టారు. ఈ సినిమాను కొన్న జీ ఎంటర్టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ విషయమై  ముంబై సైబర్‌ సెల్‌లో ఫిర్యాదు చేసింది. అలాగే కరోనా తర్వాత సినిమా హాళ్లకు మంచి ఊపు తేవాలనే మంచి ఉద్దేశ్యంతో అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘బెల్‌బాటమ్‌’ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేశారు. ఓటీటీ ఆఫర్‌ను  కూడా వదులుకున్నారు. విడుదలైన రోజే ‘బెల్‌ బాటమ్‌’ పైరసీ అయింది. హెచ్‌డి క్వాలిటీ ప్రింట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి సిద్ధంగా అందుబాటులోకి తెచ్చారు. పైరసీ లింక్‌లు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. ఇదే బాటలో ‘షేర్షా’, ‘ఏకే వర్సెస్‌ ఏకే’, ‘తుపాన్‌’, ‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’, ‘రూహీ’ లాంటి పలు బాలీవుడ్‌ చిత్రాలు డిజిటల్‌ రిలీజ్‌కు ముందు, తర్వాత పైరసీ సైట్లలో అప్‌లోడ్‌ చేశారు. 


కొన్ని హాలీవుడ్‌ చిత్రాలు విదేశాలతో పాటు ఇండియాలో ఏకకాలంలో విడుదలవుతున్నాయి. మరికొన్ని కొంత విరామం తర్వాత ఇండియాలో విడుదలవుతున్నాయి. విదేశాల్లో ఈ చిత్రాలు విడుదలైన నిమిషాల వ్యవధిలోనే  ఇండియాలో పైరసీ కాపీలు అందుబాటులోకి వస్తున్నాయి. ‘బ్లాక్‌ విడో’, ‘క్రూయెల్లా’ చిత్రాలు ఇండియాలో  విడుదలవడానికి ముందే పైరేటెడ్‌ వెబ్‌సైట్లలో అందుబాటులోకి వచ్చాయి. 


ఓటీటీ పైరసీకి అడ్డా

కొన్ని సందర్భాల్లో పైరసీతో సంబంధం లేకుండా, యూనిట్‌ సభ్యుల అత్యుత్సాహం వల్ల సినిమాలు లీకైన సందర్భాలు ఉన్నాయి. వాటిని మినహాయిస్తే థియేటర్లలోనే సినిమా ఎక్కువగా పైరసీకి గురయ్యేది. . ఇప్పుడు ఓటీటీలు పైరసీకి అడ్డాలుగా మారుతున్నాయి. కొత్త సినిమాలు విడుదలవడమే ఆలస్యం పైరసీ చేస్తున్నారు. ఓటీటీల్లో వచ్చే సినిమాలను పైరసీ చేయడం చాలా సులువు అవడమే దానికి కారణం. చాలా ఓటీటీ వేదికలు డీఆర్‌ఎం ప్రొటెక్షన్‌ వ్యవస్థను వాడుతున్నాయి. పైరసీదారులు స్ర్కీన్‌ రికార్డింగ్‌తో పాటు కొన్ని టూల్స్‌ను ప్రత్యేకంగా రూపొందించి డీఆర్‌ఎంను ఛేదిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు ఇది పెద్ద కష్టమైన విషయం కాదని చెపుతున్నారు. గతంలో థియేటర్లలో రికార్డు చేసిన పైరసీ కాపీల నాణ్యత నాసిరకంగా ఉండేది. దాంతో ప్రేక్షకులు వాటిని చూసేందుకు ఆసక్తి చూపేవారు కాదు. ఓటీటీలో సినిమాలు విడుదలైన వెంటనే హై క్వాలిటీ వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి, పైరసీ సైట్లలో అప్‌లోడ్‌ చేస్తుండడంతో ప్రేక్షకులు వాటిపట్ల  ఆకర్షితులవుతున్నారు. 


నిర్మాతలకు లాభం

ఓటీటీకి ఏకమొత్తంగా సినిమాను అమ్మడం ద్వారా నిర్మాతలు లాభ పడుతున్నారు. ఒక్కసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు సినిమాను అమ్ముకుంటే ఆ తర్వాత పైరసీ అయినా నిర్మాతకు పోయేదేం లేదు. ఆ బాధలేవో ఓటీటీ సంస్థ పడుతుంది. అదే  థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు మాత్రం పైరసీ సమస్య ఇబ్బంది పెడుతోంది.  మంచి క్వాలిటీతో పైరసీ వీడియోలు దొరుకుతుండడంతో వాటికి అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం తగ్గిస్తున్నారు.  మంచి టాక్‌ వచ్చిన సినిమాకు రిపీట్‌ ఆడియన్స్‌ లేకుండా అవుతోంది. 


ఎవరు కారణం?

కొన్నిసార్లు చిత్రయూనిట్‌ సభ్యులు పైరసీకి కారణం అవుతున్నారు. మరికొన్ని సార్లు ఓటీటీ సంస్థ సిబ్బంది కారణం అవుతున్నారు. అలాగే తమిళ్‌ రాకర్స్‌, ఫిల్మీవాప్‌, తోప్‌టీవీ లాంటి పలు పైరసీ మూవీ వెబ్‌సైట్లు యథేచ్చగా కొత్త సినిమాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తూ ఆర్జిస్తున్నాయి.


చట్టాలు ఉన్నా ప్రయోజనం లేదు 

పైరసీని అరికట్టే విషయంలో చిత్ర పరిశ్రమ ఎన్నో ప్రయత్నాలు   చేస్తున్నా అవి ఫలించడం లేదు.   ‘అభిమానులు, ప్రేక్షకులు పైరసీని ప్రోత్సహించవద్దు’ అని కోరడం మినహా మరేమీ చేయలేకపోతున్నారు. పైరసీ అడ్డుకట్టకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు చెప్పడం పరిపాటిగా మారింది. ఫిలిం ఛాంబర్‌లోని పైరసీ వ్యతిరేక విభాగం చేస్తున్న ప్రయత్నాలు పైరసీకి పూర్తి స్థాయిలో  అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌, కాపీ రైట్‌ యాక్ట్‌ కింద  సైబర్‌ క్రైమ్‌ విభాగం కేసులు పెడుతున్నా కొన్నిసార్లే అరె్‌స్టలు జరుగుతున్నాయి. సుదీర్ఘకాలం సాగే దర్యాప్తు కారణంగా కొంతమంది నిర్మాతలు ఫిర్యాదు చేసేందుకు ఆసక్తి చూపటం లేదు. అధునాతన టెక్నాలజీ వాడడంతో పైరసీ చేసేవాళ్లను పట్టుకోవడం కష్టం అవుతోంది. చట్టాలు ఉన్నా ప్రయోజనం దక్కడం లేదు. తమ ప్రత్యర్థి హీరోలకు చెందిన సినిమా పైరసీ లింక్‌లను అభిమానులు సోషల్‌ మీడియాలో విచ్చలవిడిగా షేర్‌ చేసి  ఎంజాయ్‌ చేస్తున్న సంఘటనలు ఉన్నాయి.  మరి పైరసీ భూతాన్ని అంతమొందించే రోజు ఎప్పుడు వస్తుందో ఏమో!

Updated Date - 2021-09-26T05:16:59+05:30 IST